భ్ర‌మ‌లు తొల‌గిపోయాయా?

విజయసాయిరెడ్డి రాజీనామా వైసీపీ నేతలకు దిమ్మతిరిగి బొమ్మ కనిపించేలా చేసింది. నోటికి తాళాలు వేసింది. తన రాజకీయ భవిష్యత్ పై బెంగపుట్టేలా చేసింది. ఇంత కాలం కూట‌మి ప్ర‌భుత్వం మ‌రికొద్ది నెల‌ల్లో కూలిపోతుంది.. మ‌ళ్లీ మ‌న జ‌గ‌నే ముఖ్య‌మంత్రి అవుతారు.. మ‌రో రెండేళ్ల‌లో జ‌మిలి ఎన్నిక‌లు వ‌స్తాయి.. సీఎం అయ్యేది మ‌న జ‌గ‌నే.. క‌ళ్లు మూసి తెరిచేలోపు రెండేళ్లు అయిపోతాయి.. మ‌ళ్లీ జ‌గ‌నే ముఖ్య‌మంత్రి అవుతాడు అన్న భ్రమలను తొలగించేసింది.

నిన్న మొన్నటి వరకూ త‌మ పార్టీలో ఏం జ‌రుగుతుందో గుర్తించలేని నేత‌లు సైతం మైకుల ముందుకొచ్చి పూన‌కం వ‌చ్చిన‌ట్లు కూట‌మి ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు చేస్తూ వ‌చ్చారు. అయితే, ప్ర‌స్తుతం వైసీపీ నేత‌ల నోట మాట రావ‌డం లేదు. వైసీపీలో అంత‌ర్గ‌తంగా ఏం జ‌రుగుతుందో తెలియ‌క త‌ల‌లు ప‌ట్టుకుంటున్నారు. మ‌న భ‌విష్య‌త్ ఏంట్రా బాబూ అంటూ ఆ పార్టీలోని సీనియ‌ర్ నేత‌ల‌ నుంచి మండ‌ల స్థాయి నేతల వ‌ర‌కు డైల‌మాలో ప‌డిపోయారు. విజ‌య‌సాయి రెడ్డి రాజీనామా వైసీపీని ఓ కుదుపు కుదిపేసింది. జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి విదేశీ టూర్ లో ఉండ‌గానే విజ‌య‌సాయిరెడ్డి షాకివ్వ‌డంతో ఆ పార్టీ నేత‌లు తేరుకోలేక పోతున్నారు. కూట‌మి పార్టీలు బీజేపీ, టీడీపీ, జ‌న‌సేన‌లోకి వెళ్లేందుకు ప్ర‌య‌త్నాలు ముమ్మ‌రం చేస్తున్నారు.

 వైసీపీ అధికారంలో కొన‌సాగిన ఐదేళ్ల కాలంలో జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి అరాచ‌క పాల‌న సాగించారు. ప్ర‌భుత్వం తీరును ప్ర‌శ్నించిన వారిపై అక్ర‌మ కేసులు పెట్టి జైళ్ల‌కు పంపించాడు. భూ క‌బ్జాలు, ఇసుక, మ‌ట్టి, మ‌ద్యం దందా ఇలా ప్ర‌తీ దాంట్లోనూ కోట్లాది రూపాయ‌లు జేబుల్లో వేసుకున్నారు. ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు గాలికొదిలేసి త‌మ జేబులు నింపుకోవ‌టానికే వైసీపీ నేత‌లు ప్రాధాన్య‌త‌నిచ్చారు. దీనికితోడు ప్ర‌తిప‌క్ష నేత‌లు, వారి కుటుంబ స‌భ్యుల‌పై నోటికొచ్చినట్లు దూషణలు చేశారు. బూతులతో రెచ్చిపోయారు. ఇక వైసీపీ సోష‌ల్ మీడియా అరాచ‌కం గురించి ఎంత చెప్పినా తక్కువే. అధికారంలో ఉన్న‌ప్పుడు వైసీపీ నేత‌ల ఓవ‌ర్ కాన్ఫిడెన్స్ ఏ స్థాయిలోకి వెళ్లిందంటే 175 సీట్ల‌లో క్లీన్ స్వీప్ చేస్తామ‌ని ప్ర‌క‌టించేసుకున్నారు. చంద్ర‌బాబు సైతం ఓడిపోతాడ‌ని ప్ర‌గ‌ల్భాలు ప‌లికారు. ఐదేళ్ల పాటు వైసీపీ నేత‌ల పిచ్చిచేష్ట‌ల‌ను భ‌రించిన ఏపీ ప్ర‌జ‌లు ఎన్నిక‌ల స‌మ‌యంలో ఓటు ద్వారా గ‌ట్టి గుణ‌పాఠం చెప్పారు. ప్ర‌తిపక్ష హోదాకూడా ఇవ్వ‌కుండా 11 సీట్ల‌కే ఆ పార్టీని ప‌రిమితం చేశారు. తెలుగుదేశం కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత కూడా వైసీపీ నేత‌ల ఆగ‌డాల‌కు పూర్తి స్థాయిలో అడ్డుక‌ట్ట ప‌డ‌లేదు. 

కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన నెల‌ రోజుల నుంచే జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి రోడ్ల‌పైకొచ్చే ప్ర‌య‌త్నం చేశారు. రెడ్ బుక్ అంటూ ఢిల్లీ వెళ్లి నానా రాద్ధాంతం చేశాడు. మ‌రో రెండేళ్ల‌లో కూట‌మి ప్ర‌భుత్వం కూలిపోతుంది.. రాజ్య‌స‌భ‌లో మ‌న‌మే బ‌లంగా ఉన్నాం.. బీజేపీ మ‌న వెంటే ఉందంటూ వైసీపీ శ్రేణుల‌ను న‌మ్మించే ప్ర‌య‌త్నం చేశారు. వైసీపీ నేత‌లు, కార్య‌క‌ర్త‌లు సైతం జ‌గ‌న్ వ‌ద్ద అక్ర‌మ సంపాద‌న భారీగా ఉంది.. సొంత మీడియా ఉంది.. సోష‌ల్ మీడియా ఉంది.. ఏదైనా చేయ‌గ‌ల‌డు అని భ్ర‌మ‌ప‌డ్డారు. కూట‌మి ప్ర‌భుత్వం గ‌త ఐదేళ్ల వైసీపీ పాల‌న‌లో అక్ర‌మాల‌పై దృష్టిసా రించ‌డంతో ఒక్కొక్క‌రుగా వైసీపీ నేత‌ల మెడ‌కు అవినీతి ఉచ్చుబిగిస్తూ వ‌స్తుండటంతో వారిలో భయం మొదలైంది.  దీంతో పార్టీ శ్రేణుల‌ను రోడ్ల‌పైకి వ‌చ్చి కూట‌మి ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా ఆందోళ‌నలు చేయాల‌ని చెప్పిన జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి బెంగ‌ళూరుకు వెళ్లిపోయారు. ఏదైనా ప‌ని ఉన్న‌ప్పుడు మాత్ర‌మే తాడేప‌ల్లి ప్యాలెస్ కు వ‌స్తున్నారు. అయినా, అక్ర‌మ సంపాద‌న‌తో ఏర్పాటు చేసుకున్న జ‌గ‌న్‌ సొంత మీడియా, సోష‌ల్ మీడియా నిత్యం పార్టీ కార్య‌క‌ర్త‌ల‌ను రెచ్చ‌గొట్టే ప్ర‌య‌త్నం చేస్తూ వ‌చ్చింది. మ‌న‌మే అధికారంలోకి వ‌స్తున్నాం.. మ‌ళ్లీ జ‌గ‌న్ సీఎం అవు తారు.. ఎవ‌రికీ భ‌య‌పడొద్దు అంటూ వారిని రెచ్చ‌గొడుతూ వచ్చింది.. దీంతో ప‌లువురు వైసీపీ నేత‌లు, కార్య‌క‌ర్త‌లు ఏపీలో అధికారంలో ఉంది వైసీపీ ప్ర‌భుత్వ‌మే అన్న‌ట్లుగా రెచ్చిపోయారు. ప్ర‌స్తుతం వారి భ్ర‌మ‌లు తొల‌గిపోతున్నాయి. ఒక్కొక్క‌రుగా పార్టీని వీడుతుండ‌టంతో భ‌యం ప‌ట్టుకుంది. 

వైసీపీ అధికారం కోల్పోయిన నాటినుంచి ఆ పార్టీని వీడుతున్న నేత‌ల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. అయితే, ఇన్నాళ్లు అవేమీ పెద్దగా ప‌ట్టించుకోని ఆ పార్టీ శ్రేణులు.. తాజాగా విజ‌య‌సాయిరెడ్డి రాజీనామాతో డీలా ప‌డిపోయాయి. జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డికి రైట్ హ్యాండ్‌గా.. పార్టీలో కీల‌క నేత‌గా విజ‌య‌సాయిరెడ్డి కొన‌సాగుతూ వ‌చ్చారు. అయితే, జ‌గ‌న్ లండ‌న్ వెళ్లిన స‌మ‌యంలో చ‌డీ చ‌ప్పుడు లేకుండా ఆయ‌న రాజ్య‌స‌భ స‌భ్య‌త్వానికి రాజీనామా చేశాడు.   రాజ‌కీల‌కే గుడ్‌బై చెప్పేశారు. దీంతో ఇన్నాళ్లు మ‌ళ్లీ మ‌న‌మే అధికారంలోకి వ‌స్తాం అంటూ భ్ర‌మ‌ల్లో ఉన్న వైసీపీ నేత‌ల్లో   వణుకు మొదలైంది. రాబోయే రోజుల్లో భారీ సంఖ్య‌లో వైసీపీ నేత‌లు ఆ పార్టీని వీడేందుకు సిద్ధ‌మ‌ వుతున్నారు. మ‌రో ఏడాది నాటికి జ‌గ‌న్‌, మ‌రో ప‌దిమంది నేత‌లు మాత్ర‌మే వైసీపీలో మిగిలే ప‌రిస్థితి. దీంతో ఇన్నాళ్లూ జ‌గ‌న్ మీడియా, వైసీపీ సోష‌ల్ మీడియా మ‌న‌కు అండ‌గా ఉందంటూ రెచ్చిపోయిన వైసీపీ నేత‌లు కూట‌మి పార్టీల్లోకి వెళ్లేందుకు ప్ర‌య‌త్నాలు మొద‌లు పెట్టారు. మొత్తానికి మ‌ళ్లీ జ‌గ‌నే ముఖ్య‌మంత్రి అవుతాడంటూ మైకు దొరికిన‌ప్పుడ‌ల్లా ఉప‌న్యాసాలు ఇచ్చిన నేత‌ల భ్ర‌మ‌లు తొల‌గిపోయాయి.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu