అమరావతిపై వైసీపీ అక్కసు.. కొమ్మినేని అరెస్టు అన్యాయమంట
posted on Jun 11, 2025 3:43PM

సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావును ఏపీ పోలీసులు అరెస్టు చేశారు. అమరావతి మహిళలను కించపరిచిన కేసులో ఆయన్ను అరెస్టు చేశారు. హైదరాబాద్ జర్నలిస్టు కాలనీలోని ఆయన ఇంటికి వెళ్లి అదుపులోకి తీసుకున్నారు. అక్కడి నుంచి ఏపీకి తీసుకువచ్చి మంగళగిరి కోర్టులో హాజరుపరచడంతో కోర్టు 14 రోజులు రిమాండ్ విధించింది. కొమ్మినేనిపై గుంటూరు జిల్లా తుళ్లూరు పోలీస్ స్టేషన్‌లో రాజధాని రైతులు, మహిళలు, రాష్ట్ర మాదిగ కార్పొరేషన్ డైరెక్టర్ కంభంపాటి శిరీష ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా హైదరాబాద్‌లో కొమ్మినేని శ్రీనివాసరావును అరెస్ట్ చేశారు.
అమరావతిలో ఉన్న తాడికొండ ఎస్సీ రిజర్వ్‌డ్ నియోజకవర్గంలోని దళిత మహిళలను అవమానిం చారన్న ఫిర్యాదుతో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ, ఇతర సెక్షన్ల కింద కేసు నమోదైనట్లు తెలుస్తోంది. కొమ్మినేనితో పాటు జర్నలిస్ట్ కృష్ణంరాజు, ఈ కార్యక్రమాన్ని ప్రసారం చేసిన చానెల్ యాజమాన్యంపైనా కేసు నమోదు చేశారు. కృష్ణంరాజు అనే జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు లైవ్ షోలో పాల్గొని అనుచిత వ్యాఖ్యలు చేశారు. అమరావతి దేవతల రాజధాని కాదని.. వేశ్యల రాజధాని అని వ్యాఖ్యానించడం తీవ్ర దుమారం రేపింది. ఆ అసభ్య వ్యాఖ్యలను నిలువరించకుండా కొమ్మినేని శ్రీనివాసరావు చర్చ కొనసాగించడం వివాదాస్పదమైంది.
విజయవాడ అయోధ్యనగర్ కాలనీలోని ఇంటికి తాళం వేసి కృష్ణం రాజు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. కొమ్మినేని శ్రీనివాసరావు డిబేట్‌లో అమరావతి మహిళలపై కృష్ణంరాజు చేసిన వ్యాఖ్యలతో రాజకీయం వేడెక్కింది. టీడీపీ, వైసీపీ నేతలు ఒకరిపై ఒకరు పోటా పోటీగా మాటల యుద్ధానికి దిగారు. మరోవైపు దీనిపై అమరావతి మహిళలు ఎక్కడికక్కడ నిరసనలు చేపడుతున్నారు. వైసీపీ నేతల తీరుపై భగ్గుమం టున్నారు. వైసీపీ నేతలు రాజధాని అమరావతిపై కక్ష కట్టి ఇలాంటి ఆరోపణలు చేయిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మహిళలను అవమానించేలా మాట్లాడిన వారిపై తగు చర్యలు తీసుకోకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరిస్తున్నారు.
అరెస్ట్ తర్వాత కొమ్మినేనిని తుళ్లూరు పోలీసుస్టేషన్‌ను తరలిస్తే.. అక్కడి ప్రజల ఆగ్రహావేశాలతో సమస్యలు తలెత్తుతాయని పోలీసులు ఆయనకు వైద్య పరీక్షల అనంతరం నల్లపాడు పోలీస్‌స్టేషన్‌కు తరలించి.. మంగళగిరి కోర్టులో మాజరుపరిచి రిమాండ్‌కు తరలించారు. రాష్ట్రవ్యాప్తంగా మహిళలు వైసీపీ మీడియాలో కొమ్మినేని, కృష్ణంరాజుల చర్చపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ .. మాజీ ముఖ్యమంత్రి జగన్, వైఎస్ భారతీరెడ్డి అమరావతి ప్రాంత మహిళలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.
