జగన్ పాలనపై స్వామీజీ వేషంలో వైసీపీ ఎమ్మెల్యే సర్వే.. జనం నాడితో షాక్
posted on Dec 22, 2021 9:54AM
కాషాయ దుస్తులు, మెడలో రుద్రాక్షలు, నుదుటన విభూది, కళ్లజోడుతో స్వామీజీ రూపంలో ఓ కొత్త వ్యక్తి గ్రామాల్లో కనిపించారు. ఈయనెవరో ఎప్పుడూ చూడలేదని జనాలు అనుకున్నారు. తీరా చూస్తే ఆయన స్థానిక ఎమ్మెల్యే. ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు ఆయన మారు వేషం వేశారు. ఎలమంచిలి ఎమ్మెల్యే కన్నబాబు రాజు ఈ వినూత్న ప్రయత్నం చేశారు. స్వామీజీ వేషంలో నియోజకవర్గంలో పర్యటించి ప్రజల సమస్యలపై ఆరాతీశారు. అచ్యుతాపురం మండల కేంద్రంతోపాటు ఆవసోమవరం, అప్పన్నపాలెం గ్రామాల్లో పర్యటించి వైసీపీ పాలనలోని నవరత్నాలపై ప్రజలు ఏమి అనుకుంటున్నారని ఆరా తీశారు.
ఎక్కువమంది స్థానికులు తమ ప్రాంతంలో సమస్యలతో పాటూ కష్టాలను స్వామీజీ వేషంలో ఉన్న ఎమ్మెల్యేతో చెప్పుకున్నారట. అయితే ఎక్కువ మంది ప్రభుత్వం తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారని తెలుస్తోంది. ప్రధానంగా రోడ్లు బాగాలేవని ఎక్కువ మంది కంప్లైంట్ చేశారట. కొందరైతే ప్రభుత్వాన్ని బండ బూతులు తిట్టారట. ఇక నిత్యావసర వస్తువుల ధరలు, విద్యుత్ ఛార్జీలు ఎక్కువగా ఉన్నాయని జనాలు అభిప్రాయపడ్డారట. ప్రభుత్వం 50 శాతం పథకాలు అందిస్తే ధరలు పెరుగుదలతో ఖర్చులు మరింత పెరిగిపోయాయని మరికొందరు ఆవేదన వ్యక్తం చేశారట.
గ్రామాల్లో జనాల సమస్యల్ని తెలుసుకున్న తర్వాత ఎమ్మెల్యే ప్రభుత్వ కార్యాలయాలకు కూడా మారు వేషంలో వెళ్లారు. తహసీల్దార్ ఆఫీసుకు వెళ్లి స్థానికంగా జనాలు చెప్పిన సమస్యల్ని ప్రస్తావించారట.. దీంతో కంగుతిన్న అధికారులు 'ఇంతకు మీరెవరని' ప్రశ్నిస్తే ఆయన తన మారు వేషం తీసేశారు. ఎమ్మెల్యేను చూసి అధికారులు అవాక్కయ్యారు. ఆ సమస్యల పరిష్కారంపై ఫోకస్ పెట్టాలని అధికారుల్ని ఎమ్మెల్యే ఆదేశించారట. ప్రభుత్వ పథకాలపై జనాల నుంచి ఎక్కువగా వ్యతిరేక అభిప్రాయం వస్తే.. ఎమ్మెల్యే మాత్రం జగన్ పాలనపై ప్రజలు సంతృప్తి ఉన్నారని చెప్పుకొచ్చారు.
స్థానిక ఎమ్మెల్యేనే ఇలా మారువేషంలో ఎలమంచలి నియోజకవర్గం జనాల్లో చర్చనీయాంశమైంది. ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు చేసిన ఈ ప్రయత్నం వినూత్నంగా ఉందని స్థానికులు చర్చించుకున్నారు. పాత రోజుల్లో రాజులు ప్రజల కష్టాలు తెలుకునేందుకు ఇలా మారు వేషాల్లో వెళ్లేవారు.. ఇప్పుడు ఎమ్మెల్యే కన్నబాబురాజు కూడా అదే ఫార్ములాను ఫాలో అయ్యారనే చర్చ సాగుతోంది. మరోవైపు అధికారులు మాత్రం ఎమ్మెల్యే కోసం పరుగులు పెట్టారని తెలుస్తోంది.