పద్మశ్రీ అవార్డ్ నా పొట్ట కొట్టింది.. నాకొద్దు తిరిగిచ్చేస్తా!!

 

ఒడిశాలోని వైతరిణి గ్రామంలో దైతారీ నాయక్‌(75) ఓ వ్యక్తి ఉన్నారు. ఆయనకు కేంద్ర ప్రభుత్వం.. దేశ నాలుగో అత్యున్నత పురస్కారం పద్మశ్రీ ఇచ్చి గౌరవించింది. కానీ, ఆయన మాత్రం పద్మశ్రీ పుణ్యమా అని నాకు పని దొరక్కుండా పోయింది. ఈ పద్మశ్రీ నాకొద్దు అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

వివరాల్లోకి వెళితే.. వైతరిణి గ్రామానికి మూడు కిలోమీటర్ల దూరంలో నీరు ప్రవహిస్తున్నా.. కాలువ వసతి లేక ఊరంతా ఎడారిగా మారింది. దీన్ని చూసి చలించిన దైతారీ నాయక్‌ ఎలాగైనా ఊరికి నీటిని తేవాలని సంకల్పించాడు. కొండలు, గుట్టల మధ్య నుంచి కుటుంబసభ్యుల సాయంతో మూడు కిలోమీటర్ల కాలువ తవ్వి గ్రామంలోని పొలాలను తడిపాడు. ఆయన కృషిని గుర్తించిన ప్రభుత్వం 2019లో పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది. కానీ, ఆ సత్కారమే ఇప్పుడు తనకు ఉపాధిని దూరం చేసిందంటున్నారు దైతారీ. 

‘‘ప్రభుత్వం ఇచ్చిన పద్మశ్రీ పురస్కారం నాకు ఏవిధంగా సాయపడలేదు. గతంలో నేను రోజువారీ కూలీగా పనిచేసేవాణ్ని. ఇక అవార్డు వచ్చినప్పటి నుంచి నన్ను ఎవరూ పనికి పిలవట్లేదు. ప్రభుత్వం నిన్ను గొప్ప వ్యక్తిని చేసింది.. ఇప్పుడు మేం నిన్ను పనికి పిలిస్తే నీ గౌరవాన్ని తగ్గించినట్లవుతుందంటున్నారు. దీంతో ఉపాధి లేక ఇల్లు గడవడం కష్టమైపోయింది. ఇక నేను పురస్కారాన్ని తిరిగిచ్చేయాలనుకుంటున్నాను. అప్పుడైనా నాకు కొంచెం పని దొరుకుంతుందేమో’’ అని దైతారీ తన పరిస్థితిని వివరిస్తూ వాపోయారు.

ప్రస్తుతం దైతారీ ఓ చిన్న పూరి గుడిసెలో నివాసముంటున్నారు. కొన్నేళ్ల క్రితం ఇందిరా ఆవాస్‌ యోజన కింద ఇల్లు మంజూరైనా.. డబ్బుల్లేక దాన్ని మధ్యలోనే ఆపేశారు.

కాగా దైతారీ నాయక్ పరిస్థితి జిల్లా కలెక్టర్ వరకు వెళ్లడంతో ఆయన స్పందించారు. ఆయన సమస్యలను తెలుసుకుని పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.