అయితే క్షమాపణలు చెప్పడం కాదు కదా.. కొమ్మినేని అరెస్ట్‌ను జగన్ తప్పు పడుతున్నారు. కొమ్మినేని అరెస్టు కక్షసాధింపేనని, డిబేట్‌లో వ్యక్తులు మాట్లాడే మాటలకు.. యాంకర్‌కు ఏం సంబంధం అని ప్రశ్నిస్తున్నారు. మీడియాపై కావాలనే దాడులు చేస్తున్నారన్నారు. కొమ్మినేనిని చంద్రబాబు గతంలోనూ టార్గెట్ చేశారని ఎక్స్ వేదికగా విమర్శించారు. నాలుగేళ్ల తర్వాత అన్నింటికి సమాధానాలు చెప్పాల్సి ఉంటుందని మళ్లీ అధికారంలోకి వస్తామన్న ధీమాతో జగన్ వార్నింగులు ఇస్తున్నారు
కొమ్మినేని అరెస్టును తప్పుపట్టిన జగన్ ఆ చర్చలో కృష్ణంరాజు మాట్లాడింది తప్పేనని పరోక్షంగా అంగీకరించినట్లైంది. ముందు నుంచి అమరావతి రాజధానిపై వ్యతిరేకతతో ఉన్న జగన్ ఇంత జరుగుతున్నా ఇంకా అదే తరహాలో మాట్లాడుతుండటం విమర్శల పాలవుతోంది. జగన్ మూడు రాజధానుల ప్రతిపాదన తెచ్చినప్పుడు అమరావతికి భూములిచ్చిన రైతులు ఏళ్లతరబడి ఆందోళనలు నిర్వహించారు. అప్పట్లో వారిపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది.
తాజా వివాదంపై రాజధాని ప్రాంత రైతులు, స్థానిక మహిళలు భగ్గుమన్నారు. కొమ్మినేని, కృష్ణంరాజుకు వ్యతిరేకంగా నిరసనలు, ఆందోళనలు చేపడుతున్నారు. వాళ్లిద్దరినీ కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. మరోసారి వైసీపీ నేతలు అమరావతిపై అక్కసు వెళ్లగక్కుతున్నారు. నిరసన తెలుపుతున్న అమరావతి మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేశారు వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి. ఆ మహిళల్ని పిశాచాలుగా అభివర్ణించారు. రాక్షసులు కూడా అలా చేయరని.. అదో ఆర్గనైజ్‌డ్ తెగ అని సజ్జల వ్యాఖ్యానించడంపై మహిళలు మరింత రగిలిపోతున్నారు
మరోవైపు సాటి మహిళలపై చేసిన వ్యాఖ్యలను ఖండించాల్సిన మాజీ మంత్రి రోజా కూడా కొమ్మినేనికి వకాల్తా పుచ్చుకుని మాట్లాడుతున్నారు. కృష్ణంరాజు చేసిన అనుచిత వ్యాఖ్యలను కొమ్మినేని ఖండిచారంట. ఎవరో చేసిన వ్యాఖ్యలకు కొమ్మినేని అరెస్ట్ చేశారంట. మరి ఖండిస్తే ఆ డిబేట్ అంతసేపు ఎలా కొనసాగిందో మాజీ మంత్రి రోజాకి తెలియదా అని దుమ్మెత్తి పోస్తున్నారు.
కొమ్మినేని లైవ్ షోలో కృష్ణంరాజు చేసిన వ్యాఖ్యలు తప్పే అని అంగీకరిస్తున్న వైసీపీ.. ఆ డిబేట్ కొనసా గించిన కొమ్మినేనిని మాత్రం సమర్ధిస్తుండటం లాజిక్ లేకుండా తయారైదంటున్నారు. మీడియా వ్యక్తి అయినప్పటికీ సజ్జల రామకృష్ణారెడ్డి తిరిగి అమరావతి మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేయడం చూస్తుంటే అమరావతిపై ఆ పార్టీ స్టాండ్ ఏంటో? రాజధానిపై వైసీపీ నేతలకు ఎంత వ్యతిరేకత ఉందో స్పష్టమవుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.