స్పీకర్ సీబీఐ చీఫ్ కే జవాబుదారీనా?

ఏపీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్ వైనాట్ 175 అంటుంటే.. ఏపీ అసెంబ్లీ స్పీకర్ మాత్రం 175 షూర్ అంటున్నారు. వచ్చే ఎన్నికలలో వైసీపీ 175 కి 175 స్థానాలలోనూ విజయం సాధించడం తథ్యమని ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నారు. కుటుంబంతో కలిసి శ్రీశైలం మల్లన్నను దర్శించుకుని రుద్రాభిషేకం, కుంకుమార్చన పూజలు నిర్వహించిన ఆయన అనంతరం ఇష్టాగోష్టిగా విలేకరులతో ముచ్చటించారు.

ఆ సందర్భంగా కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి వ్యవహారంపై  ఎదురైన ప్రశ్నకు ఆయన అగ్గిమీద గుగ్గిలం అయ్యారు. ఎంపీ అవినాష్ రెడ్డి వ్యవహారంపై ఆ వ్యవహారం సీబీఐ చూసుకుంటుంది. నీకెందుకు? నాకెందుకు?  అంటూ మండి పడ్డారు.  నువ్వేమైనా సీబీఐ చీఫ్ వా..?   నీకు నేను సమాధానం చెప్పాలా? మాకు అదే పనా? మీ హద్దులు మీకు ఉంటాయ్... మా హద్దులు మాకు ఉంటాయంటూ స్పీకర్ తమ్మినేని ఆ ప్రశ్న అడిగిన జర్నలిస్టుపై విరుచుకుపడ్డారు.  సీఎం జగన్ అభివృద్ధి మరచి నిధులన్నీ సంక్షేమ పథకాలకే ఖర్చుపెడుతున్నారు కదా అన్న ప్రశ్నకు కూడా స్పీకర్ గారికి కోపం తన్నుకొచ్చింది.  

రాష్ట్రంలో ఇన్ని పోర్టులు, హార్బర్లు, ఎయిర్ పోర్టులు, పరిశ్రమలు ఎలా వచ్చాయి?  ప్రశ్నించే ముందు విలేకరులకు  స్పష్టత ఉండాలి.. అది లేకుంటే చెప్పింది రాసుకుపోవాలి అంటూ ఒకింత వ్యగ్యం జోడించి మరీ వ్యాఖ్యలు చేశారు.  తెలుగుదేశం చేపట్టిన బాదుడే బాదుడు, ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమాలపై కూడా  స్పీకర్ తమ్మినేని సీతారాం కస్సుబుస్సులాడారు.  కొంచెం ఓపిక పట్టండి.  కొడితే గూబ గుయ్యిమంటాది. ఇలా అలా కాదు. వీర మహాబాదుడు ఉంటుంది. ప్రజల కోసం పని చేస్తున్న  ముఖ్యమంత్రిని పట్టుకొని ఇదేం ఖర్మ అని అంటారా వాళ్లు..? ఆగ్రహం వ్యక్తం చేశారు. 

ఇటీవల  అధాకార పార్టీ నాయకులలో ఫస్ట్రేషన్ పీక్స్ కు చేరినట్లుంది.  ప్రజా సమస్యపై ప్రశ్నిస్తే.. సమాధానం చెప్పడం అటుంచి..  అసహనం వ్యక్తం చేస్తున్నారు.  ప్రశ్నించిన వారిపై  చేయి చేసుకోవడానికీ వెనుకాడటం లేదు.  ఏపీలో అస్తవ్యస్త పాలనపై ప్రజాగ్రహాన్ని చవి చూస్తున్న నేతలకు భవిష్యత్ భూతద్దంలో కనిపిస్తుండటంతో ఆందోళన, భయంతో ప్రశ్నించే వారిని టార్గెట్ చేసుకుని నోటికీ, చేతికీ పని చేబుతున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu