ఔను.. బీజేపీతో క్విడ్ ప్రోకో నిజమే.. బట్టబయలు చేసిన వైసీపీ ఎంపి

నీకిది.. నాకిది అన్న ఒప్పందం.. సంబంధం కేంద్రంలోని బీజేపీ సర్కార్ తో తమకు ఉందని వైసీపీ ఎంపీ ఒకరు కుండ బద్దలు కొట్టేశారు. ఏలూరు ఎంపీ కోటగిరి శ్రీధర్ గత మూడేళ్లుగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి వైసీసీ మద్దతు ఇస్తున్నదని అంగీకరించారు. అందుకు ప్రతిగా కేంద్రం అన్ని విధాలుగా రాష్ట్రానికి సహాయ సహకారాలు అందిస్తోందని చెప్పేశారు. దీంతో ఇప్పటి దాకా గుట్టుగా ఉన్న బీజేపీ- వైసీపీ క్విడ్ ప్రోకో సంబంధం లేదా అనుబంధం ఇప్పుడు బట్టబయలైపోయింది.  కోటగిరి శ్రీధర్ వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్నాయి.

మాకు మీరు మద్దతు ఇవ్వండి మీకు మేం సహరకిస్తాం అంటూ బీజేపీ- వైసీపీల మధ్య రహస్య ఒప్పందం ఉందని గత మూడేళ్లుగా విపక్షాలు ఆరోపణలు గుప్పిస్తూనే ఉన్నాయి. అయితే అలాంటిదేమీ లేదని బీజేపీ, వైపీపీలు రెండూ రాజకీయ డ్రామాలతో రక్తి కట్టిస్తూ వచ్చాయి.  తలుపు చెక్కతో నువ్వొకటను.. తమలపాకుతో నేను రెండంటా అన్న చందంలో రాష్ట్రంలో బీజేపీ, వైసీపీలు పరస్పరం విమర్శలు గుప్పించుకుంటూ ప్రజలను మభ్యపెడుతూ వచ్చారు. కానీ సాలూరు ఎంపీ వ్యాఖ్యలతో ఆ పార్టీల రహస్య మైత్రి ఇప్పుడు బట్టబయలైపోయింది.

కేంద్రంలోని మోడీ సర్కార్ కు జగన్ ప్రభుత్వం అన్ని అంశాలలోనూ మద్దతుగా నిలవడంలో రహస్యం ఏమీ లేదని కోటగిరి శ్రీధర్ వస్పష్టంగా చెప్పేశారు.  గత మూడేళ్లుగా తమ ప్రభుత్వం అన్ని అంశాలలోనూ మోడీ సర్కార్ కు మద్దతు ఇస్తూనే ఉందని పలు సందర్భాలలో ప్రత్యక్షంగా మద్దతు ప్రకటించామనీ ఆయన అన్నారు. ఆ కారణంగానే కేంద్రం అన్ని విధాలుగా రాష్ట్రానికి అండగా నిలుస్తూ సహాయ సహకారాలు అదిస్తోందని చెప్పారు.

ఇంత కాలంగా అవే ఆరోపణలు చేస్తున్న విపక్షాలకు కోటగిరి శ్రీధర్ వ్యాఖ్యలు బలాన్ని చేకూర్చడమే కాకుండా.. జగన్ తనపై ఉన్న అక్రమాస్తుల కేసుల విచారణను తప్పించుకోవడానికే కేంద్రంలోని మోడీ ప్రభుత్వానికి మద్దతుగా నిలుస్తున్నారనీ, రాష్ట్రానికి మొండి చేయి చూపినా పన్నెత్తు మాట కూడా అనడం లేదనీ మరింత పదునైన విమర్శలు సంధించేందుకు అవసరమైన ముడి సరుకుని కోటగిరి శ్రీధర్ వ్యాఖ్యలు విపక్షాలకు అందించాయి.

ఇక్కడితో ఆగకుండా కోటగిరి శ్రీధర్ 2024 ఎన్నికలకు బీజేపీ, వైసీపీల వ్యూహాన్ని కూడా వెల్లడించేశారు. 2024 ఎన్నికలలో వైసీపీ విజయానికి సహకరిస్తే కేంద్రంలో మోడీ ప్రభుత్వానికి మద్దతుగా నిలవడమే కాకుండా.. కేంద్ర ప్రభుత్వంలో వైసీపీ భాగస్వామి కూడా అవుతుందని కోటగిరి చెప్పారు. ఏపీకి కేంద్రం నిధుల విషయంలో ఉదారంగా సహకారం అందించడానికి జగన్ సర్కార్ కేంద్ర ప్రభుత్వానికి అన్ని విషయాలలోనూ మద్దతుగా నిలవడమే కారణమని అన్నారు. 2024 ఎన్నికలలో రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వస్తే రాష్ట్రానికి ప్రత్యేక హోదా కూడా సాధిస్తామని కోటగిరి విశ్వాసం వ్యక్తం చేశారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu