కారు నేతల్లో చిన్న‌సారుకు సీన్ లేదా?!

రాజ‌కీయాల్లో ఓడ‌లు బండ్లు.. బండ్లు ఓడలు కావ‌డానికి పెద్ద  ఎక్కువ కాలం ప‌ట్ట‌దు. అధికారంలో ఉన్నంత సేపు ఈగ‌ల గుంపులా పార్టీ ముఖ్యుల చుట్టూ ప్రదక్షిణలు చేసే నేత‌లు.. అధికారంలో కోల్పోయిన త‌రువాత వారి వైపు కూడా చూడ‌రు. రాజ‌కీయాల్లో ఈ విష‌యం సాధార‌ణంగా జ‌రిగేదే. ప్ర‌స్తుతం ఆ అనుభ‌వం బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు స్ప‌ష్టంగా బోధప‌డుతోంది. కేటీఆర్ మంత్రిగా ఉన్న స‌మ‌యంలో ఆయ‌న అపాయింట్ మెంట్ కోసం చాలా మంది నేత‌లు ఎదురు చూసేవారు. అవ‌కాశం దొరికితే కాబోయే సీఎం కేటీఆర్ అంటూ ఆకాశానికి ఎత్తేశారు కూడా. ప‌రిస్థితులు తిర‌గబ‌డ‌టానికి ఎంతో కాలం ప‌ట్ట‌లేదు. గ‌తేడాది చివ‌రిలో జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల్లో బీఆర్ఎస్ అధికారాన్ని కోల్పోయింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావ‌టంతో బీఆర్ఎస్ లోని ప‌లువురు కీల‌క నేత‌లు, ద్వితీయ స్థాయి నేత‌లు కాంగ్రెస్ గూటికి చేరిపోయారు. కేసీఆర్‌, కేటీఆర్ ల‌కు అత్యంత ద‌గ్గ‌ర వ్య‌క్తులు సైతం కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లారు. ఇప్పుడు ఇంకా బీఆర్ఎస్ లో ఉన్న‌ నేత‌లు సైతం అవ‌కాశాన్నిబ‌ట్టి ఎప్పుడైనా గోడదూకేస్తారన్న సంకేతాలే కనబడుతున్నాయి. ఈ నెల‌లో జ‌రిగిన లోక్ స‌భ ఎన్నిక‌ల ఫ‌లితాలు జూన్ 4న వెల్ల‌డి కానున్నాయి. ఈ ఫ‌లితాల్లో బీఆర్ఎస్ క‌నీసం 8 నుంచి తొమ్మిది స్థానాల్లో విజ‌యం సాధించ‌క‌పోతే ఆ పార్టీని వీడే నేత‌ల సంఖ్య భారీగానే ఉంటుంద‌ని రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ జ‌రుగుతోంది.

 బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కేటీఆర్ రాజ‌కీయాల్లో క్రియాశీల‌కంగా ఉన్న‌ప్ప‌టినుంచి ప్ర‌తిప‌క్ష పాత్ర  పోషించ‌లేదు. గ‌తంలో కేసీఆర్‌, హ‌రీశ్ రావులు తెలంగాణ ఉద్య‌మ స‌మ‌యంలో పార్టీని ముందుండి న‌డిపించారు. ప్ర‌త్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు త‌రువాత బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తరువాతే కేటీఆర్ పార్టీలో కీల‌క భూమిక పోషిస్తూ వ‌చ్చారు. మంత్రిగా ప్ర‌భుత్వ పాల‌న‌లో, వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ హోదాతో పార్టీలో నెంబ‌ర్ 2గా కేటీఆర్ కొన‌సాగారు. దీంతో బీఆర్ఎస్ నేత‌లు, కార్య‌క‌ర్త‌లు కేటీఆర్ ను సీఎం స్థాయిలో చూస్తూ వ‌చ్చారు. పార్టీలోని ముఖ్య‌నేత‌లు సైతం ప‌ద‌వులకోసం కేటీఆర్ చుట్టూ ప్ర‌ద‌క్షిణ‌లు చేశారు.  కేసీఆర్, కేటీఆర్ ఏం చెబితే అది పార్టీ నేత‌లు శాస‌నంగా భావిస్తూ వ‌చ్చారు. కానీ, ప్ర‌స్తుతం ప‌రిస్థితి మారిపోయింది. అధికారం కాల్పోవ‌డంతో కేటీఆర్ హ‌వా కూడా పార్టీ నేత‌ల్లో క్ర‌మంగా త‌గ్గుతూ వ‌చ్చింది. కాంగ్రెస్ అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత నిర్వ‌హించిన అసెంబ్లీ స‌మావేశాల్లో పార్టీ శ్రేణులు ఆశించిన స్థాయిలో కేటీఆర్ రాణించ‌ లేక పోయారు. కాంగ్రెస్ ప్ర‌భుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు కేటీఆర్ చేసిన‌ ప్ర‌య‌త్నాలు విఫ‌ల‌మ‌య్యాయి. అధికారంలోఉన్న స‌మ‌యంలో అసెంబ్లీ స‌మావేశాల్లో విప‌క్షాల‌పై విరుచుకుప‌డుతూ బెంబేలెత్తించిన కేటీఆర్‌.. ప్ర‌తిప‌క్ష హోదాలో పార్టీ శ్రేణులు ఆశించిన స్థాయిలో కాంగ్రెస్ స‌భ్యుల దూకుడును ఎదుర్కోలేక పోయారు. దీంతో, హ‌రీశ్ రావు ఫ్రంట్ రోల్ లోకి వ‌చ్చి కాంగ్రెస్ స‌భ్యులకు దీటైన స‌మాధానం చెప్పారు.

 బీఆర్ ఎస్ పార్టీ అధికారం కోల్పోయిన త‌రువాత కేటీఆర్ హ‌వా పార్టీలో తగ్గుతూ వ‌స్తోందన్న విష‌యం తాజాగా మ‌రోసారి స్ప‌ష్ట‌మైంది.  ఖ‌మ్మం - వ‌రంగ‌ల్ - న‌ల్గొండ ఉమ్మ‌డి జిల్లాల నియోజ‌క‌వ‌ర్గ  గ్రాడ్యుయేష‌న్ ఎమ్మెల్సీ ఎన్నికకు  ఈనెల 27న పోలింగ్ జ‌ర‌గ‌నుంది. జూన్ 5న ఫ‌లితాలు వెల్ల‌డి కానున్నాయి.  ఈ ఎన్నిక‌ల్లో అధికార కాంగ్రెస్ పార్టీ, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల అభ్య‌ర్థులు పోటీ ప‌డుతున్నారు. కాంగ్రెస్ అభ్యర్థిగా తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్, బీఆర్ఎస్ అభ్యర్థిగా ఏనుగుల రాకేష్ రెడ్డి,  బీజేపీ అభ్యర్థిగా ప్రేమేందర్ రెడ్డి బరిలో ఉన్నారు.  బీఆర్ఎస్ అభ్య‌ర్థిగా రాకేశ్ రెడ్డి ఎంపిక‌పై మూడు ఉమ్మ‌డి జిల్లాల్లోని బీఆర్ఎస్ కీల‌క‌ నేత‌లు అసంతృప్తిగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌చ్చాయి. త‌మ‌ను సంప్ర‌దించ‌కుండానే ప‌ల్లా రాజేశ్వ‌ర్ రెడ్డి మ‌నిషి అయిన రాకేశ్ రెడ్డికి ఏక‌ప‌క్ష నిర్ణ‌యంతో కేసీఆర్, కేటీఆర్ టికెట్ ఇచ్చార‌ని స‌ద‌రు నేత‌లు ఆగ్ర‌హంతో ఉన్నార‌ని ప్ర‌చారం జ‌రిగింది. ఆ ప్ర‌చారం నిజ‌మేన‌ని  రెండు రోజుల క్రితం స్ప‌ష్ట‌మైంది. ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో రాకేశ్ రెడ్డి విజ‌యానికి అనుస‌రించాల్సిన వ్యూహాల‌పై స‌మీక్ష నిర్వ‌హించేందుకు రావాల‌ని మూడు ఉమ్మ‌డి జిల్లాల పార్టీ ముఖ్య‌ నేత‌ల‌కు  కేటీఆర్ ఆదేశాలు జారీ చేశారు. కానీ  ఆ స‌మావేశానికి ప‌లువురు నేత‌లు గైర్హాజరయ్యారు. కేవ‌లం కొద్ది మంది మాత్ర‌మే హాజ‌ర‌య్యారు. దీంతో పార్టీలో ఈ విష‌యం పెద్ద చ‌ర్చ‌నీయాంశంగా మారింది. కేటీఆర్ పిలిచినా నేత‌లు స‌మావేశంకు హాజ‌రుకాక‌పోవ‌టం  పార్టీలో కేటీఆర్ హ‌వా త‌గ్గిపోయింద‌నడానికి నిదర్శనంగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.

ఇప్పటికే రాష్ట్రంలో బ‌ల‌ప‌డేందుకు బీజేపీ ప్ర‌య‌త్నాలు చేస్తోంది. అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఆపార్టీ ప్ర‌భావం స్ప‌ష్టంగా క‌నిపించింది. కేంద్రంలో మ‌రోసారి బీజేపీ అధికారంలోకి వ‌స్తే  బీఆర్ఎస్ లోని ముఖ్య‌నేత‌లు బీజేపీ, కాంగ్రెస్ పార్టీల్లోకి క్యూక‌ట్ట‌డం ఖాయ‌ంగా క‌నిపిస్తోంది. ఇప్ప‌టికే కాంగ్రెస్ నేత‌లు మీడియా స‌మావేశాల్లో లోక్ స‌భ ఫ‌లితాల త‌రువాత బీఆర్ ఎస్ నుంచి పెద్ద సంఖ్య‌లో కాంగ్రెస్ లోకి వలసలు ఉంటాయని చెప్పారు. అదే జ‌రిగితే రానున్న కాలంలో బీఆర్ ఎస్ పార్టీకి మ‌రింత గ‌డ్డు ప‌రిస్థితులు ఎదుర‌వ‌డం ఖాయం. అలాంటి ప‌రిస్థితుల‌ను కేటీఆర్ స‌మ‌ర్ధ‌వంతంగా ఎదుర్కొంటారని కానీ, ఎదుర్కోగలుగుతారని కానీ  పార్టీ శ్రేణులు బావించ‌డం లేదు. కేసీఆర్‌, హ‌రీశ్ రావులు యాక్టివ్ పాత్ర పోషిస్తేనే పార్టీ మ‌నుగ‌డ సాధ్య‌మ‌వుతుంద‌నీ, కేటీఆర్ చేతిలోకి పార్టీ ప‌గ్గాలు వెడితే పార్టీ మనుగడే ప్రశ్నార్ధకమౌతుందనీ బీఆర్ఎస్ శ్రేణులే అంటున్నాయి.