షర్మిల అనుచరుడికి రేవంత్ టీమ్ బెదిరింపులు! 

తెలంగాణలో కొత్త పార్టీ పెట్టబోతున్న వైఎస్ షర్మిల.. వరుస సమావేశాలతో దూకుడు పెంచారు. పార్టీ  ఏర్పాట్లలో షర్మిల వెంట అంతా తానై వ్యవహరిస్తున్నారు కొండా రాఘవరెడ్డి. ఇటీవలే ఆయన కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ , ఎంపీ రేవంత్ రెడ్డిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆ నేపథ్యంలో రేవంత్ సైన్యం పేరిట తనకు బెదిరింపు ఫోన్ కాల్స్, మెసేజ్‌లు వస్తున్నాయని వైఎస్ షర్మిల ప్రధాన అనుచరుడు కొండా రాఘవరెడ్డి ఆరోపించారు. భౌతిక దాడులు తప్పవంటూ వాట్సాప్‌లో తనకు వచ్చిన మెసేజ్‌ను మీడియాకు చూపించారు. 

‘‘నమస్తే కొండా రాఘవరెడ్డి గారూ.. ఈ రోజు మీ ప్రెస్‌మీట్ విన్నాం. 14 ఏళ్లుగా రేవంత్‌రెడ్డి గారు ప్రజల  పక్షాన కొట్టాడుతున్న నాయకుడు. ప్రశ్నించే గొంతుగా ఆయనను ప్రజలు గెలిపించారు. అలాంటి నేతపై మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. మీరు నోరు అదుపులో పెట్టుకోండి. రేవంత్‌రెడ్డి గారికి తక్షణం క్షమాపణలు చెప్పకపోతే భౌతిక దాడులు తప్పవు’’ అని ఆ మెసేజ్‌లో హెచ్చరించారు. తనకు వచ్చిన హెచ్చరికలపై నేడు డీజీపీని కలిసి ఫిర్యాదు చేయనున్నట్టు రాఘవరెడ్డి తెలిపారు.

వైఎస్ షర్మిల పార్టీపై ఇటీవలే సంచలన ఆరోపణలు చేశారు ఎంపీ రేవంత్ రెడ్డి. విద్యార్థులతో జరిగిన సమావేశంలో షర్మిల డ్రామా చేశారని చెప్పారు. షర్మిలతో మాట్లాడిన వివరాలు బయటపెట్టారు. దీంతో రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు కౌంటరిచ్చిన కొండా రాఘవ రెడ్డి.. రేవంత్ రెడ్డిపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. వైఎస్ కుటుంబంపై మాట్లాడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు.