వడ్డించే వాడు మనవాడైతే...
posted on May 22, 2023 4:18PM
వడ్డించేవాడు మనవాడు ఉంటే ఆఖరి బంతిలో కూర్చున్నా ఏమి ఇబ్బంది లేదు అన్నట్టు ఉంది బీఆర్ఎస్ వ్యవహారం. ప్రస్తుతమున్న తెలంగాణ భవన్ కు తోడు కోకపేట కార్యాలయం ఓపెన్ అయ్యింది. పేదలు, బడుగు బలహీనవర్గాలు, డబ్బులు కట్టి కొనుగోలు చేసిన భూములను సైతం తిరిగి ఇవ్వని కెసిఆర్ తన పార్టీ కార్యాలయాలకు భూములు ఎక్కడి నుంచి వస్తున్నాయి అని ప్రతిపక్ష నేతలు ప్రశ్నిస్తున్నారు.
బీఆర్ఎస్ పార్టీ విచ్చలవిడిగా దోపిడీ చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్పీ. కోకాపేటలో బీఆర్ఎస్ కి రాష్ట్ర ప్రభుత్వం 11 ఎకరాల భూమిని కేటాయించడం దారుణమన్నారు. రూ.550 కోట్ల విలువైన 11 ఎకరాల భూమిని కేవలం రూ.37 కోట్లకే బీఆర్ఎస్ పార్టీకి కేటాయిస్తూ రాష్ట్ర కేబినెట్ నిర్ణయం తీసుకోవడాన్ని తీవ్రంగా ఖండించారు ఆర్ఎస్పీ. విలువైన హైదరాబాద్ భూములను కెసీఆర్ కొట్టేస్తున్నారని ఆయన బలమైన వాదన.
మంత్రివర్గ నిర్ణయాన్ని కెసీఆర్ మేనల్లుడు, మంత్రి టి హరీష్ రావ్ వెల్లడించారు. మంత్రి ఈ నిర్ణయాన్ని వెల్లడించినప్పుడు ఇతర మంత్రులు హర్షధ్వానాలు చేశారు.
నిరుడు హెచ్ఎండిఏ ఆక్షన్ నిర్వహించింది. ఈ ఆక్షన్ లో ఎకరం 60 కోట్ల రూపాయల బిడ్డింగ్ ప్రాసెస్ గా నిర్ణయించింది. ఈ లెక్కన కోకాపేట భూమి విలువ అక్షరాల రూ 660 కోట్ల రూపాయలు.
కానీ కేసీఆర్ ప్రభుత్వం చెల్లించింది రూ 37 కోట్ల రూపాయలు చెల్లించాలని నిర్ణయం తీసుకుంది. ఇది ఒక రకంగా మోసం, దగా అని ప్రతిపక్షాలు ఘోషిస్తున్నాయి.
ఈ భూమిని కాజేయడానికి బిఆర్ఎస్ తెలివిగా పార్టీ కార్యాలయంతో పాటు వ్యక్తిత్వ వికాస క్లాసులు, నాయకులకు శిక్షణ ఇవ్వడానికి కార్యాలయం కావాలని కోరింది. మే 12వ తేదీన అప్లయ్ చేసింది. వారం రోజులలోపు క్యాబినేట్ ఆమోదించింది. క్యాబినెట్ ఆమోదం తెలపడం, ప్రభుత్వ ఉత్తర్వు జారీ కావడం చకచకా జరిగిపోయింది. ఈ జీవో నెంబర్ ఎంత అనే విషయం తెలంగాణ ప్రజలకు తెలియదు. నాలుగు కోట్ల మంది మా వెనక ఉన్నారు అని చెప్పుకునే బిఆర్ఎస్ పార్టీ ఈ నాలుగు కోట్ల మందికి జీవో నెంబర్ గోప్యంగా ఉంచడంలో ఆంతర్యమేమిటో?
ఒక్క హైదరాబాద్ లోనే కాదు ఇతర జిల్లాల్లో కూడా బిఆర్ఎస్ పార్టీ కార్యాలయాలకు భూములు పంచే జీవో జీవో 2018లో విడుదలైంది. కెసీఆర్ అధ్యక్షతన జరిగిన క్యాబినెట్ సమావేశం నిర్ణయం తీసుకుని హడావిడిగా జీవో జారి చేసింది. ఈ జీవో కూడా గోప్యంగా ఉంచింది ప్రభుత్వం. అన్ని జిల్లా కార్యాలయాలు స్వంత భవనాల్లో కొనసాగుతున్నాయి. హైదరాబాద్ లో ఇప్పటికే బంజారాహిల్స్ బిఆర్ ఎస్ కార్యాలయం ఉన్నప్పటికీ కొత్తగా మరో బిఆర్ఎస్ భవన్ కోకాపేటలో సేకరించడంలో ఆంతర్యం క్లియర్ కట్ గా తెలంగాణ ప్రజలకు అర్థం అయి ఉండాలి. హైదరాబాద్ భూములను కారు చౌకగా కొట్టేయడమేనని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. మరి ఇంత పెద్ద లావాదేవీలు ప్రభుత్వం తెలంగాణా భూములతో చేస్తున్నప్పుడు పారదర్శకత అవసరం లేదా? జీవోను ఎందుకు ఎందుకు రహస్యంగా ఉంచుతుంది ఈ ప్రభుత్వం.