అధినేత బెంగళూరులో: నేతలు తెలంగాణలో.. ఏపీలో వైసీపీ పరిస్థితి.?
Published on: Sat Nov 28, 2026 10:46AM

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ క్యాడర్ పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. పార్టీ అధినేత బెంగళూరు యలహంక ప్యాలెస్ లో ఉంటుంటే, ఆ పార్టీ కీలక నేతలు తెలంగాణలో మకాం వేశారు. ఇందుకు కారణాల గురించి ఇప్పుడు మనం మాట్లాడుకోనవసరం లేదు కానీ, ఏపీలో పార్టీ పరిస్థితి ఏంటో అర్ధం కాక వైసీపీ క్యాడర్ జుట్టు పీక్కుంటున్నారు. పార్టీ పరంగా ఎటువంటి దిశా నిర్దేశం లేకపోవడం, స్థానికంగా నేతలెవరూ అందుబాటులో లేకపోవడంతో రాష్ట్రంలో వైసీపీ పరిస్థితి ఉండీ లేనట్లుగా మారిపోయింది.
ఇది ఇటీవలి స్థానిక ఎన్నికలలో విస్పష్టంగా ప్రస్ఫుటమైంది. 2024 ఎన్నికలలో ఎదురైన ఘోర పరాజయానికి మించి స్థానిక ఎన్నికల ఫలితాలు ఉన్నాయి. 2024 సార్వత్రిక ఎన్నికల్లో కేవలం 11 స్థానాలకే పరిమితమైన తర్వాత నుంచి పార్టీ పరిస్థితి నానాటికీ తీసికట్టు నాగంభొట్లు అన్నట్లుగా మారుతోందన్న విశ్లేషణలు గతంలోనూ వెలువడ్డాయి. తాజాగా స్థానిక ఎన్నికలలో ఆ పార్టీ పర్ఫార్మెన్స్ చూస్తే ఆ విశ్లేషణలు అక్షర సత్యాలుగా రాజకీయవర్గాలలో చర్చ జరుగుతోంది. 2024 ఎన్నికలలో పార్టీ ఘోరంగా పరాజయం పాలైన.. 40 శాతం ఓట్ షేర్ ఉందని సొంత భుజాలను చరుచుకున్న వైసీపీ నేతలు, ఇప్పుడు స్థానిక సమరంలో పార్టీకి వచ్చిన ఓట్ల శాతం గణనీయంగా తగ్గడంపై ఏ మాట్టాడతారో చూడాల్సి ఉంది.

గత ఎన్నికల పరాజయం అనంతరం వైసీపీ నాయకులు ఈవీఎంల పై పలు విమర్శలు చేశారు. అదే బ్యాలెట్ పద్ధతిలో ఎన్నికలు జరిగి ఉంటే విజయం తమనే వరించి ఉండేదని చెప్పుకున్నారు. 2019లో వైసీపీ విజయం సాధించిన సమయంలోనూ ఈవీఎంలపై ప్రశంసలు కురిపించిన విషయాన్ని కన్వీనియెంట్ గా మరచి పోయారు. అది పక్కన పెడితే.. తాజా స్థానిక సమరం బ్యాలెట్ పద్ధతిలోనే జరిగింది. కానీ ఈ సారి కూడా వైసీపీకి ఘోర పరాజయమే ఎదురైంది. దీంతో ఎన్నికల అక్రమాలు అంటూ వైసీపీయులు గొంతు సవరించుకుంటున్నారు.
ఇది కూడా చదవండి: ఏపీ స్థానిక సమరం: వైసీపీకి దిమ్మతిరిగే పరిణామాలు.. ఎనిమిది మునిసిపాలిటీలు ఏకగ్రీవం.?
అయితే విశ్లేషకులు మాత్రం స్థానిక సమరంలో వైసీపీ పరాజయానికి అధినేత బెంగళూరు మకాం, నేతల తెలంగాణలో ఉండటంతో, క్యాడర్ లో నెలకొన్న నిస్తేజతే ఈ ఓటమికి ప్రధాన కారణంగా చెబుతున్నారు. అధినేత వారానికోసారి తాడేపల్లి ప్యాలెస్ లో ప్రెస్ మీట్ కో, లేదా అడపాదడపా పరామర్శ యాత్రలకో పరిమితం కావడం. ఇక నాయకులు కూడా క్షేత్రస్థాయిలో కార్యకర్తలకు అండగా ఉండటం మాని చాలా వరకూ హైదరాబాద్ లోనే మకాం వేయడంతోనే పార్టీకి ఈ పరిస్థితి ఏర్పడిందంటున్నారు. ఎక్కడైనా, ఏ రాష్ట్రంలోనైనా స్థానిక ఎన్నికలు ఎ క్షేత్రస్థాయిలో పార్టీల బలానికి అద్దం పడతాయి. గ్రామ, మండల, పట్టణ స్థాయిలో ఏ పార్టీ క్యాడర్ చురుకుగా పనిచేస్తుందో ఆ పార్టీయే స్థానిక ఎన్నికల్లో ప్రభావం చూపుతుంది.

ముఖ్యంగా పార్టీ అధికారంలో లేని సమయంలో సదరు పార్టీ నాయకత్వం, అధిష్ఠానం క్షేత్రస్థాయిలో క్యాడర్ కు అందుబాటులో ఉంటూ, ఎప్పటికప్పుడు దిశా నిర్దేశం చేయడం ముఖ్యం. అయితే వైసీపీలో పరిస్థితి అందుకు పూర్తిగా భిన్నంగా ఉండటమే స్థానక సమరంలో ఘోర పరాజయానికి కారణంగా రాజకీయవర్గాలు అంటున్నాయి. ఇదే పరిస్థితి కొనసాగితే, ముందు ముందు వైసీపీ పరిస్థితి మరింత దయనీయంగా మారే అవకాశాలున్నాయని పార్టీ శ్రేణులే బాహాటంగా చెబుతున్నారు. ఇప్పటికైనా పార్టీ అధినేత, నాయకులు క్రియాశీలంగా మారి క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతంపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని అంటున్నారు.
మీకు నచ్చవచ్చు: స్థానిక సమరం: జగన్ ఇలాకాలోనే వైసీపీ పరిస్థితి ఇలాగైందేంటి.?
పులివెందులలోనూ వైసీపీ కుదేలు: రాజకీయం పతనానికి సంకేతమేనా?
[YCP Localelections, Miserable Defeat, Reason, Jagan Bengaluru, Leaders, Telangan, Cader, Confuse, TeluguOne]


