టీడీపీ కార్యకర్త పళ్లు పీకి దాడి.. తిరుపతిలో వైసీపీ అరాచకం

ఆంధ్రప్రదేశ్ లో మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియలో అరాచకాలు జరుగుతున్నాయి. అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు దౌర్జన్యాలకు దిగుతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. పోటీలో
ఉన్న తమ పార్టీ అభ్యర్థులను బెదిరించి.. విత్ డ్రా కోసం ఒత్తిడి తెస్తున్నారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. తిరుపతిలో వైసీపీ నేతలు అరాచకానికి దిగారు. 

తిరుపతి కార్పొరేషన్‌లోని 45వ డివిజన్ నుంచి చంద్రమోహన్ అనే వ్యక్తి టీడీపీ తరపున నామినేషన్ దాఖలు చేశారు. లోకేశ్ నాయుడు అనే వ్యక్తి ఆయన అభ్యర్థిత్వాన్ని ప్రతిపాదించారు. సాయంత్రం చంద్రమోహన్ నామినేషన్‌ను అధికారులు తిరస్కరించారు. అయితే చంద్రమోహన్ అభ్యర్థిత్వాన్ని తాను ప్రతిపాదించడంతో రగిలిపోయిన వైసీపీ కార్యకర్తలు తనపై దాడిచేశారని లోకేశ్ నాయుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు.రాత్రి పది గంటల సమయంలో పార్కు పక్కన ఉన్న తన దుకాణంపై వైసీపీ కార్యకర్తలు కొందరు దాడిచేసి ధ్వంసం చేశారని, పారిపోయేందుకు ప్రయత్నించిన తనను పట్టుకుని తీవ్రంగా కొట్టారని, దీంతో తన పళ్లు రెండు ఊడిపోయాయని పోలీసులకు  ఇచ్చిన ఫిర్యాదులో లోకేశ్ నాయుడు ఆరోపించారు.

ఊడిపోయిన పళ్లను అలిపిరి పోలీసులకు చూపించారు. మరోవైపు, వార్డు కార్యాలయంలో తనపై ఒత్తిడి తెచ్చినట్టు లోకేశ్ నాయుడు చెబుతున్న 47వ వార్డు టౌన్ ప్లానింగ్ కార్యదర్శి సురేంద్ర కనిపించడం లేదని ఆయన కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.