బాబు లేఖతో ఆగిన ఈ ఆఫీస్ అప్ గ్రడేషన్

వైసీపీ అధికారంలో ఉన్న ఐదేళ్లలో ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను, చట్టాలను ఉల్లంఘించి మరీ అమలు చేసిన విధానాలను విపక్ష నేతగా నారా చంద్రబాబునాయుడు పలు మార్లు ప్రశ్నించారు. నిలదీశారు.  వ్యవస్థలను నిర్వీర్యం చేస్తున్నారు. ప్రజాపాలనను మంటగలిపేస్తున్నారంటూ హయ్యస్ట్ అథారిటీస్ కు లేఖలు కూడా రాశారు. గవర్నర్, రాష్ట్రపతి, సీఎస్.. ఇలా ప్రభుత్వ రాజ్యాంగ విరుద్ధ విధానాలను అడ్డుకోవడానికి ఆయన చేయని ప్రయత్నం లేదు. తట్టని తలుపు లేదు. కానీ ఇంత కాలం ఆయన మాటలను పట్టించుకున్న నాథుడే కరవయ్యారు. అధికారంలో ఉన్న జగన్ వ్యవస్థలను గుప్పెట్లో పెట్టుకుని ఇష్టారాజ్యంగా చెలరేగిపోయారు.

ఇప్పుడు జగన్ ప్రభుత్వంపై ప్రజా తీర్పు ఏమిటన్నది ఈవీఎంలలో నిక్షిప్తమై ఉంది. జూన్ 4న ఫలితాలు వెలువడుతాయి. అయితే అంత వరకూ ఆగక్కర్లేకుండానే ఫలితం ఏమిటన్నది అందరికీ తెలిసిపోయింది. అలా తెలిసిపోవడానికి రాష్ట్రంలో చెలరేగుతున్న హింసాకాండ, వైసీపీ నేతలు మీడియా ముందుకు వచ్చి పోలీసులు, ఎన్నికల సంఘం  పై చేస్తున్న ఆరోపణలే కారణం. అది కాకుండా.. ఆపద్ధర్మ ప్రభుత్వం అడ్డగోలుగా చేస్తున్న తీరుపై చంద్రబాబు రాసిన ఒక్క లేఖ ఈ ఆఫీస్ అప్ గ్రడేషన్ కు బ్రేక్ వేయడం కూడా జగన్ అధికారానికి చెల్లుచీటీ పడిపోయిందనీ, ఎన్నికల ఫలితం జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉండటం ఖాయమని తేలిపోయిందనీ జనం అంటున్నారు. 

ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ ఆఫీస్ అప్ గ్రడేషన్ పేరుతో తన అక్రమ జీవోలు, విధానాలకు సంబంధించి సాక్ష్యాలను చెరిపివేయడానికి సమాయత్తమైంది. ఇందుకోసం శుక్రవారం నుంచి ఈ ఆఫీస్ ను మూసివేయాలని కూడా నిర్ణయించింది. అయితే చంద్రబాబు ఈ ఆఫీస్ అప్ గ్రడేషన్ ను నిలిపివేయాలని, కొద్ది వారాలలో కొత్త ప్రభుత్వం కొలువుదీరనున్న తరుణంలో ఇప్పటికిప్పడు అంత అర్జంట్ గా అప్ గ్రడేష్ అవసరం ఏముందంటూ గవర్నర్ కు లేఖ రాశారు. ఈసీ జోక్యం చేసుకుని ఈ ఆఫీస్ అప్ గ్రడేషన్ ను తక్షణం నిలిపివేయాలని కోరారు. కీలక ఉత్తర్వులను మాయం చేయడం కోసమే ఈ అప్ గ్రడేష్ తంతు అని ఆరోపించారు. చంద్రబాబు ఫిర్యాదుపై ఈసీ తక్షణం స్పందించింది. ఈ అప్ గ్రడేష్ పేర ఈ ఆఫీస్ ను క్లోజ్ చేయవద్దని ఈసీ ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటి వరకూ ఉన్న పద్ధతిలోనే ఈ ఆఫీస్ నడవాలని ఆదేశించింది..

 ఆపద్ధర్మ ప్రభుత్వం ఉన్నప్పుడు అధికారులు ఎవరూ ఈ అప్ గ్రడేష్ వంటి  నిర్ణయాలు తీసుకోకూడదు. కానీ ఏపీలో  గత ఐదేళ్లుగా రహస్య పాలన జరిగింది. ఏ జీవోల్లో ఏముందో ఎవరికీ తెలియదు. జీవోల వివరాలు వెబ్ సైట్ లో ఉంచేది కాదు. ఆ విషయంలో హైకోర్టు పలుమార్లు అక్షింతలు వేసినా పట్టించుకోలేదు.  జగన్‌ అధికారంలోకి వచ్చిన ఏడాది నుంచి  ప్రభుత్వ నిర్ణయాల తాలూకు డేటా, ఫైల్స్ అన్నీ ఈ-ఆఫీస్‌లో ఉంటాయి. ఇప్పుడు జగన్ సర్కార్ మళ్లీ అధికారంలోకి రాదన్న భయంతో  ఈ ఆఫీస్ ను సాఫ్ట్‌వేర్‌ అప్‌గ్రేడ్‌ పేరుతో మూసేసి తమ తప్పులు, అక్రమాలను చెరిపేద్దామన్న ప్రయత్నానికి చంద్రబాబు ఫిర్యాదు అడ్డుకట్ట వేసింది.