ఇరాన్ అధ్యక్షుడి హెలికాప్టర్‌కి ప్రమాదం: ఆచూకీ లేదు!

ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ (Ebrahim Raisi) ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ప్రమాదానికి గురైంది. ఆయన అజర్ బైజాన్ వెళ్తూ వుండగా వాతావరణం అనుకూలించక హెలికాప్టర్ కూలిపోయిందని తెలుస్తోంది. తూర్పు అజర్‌బైజాన్ ప్రావిన్స్.లోని జోల్ఫా సమీపంలో హెలికాప్టర్ కూలిపోయినట్టు తెలుస్తోంది. అయితే హెలికాప్టర్లో వున్న ఇబ్రహీం రైసీ జీవించి వున్నారా లేదా అనే దాని మీద ఇంకా స్పష్టత రాలేదు. ఆయన జీవించి వుండే అవకాశాలు తక్కువేననే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. కూలిపోయిన హెలికాప్టర్లో ఇరాన్ అధ్యక్షుడితోపాటు విదేశాంగ శాఖ మంత్రి హోసేన్ అమిరాబ్దోల్లాహియన్, తూర్పు అజర్‌బైజాన్ ప్రావిన్స్ గవర్నర్, మరికొంతమంది అధికారులు వున్నట్టు తెలుస్తోంది. హెలికాప్టర్ కూలిపోయిన సంఘటనపై ఇరాన్ నుంచి అధికారికంగా ఇంతవరకు ప్రకటన వెలువడలేదు. హెలికాప్టర్ ప్రయాణిస్తూ వుండగా భారీ వర్షం, గాలుల వల్ల హెలికాప్టర్ ప్రమాదానికి గురైనట్టు సమాచారం. కూలిన హెలికాప్టర్ కోసం గాలింపు జరుగుతోంది. అయితే వర్షం, గాలులు, మంచు తెరల కారణంగా గాలించడం కష్టంగా మారింది. తమ అధ్యక్షుడికి ఏమీ కాకూడదని, ఆయన క్షేమంగా తిరిగి రావాలని ఇరాకీయులు ప్రార్థనలు చేస్తున్నారు. ఇతర కార్యక్రమాలన్నీ ఆగిపోయాయి. కూలిపోయిన హెలికాప్టర్ 1980 నాటిదని తెలుస్తోంది. అజర్ బైజాన్‌లో ఒక డ్యామ్ ప్రారంభ కార్యక్రమానికి ఇబ్రహీం వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.