తెలంగాణలో చలి తీవ్రత
posted on Oct 24, 2023 1:14PM
ఈసారి తెలంగాణలో శీతాకాలం కాస్త ఆలస్యంగా వచ్చిందని చెప్పాలి. అక్టోబర్ నెల ప్రారంభమైన తర్వాత కూడా ఎండలు భగ్గుమన్నాయి. చాలా చోట్ల ఏకంగా 33 నుంచి 36 డిగ్రీల సెంటిగ్రేడ్ల ఉష్ణోగ్రతలు నమోదు కావడం గమనార్హం. నవంబర్ 15 వరకు ఎండల తీవ్రత ఉంటుందని మొదట్లో అధికారులు అంచనా వేశారు. అయితే రుతుపవనాల తిరోగమనం కారణంగా వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది.చల్లటి గాలుల కారణంగా రాత్రి పూట ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా తక్కువగా నమోదవుతున్నాయి. పలు ప్రాంతాల్లో తెల్లవారుజామున పొగమంచు కమ్మేస్తోంది. మెదక్, హనుమకొండ, రామగుండం, ఆదిలాబాద్ తదితర ప్రాంతాల్లో సాధారణం కన్నా 2 నుంచి 3 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.
అక్టోబర్ నెలలో కూడా వేడితో ఇబ్బంది పడ్డ ప్రజలకు ఉపశమనం లభించింది. తెలంగాణలో వాతావరణంలో ఒక్కసారిగా మార్పు వచ్చింది. రాత్రి సమయంలోనూ ప్రజలు ఉక్కపోతతో అల్లాడిపోయిన విషయం తెలిసిందే. అయితే తాజాగా రుతుపవనాలు తిరుగుముఖం పట్టడంతో రాష్ట్రంలో నెమ్మదిగా చలి తీవ్రత మొదలైంది. తెలంగాణ వ్యాప్తంగా చలి గాలులు వీస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా చాలా జిల్లాల్లో రాత్రి పూట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే దిగువకు చేరకున్నాయి.
రాష్ట్రంలోని చాలా చోట్ల ఉదయం పొగమంచు కమ్మేస్తుంది. దీంతో కనిష్ట ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా తగ్గుముఖం పట్టాయి. రాష్ట్రంలో అత్యల్పంగా హన్మకొండలో సాధారణం కంటే 2.7 డిగ్రీలు తగ్గి కనిష్ట ఉష్ణోగ్రత 19.5 డిగ్రీలుగా నమోదైంది. ఇక ఆదిలాబాద్‌లో ఉష్ణోగ్రత 1.8 డిగ్రీలు తగ్గి 17.2 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. హన్మకొండతో పాటు మెదక్, రామగుండంలోనూ ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయి. అయితే హైదరాబాద్, భద్రాచలంలో మాత్రం సాధారణం కంటే కొంచెం ఎక్కువగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఖమ్మంలో మాత్రం 3.3 డిగ్రీలు అధికంగా గరిష్ట ఉష్ణోగ్రత నమోదుకావడం గమనార్హం.