ఉండిలో ప్రచారం ఆపేసిన వైసీపీ.. ఎందుకంటే?

రఘురామకృష్ణం రాజు.. పరిచయం అక్కర్లేని పేరు. గత నాలుగున్నరేళ్లుగా జగన్ ప్రభుత్వ అరాచకాలపై అలుపెరుగని పోరాటం చేస్తున్న వ్యక్తి. గత ఎన్నికలలో వైసీపీ అభ్యర్థిగా నరసాపురం లోక్ సభ స్థానం నుంచి విజయం సాధించిన రఘురామకృష్ణం రోజు.. ఆ తరువాత కొద్ది రోజులకే జగన్ విధానాలతో విభేదించి రెబల్ గా మారారు. నిత్యం జగన్ అరాచకపాలనను విమర్శిస్తూ వచ్చారు. ఆ క్రమంలో ఆయనపై జగన్ సర్కార్ కేసులు బనాయించింది. ఆయనను కస్టడీలోకి తీసుకుని ధర్డ్ డిగ్రీ కూడా ప్రయోగించింది. అయితే అన్నిటినీ తట్టుకుని జగన్ అస్తవ్యస్థ, అరాచక, అసమర్థ పాలనపై అలుపెరుగని పోరాటం చేస్తూనే ఉన్నారు. ఈ క్రమంలోనే ఆయన కూటమి అభ్యర్థిగా నరసాపురం లోక్ సభ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారని అంతా భావించారు.

తెలుగుదేశం, జనసేన, బీజేపీ పొత్తులో భాగంగా నరసాపురం లోక్ సభ స్థానం బీజేపీకి దక్కడంతో ఆయన ఆ పార్టీ నుంచే పోటీ చేస్తారని అంతా భావించినా, ఆయనకు బీజేపీ టికెట్ నిరాకరించడంతో చంద్రబాబు రంగంలోకి దిగి రఘురామకృష్ణం రాజును తెలుగుదేశంలో చేర్చుకుని ఆయనకు ఉండి అసెంబ్లీ టికెట్ ఇచ్చారు. ఉండిలో తెలుగుదేశం సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నప్పటికీ ఆయనను బుజ్జగించి మరీ చంద్రబాబు ఉండి నుంచి రఘురామకృష్ణం రాజును బరిలోకి దింపారు. తెలుగుదేశం సిట్టింగ్ ఎమ్మెల్యే రామరాజు రఘురామకృష్ణం రాజు విజయం కోసం చురుకుగా ప్రచారంలో పాల్గొంటున్నారు.

అయితే ఉండిలో తెలుగుదేశం టికెట్ ఆశించి భంగపడిన  శివరామరాజు స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచారు.  తొలుత శివరామ రాజు వైసీపీ గూటికి చేరేందుకు సిద్ధపడినప్పటికీ తెలుగుదేశం ఓట్లు చీల్చడం కోసం ఆయనను రెబల్ గా పోటీ చేయాలని జగన్ సూచించడంతో ఆయన ఇప్పుడు ఫార్వార్డ్ బ్లాక్ అభ్యర్థిగా రంగంలో ఉన్నారు. 

ఇంతలో ఏమైందో ఏమో కానీ గత కొన్ని రోజులుగా ఉండిలో వైసీపీ ప్రచారం నిలిచిపోయింది. విశ్వసనీయ సమాచారం మేరకు పార్టీ అధినేత జగన్ స్వయంగా ఉండిలో పార్టీ నేతలు, క్యాడర్ కు ప్రచారాన్ని నిలిపివేయాలనీ, అలాగో డబ్బులు కూడా వ్యయం చేయవద్దనీ ఆదేశించారు. జగన్ స్వయంగా వైసీపీ అభ్యర్థి నరసింహరాజుకు ఫోన్ చేసి నియోజకవర్గంలో ప్రచారాన్ని నిలిపివేయాలని ఆదేశించారు. ఇందు వల్ల తెలుగుదేశం రెబల్ అభ్యర్థికి ప్రయోజనం చేకూరుతుందనీ, శివరామరాజు తన సొంత పలుకుబడితో తెలుగుదేశం ఓట్లను చీల్చే అవకాశం ఉంటుందనీ జగన్ భావిస్తున్నట్లు చెబుతున్నారు. అయితే ఇప్పటికీ నియోజకవర్గంలో రఘురామకృష్ణం రాజు ప్రచారంలో ముందున్నారు. ప్రజల మద్దతును కూడగట్టుకున్నారు. రెబల్ ఉనికి ఉండిలో నామమాత్రంగానే ఉందని పరిశీలకులు అంటున్నారు. ఈ స్థితిలో వైకాపా రెబల్ అభ్యర్థికి మద్దతుగా ప్రచారాన్నిఆపివేయడం రఘురామకృష్ణం రాజుకే ప్లస్ అవుతుందని విశ్లేషిస్తున్నారు.