మాధవ్ వీడియోపై మడమ తిప్పిన వైసీపీ

హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ న్యూడ్ వీడియో కాల్ వ్యవహారంపై విపక్షాలే కాకుండా, రాష్ట్ర ప్రజలు కూడా నిరసనలు కొనసాగిస్తూనే ఉన్నారు. మీడియాలో, సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఆ అశ్లీల వీడియో గోరంట్ల మాధవ్ దే అని తేలితే.. కఠిన చర్యలు తప్పవని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి గతంలో ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే.. ఆ వీడియోపై ప్రతిపక్ష టీడీపీ విమర్శల తీవ్రత పెంచింది. దీంతో మాట తప్పి మడమ తిప్పిన వైసీపీ ఇప్పుడు మాధవ్ పై చర్యలు తీసుకోకుండా.. ప్రతిపక్షాలపై మాటల దాడితో విరుచుకుపడుతోంది.

 నిజానికి ఆ వీడియో గోరంట్ల మాధవ్ దే అని స్పష్టం అయి, పార్టీ పరంగా చర్యలు తీసుకుంటే..  బీసీల నుంచి  తీవ్ర వ్యతిరేకత తప్పదనే భయం వైసీపీని వెంటాడుతున్నట్లుంది. అందుకేనేమో చర్యల మాట పక్కన పెట్టేసింది వైసీపీ. ఒక పక్కన ఆ వీడియోను ఫోరెన్సిక్ ల్యాబ్ పరీక్షకు పంపకుండానే అది ఫేక్ వీడియో అని అనంతపురం జిల్లా ఎస్పీ ఫకీరప్పతో ఒక ప్రకటన చేయించి, సమస్యను వైసీపీ మరింత జఠిలం చేసిందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. ఒరిజినల్ వీడియో దొరికితే ఫోరెన్సిక్ పరీక్షకు పంపుతామని ఫకీరప్ప ప్రకటించారు. దీంతో ఆ వీడియోను తెలుగుదేశం అగమేఘాల మీద అమెరికాకు చెందిన ప్రముఖ ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపించి, రిపోర్టు తెప్పించింది. ఆ వీడియోను ఎలాంటి ట్యాంపరింగ్ చేయలేదని, ఒరిజినలే అని టీడీపీ తన విమర్శలకు పదును పెట్టింది. 

గోరంట్ల మాధవ్ వీడియో ఒక పక్కన టీడీపీ- వైసీపీ మధ్య వివాదంగానే కాకుండా.. కమ్మ- కురబ కులాల మధ్య చిచ్చు రేపేలా మారింది. నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న గోరంట్ల మాధవ్.. అది తనపై కమ్మ సామాజికవర్గం చేసిన కుట్ర అంటూ అసభ్య పదజాలంతో విమర్శలు గుప్పించడం గమనార్హం. మాధవ్ చేసిన వ్యాఖ్యల్ని కమ్మ సామాజికవర్గానికి చెందిన అనేక మంది తీవ్రంగా ఖండించారు. పరుష పదజాలంతో మాధవ్ పై విరుచుకుపడ్డారు.

గోరంట్ల మాధవ్ అశ్లీల వీడియో వ్యవహారాన్ని ఏపీ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ దృష్టికి మహిళా జేఏసీ నేతలు తీసుకెళ్లారు. మాధవ్ కు క్లీన్ చిట్ ఇచ్చేలా మాట్లాడిన ఫకీరప్పపై గవర్నర్ కు వారు ఫిర్యాదు చేశారు. న్యూడ్ వీడియో వ్యవహారం నుంచి బయట పడేందుకు సామాజికవర్గాన్ని మాధవ్ వాడుకుంటున్నారని ఫైరయ్యారు. మాధవ్ కు నీతి, నిజాయితీ ఉంటే.. లోక్ సభ ప్రివిలేజ్ కమిటీకి ఎందుకు ఫిర్యాదు చేయలేదని మహిళా జేఏసీ నేతలు ప్రశ్నిస్తున్నారు. మరో పక్కన కురుబ నేతలు కూడా మాధవ్ పై మండిపడుతుండడం విశేషం. కురుబలకు మాధవ్ ఒరగబెట్టిందేమీ లేకపోగా, నమ్మి ఓట్లు వేస్తే తమ ఆత్మగౌరవాన్ని మాధవ్ బజారుకీడ్చారంటూ ఫైరవుతుండడం గమనార్హం. 

కాగా.. ఈ అశ్లీల వీడియోపై అటు టీడీపీ ఇటు వైసీపీ ఎందుకు అంత సీరియస్ గా తీసుకుంటున్నాయనే చర్చ ఏపీ వ్యాప్తంగా జరుగుతోంది. ఒక మహిళతో మాధవ్ అశ్లీలంగా వీడియో మాట్లాడుతూ దొరికిపోయిన వ్యవహారం ఇప్పటికే వైసీపీ- టీడీపీ మధ్య జరుగుతున్న వార్ కు ఆజ్యం పోసినట్లయింది. మాధవ్ అశ్లీల వీడియోపై టీడీపీ ఏ మాత్రం పట్టు వీడడం లేదు. అశ్లీల వీడియోతో దొరికిపోయిన మాధవ్ ను సస్పెండ్ చేయాలని వైసీపీపై ఒత్తిడి పెంచుతూనే ఉంది. మరో పక్కన మాధవ్ వీడియోపై లోక్ సభ స్పీకర్ కు కాంగ్రెస్ ఎంపీ ఫిర్యాదు చేశారు.

జాతీయ మహిళా కమిషన్ కూడా దీనిపై ఘాటుగానే స్పందించింది. టీడీపీ విమర్శల దాడి పెంచండంతో వైసీపీ నేతలు, ఆ పార్టీ ప్రభుత్వ పెద్దలు మాట మార్చేశారు. మాధవ్ పై చర్యలు తీసుకుంటే బీసీ సామాజికవర్గాలు తమకు దూరం అవుతాయనే భయం వైసీపీని వెన్నాడుతున్నట్లు చెబుతున్నారు. అదే సమయంలో మాధవ్ పై చర్యలు తీసుకునేలా జగన్ పై ఒత్తిడి పెంచి, విజయం సాధించి బీసీల మద్దతు వైసీపీకి దూరం చేయొచ్చనే వ్యూహంతో టీడీపీ ముందుకు వెళ్తున్నట్లు ఉందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఈ క్రమంలోనే అటు టీడీపీ ఇటు వైసీపీ కూడా మాధవ్ వీడియో వ్యవహారాన్ని సీరియస్ గానే తీసుకున్నాయంటున్నారు.