యాహూ పేరు మారుతుంది.. కొత్త పేరు ఇదే..!


ఇంటర్నెట​ దిగ్గజ సంస్థగా పేరొందిన యాహూ ఇంక్​ తన పేరును మార్చబోతుందా అంటే అవుననే సంకేతాలే వినిపిస్తున్నాయి. యాహు పేరు మార్చి దాని కొత్త పేరు ఆల్టాబా ఇంక్ గా మార్చుతున్నట్టు ప్రకటన చేశారు. ఇప్పటికే యాహూతో వెరిజోన్‌ కమ్యూనికేషన్ ఇంక్ దాదాపు రూ.32వేల కోట్లకు డీల్ కుదుర్చుకున్న సంగతి తెలిసింది. అయితే డీల్ అనంతరం... ఆ కంపెనీలో రెండుసార్లు అతిభారీ మొత్తంలో డేటా చోరి జరిగింది. మొదటిసారి 500 మిలియన్ కస్టమర్ అకౌంట్లు, రెండోసారి 100 కోట్లకు పైగా అకౌంట్లు చోరీకి గురయ్యాయి. దీంతో వెరిజోన్ డీల్ రద్దు చేసుకుంటుంది అనుకున్నారు. కానీ దీనిపై స్పందించిన వెరిజోన్‌ ఎగ్జిక్యూటీవ్‌ మాత్రం తాము యాహూను బలోపేతం చేయాలని చూస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం యాహూ విచారణ చేపట్టిందని చెప్పారు. ఇదిలా ఉండగా ఈ డీల్‌ అమల్లోకి రాగానే ఇప్పటి సీఈవో మారిస్సా మాయర్‌ రాజీనామా చేస్తారని యాహూ తెలిపింది. ప్రస్తుతం ఉన్న బోర్డులో ఐదుగురు డైరెక్టర్లు కూడా రాజీనామా చేయనున్నారు. మిగిలిన వారు ఆల్టబాలో కొనసాగుతారు.