పెద్దిరెడ్డి వర్గీయుల అరాచకత్వం!
posted on Oct 22, 2023 1:37PM
ఏపీలో దారుణ పరిస్థితులు నెలకొన్నాయనని ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే, సీఎం జగన్ మోహన్ రెడ్డి నుండి ఆయన మంత్రివర్గ సహచరులతో సహా అంతా మూకుమ్మడిగా మీడియా ముందుకొచ్చి ఏపీలో జగనన్న పాలన సుభీక్షంగా, సంతోషంగా ఉందని చెప్పుకుంటారు. రామరాజ్యం లాంటి జగనన్న రాజ్యంపై ప్రతిపక్షాలు, కొన్ని మీడియా సంస్థలు కావాలనే బురద జల్లుతున్నాయని మాటల దాడికి దిగుతుంటారు. అయితే వాస్తవంగా ఏపీలో పరిస్థితులు చూస్తే అసలు రాష్ట్రంలో స్వేచ్ఛా, స్వాతంత్ర్యాలు ఉన్నాయా అన్న అనుమానం కలుగుతుంది. అప్పుడెప్పుడో కరోనా సమయంలో మాస్కులు లేవన్న దళిత వైద్యుడి దగ్గర నుండి సోషల్ మీడియాలో ప్రభుత్వాన్ని ప్రశ్నించిన వ్యక్తుల వరకూ ఏ ఒక్కరినీ వదలకుండా అందరినీ వేధింపులకు గురి చేశారు. వీరిలో అవమానాలు భరించలేక మరిణించిన వారు కొందరైతే.. వైసీపీ శ్రేణులే దాడులు, చిత్రహింసలకు మరణించిన వారు మరి కొందరు. ప్రశ్నిస్తే దాడులు.. నిరసన తెలిపితే అరెస్టులు.. ఇదీ ఇప్పుడు ఏపీలో పరిస్థితి.
ఆ మధ్య జరిగిన పుంగనూరు అల్లర్లు రాష్ట్ర ప్రజలెవరూ ఇంకా మరిచిపోలేదు. ఈ అల్లర్లకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడే కారణమంటూ ఆయనపై కేసులు కూడా నమోదు చేశారు. దీనిపై ఇంకా న్యాయస్థానాలలో విచారణ కొనసాగుతోంది. నిజానికి ఈ అల్లర్లకు కారణం వైసీపీ నేతలు, కార్యకర్తలే. పక్కా ప్రణాళికతో చంద్రబాబు రాకను అడ్డుకోవడంతో టీడీపీ కార్యకర్తలు తిరగబడ్డారు. దీంతో రాళ్ళూ, కర్రలతో వైసీపీ శ్రేణులు దాడికి దిగాయి. కానీ, దీన్ని వక్రీకరించి టీడీపీ కార్యకర్తలను అరెస్ట్ చేసి కేసులు పెట్టారు. ఈ దాడులకు సంబంధించిన దృశ్యాలు ఇప్పటికీ సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి. అదలా ఉండగా ఇప్పుడు అదే పుంగనూరులో టీడీపీ కార్యకర్తలను అమానుషంగా వేధించి అర్ధనగ్నంగా మాకంయి వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.మంత్రి పెద్ది రెడ్డి మనుషేలే ఈ దారుణానికి ఒడిగట్టారు.
చంద్రబాబు అక్రమ అరెస్టుకు నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా ఆ పార్టీ కార్యకర్తలు పలు నిరసన కార్యకమాలు చేపడుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం నారువ గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్తలు రామకృష్ణ, రామసూరి, ఆదినారాయణ, సుందర్ రావు, రమేష్ లు అక్టోబర్ రెండో తేదీన గాంధీ జయంతి నాడు చంద్రబాబు అరెస్టుకు నిరసనగా సైకిల్ యాత్ర ప్రారంభించారు. శ్రీకాకుళం నుంచి కుప్పం వరకు ఈ సైకిల్ యాత్ర తలపెట్టారు. మధ్యలో వచ్చే దేవాలయాల్లో చంద్రబాబు పేరిట పూజలు చేస్తూ ఈ యాత్ర కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో శుక్రవారం అక్టోబర్ 19) వారి సైకిల్ యాత్ర పుంగనూరు చేరుకుంది.. సాయంత్రం నాలుగు గంటల సమయంలో పుంగనూరు మండలం సుగాలి మిట్ట వద్ద టీ తాగేందుకు సైకిళ్లు ఆపారు. ఈ క్రమంలో వైసీపీ కార్యకర్తలు వారిని చుట్టుముట్టారు. దీంతో టీడీపీ కార్యకర్తలు భయంతో బిక్కుబిక్కుమంటూ అక్కడ నుండి వెళ్లే ప్రయత్నం చేశారు.
కానీ, వైసీపీ కార్యకర్తలు వారిని అడ్డుకున్నారు. ఇది పెద్దిరెడ్డి అడ్డా.. పుంగనూరులో అడుగుపెట్టి వెనక్కి వెళ్ళగలరా? చంద్రబాబునే రానివ్వలేదు. అటువంటిది మీరు టీడీపీ జెండాలతో ఎలా వచ్చార్రా.. అసలు శ్రీకాకుళం నుంచి ఏం పీకేందుకు వచ్చార్రా అంటూ రెచ్చిపోయారు. అంతే కాదు, టీడీపీ జెండాలు, కండువాలు తీయించి, వారితో చొక్కాలు విప్పించి అర్ధనగ్నంగా మార్చి సైకిళ్ళు నెట్టుకుంటూ వెళ్లండని హుకుం జారీ చేసి అక్కడ నుండి పంపించారు. ఈ దారుణాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ వీడియోలు ఇప్పుడు వైరల్ అవుతుండగా ఏపీలో పరిస్థితులపై నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు. అసలు మనం స్వాతంత్య్ర దేశంలోనే ఉన్నామా అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అక్కడెక్కడో రాయలసీమలో ఉండే ఫ్యాక్షన్ పరిస్థితులను జగన్ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా తీసుకొచ్చిందని కామెంట్లు చేస్తున్నారు. అవసరం లేకున్నా రాష్ట్రాల్లో 144 సెక్షన్ అమలు చేస్తున్న పోలీసులకు ఏపీలో ఇంత జరుగుతున్నా కంటికి కనిపించడం లేదా అని ప్రశ్నిస్తున్నారు. ఇది వీడియో రూపంలో బయట పడింది కానీ.. రాష్ట్రవ్యాప్తంగా ప్రతి చోటా ఇదే పరిస్థితి ఉందని.. రాష్ట్రంలో ఆటవిక రాజ్యం నడుస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.