ఆదినారాయణరెడ్డి సహకారం.. వైనాట్ పులివెందుల సాకారం
posted on Aug 15, 2025 5:58AM
.webp)
రాయలసీమ జిల్లాలు.. ముఖ్యంగా కడప జిల్లాకు ఒక ప్రాముఖ్యత ఉంది. వైఎస్ కుటుంబానికి కడప జిల్లా కంచుకోట. అక్కడ నుంచి అసెంబ్లీ, లోక్ సభ స్థానాల్లో పోటీ చేసిన వాళ్లు లక్షలు, వేల ఆధిక్యంతో గెలవడాన్ని సాధారణ విజయంగా భావిస్తారు. ఇక అటువంటి కడప జిల్లాలో పులివెందుల కు ఒక మరింత ప్రత్యేకత ఉంది. అది వైఎస్ సొంత ఖిల్లా. వైఎస్ తదననంతరం ఆయన కుమారుడు, వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డికి పెట్టని కోటగా మారింది. ప్రస్తుతం ఆయనే పులివెందుల ఎమ్మెల్యే. అటువంటి పులివెందులలో ఒక చిన్న ఉప ఎన్నికలో జగన్ పార్టీ వైసీపీ డిపాజిట్ కోల్పోయి ఘోర పరాజయాన్ని మూటగట్టుకోవడం అంటే సామాన్యమైన విషయం కాదు. ఈ ప్రభావం పులివెందులపైనా, కడప జిల్లాపైనే కాదు మొత్తం రాష్ట్రంపై పడుతుంది. జగన్ కు కంచుకోట లాంటి స్థానంలో తెలుగుదేశం వేయడం, అదీ వైసీపీ అభ్యర్థిని డిపాజిట్ కూడా గల్లంతయ్యేలా ఓడించి జెండా ఎగరేయడాన్ని వైసీపీ శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నాయి. పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ స్థానాలకు ఉప ఎణ్నికలలో చంద్రబాబు అత్యంత పకడ్బందీగా చేసిన వ్యూహరచన సత్ఫలితాలను అందించింది. ఈ రెండు జడ్పీటీసీ స్థానాలలోనూ వైసీపీ పరాజయం, తెలుగుదేశం విజయం రాష్ట్ర రాజకీయాలలో ఒక బిగ్ ట్విస్ట్ అనే చెప్పాలి. ఈ విజయాలు వైసీపీ శ్రేణుల్లో ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీస్తాయనడంలో సందేహం లేదు. అదే సమయంలో తెలుగుదేశం శ్రేణుల్లో నూతనోత్సాహం, ఆత్మవిశ్వాసాన్ని ఇనుమడింపచేస్తాయి.
ముందుగా పులివెందుల విషయమే తీసుకుంటే చంద్రబాబు వ్యూహాత్మకంగా ఇక్కడ ఎన్నికల బాధ్యతను మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డికి అప్పగించారు. ఆదినారాయణ రెడ్డి వరుసగా మూడు సార్లు జమ్మలమడుగు నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. పులివెందుల జెడ్సీటీసీ ఉపఎన్నికలో తెలుగుదేశం అభ్యర్ధి ఎంపిక నుంచి ప్రతి విషయంలోనూ ఆదినారాయణరెడ్డి తెలుగుదేశం పులివెందుల నియోజకవర్గ ఇన్ చార్జ్ బీటెక్ రవి, జిల్లా ఇంఛార్జ్ మంత్రి సవిత పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఇతర నేతలతో సమన్వయం చేసుకుంటూ ప్రచారం నుంచి పోల్ మేనేజ్ మెంట్ వరకూ అన్నిటినీ పద్ధతి ప్రకారం, ప్రణాళికాబద్ధంగా నిర్వహించారు. అలాగే ఆదినారాయణరెడ్డికి తెలుగుదేశం నేతలూ, శ్రేణులూ పూర్తిగా సహకారం అందించారు. ఫలితమే అద్భుతమనదగ్గ విజయం.
జగన్ కంచుకోటలో ఆయన పార్టీ అభ్యర్థికి కనీసం డిపాజిట్ కూడా దక్కని ఘోర పరాజయం. ఇక ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నికలోనూ పకడ్బందీ ప్రణాళిక రచించి ప్రచారం నుంచి పోల్ మేనేజ్ మెంట్ వరకూ తనకు అప్పగించిన బాధ్యతను మంత్రి మంత్రి మందపల్లి రాం ప్రసాద్ తు.చ. తప్పకుండా నిర్వహించారు. పార్టీ నాయకులూ, శ్రేణులూ ఆయనకు పూర్తిగా సహకారం అందించారు. దీంతో రెండు స్థానాలోనూ తెలుగుదేశం జయకేతనం ఎగురవేసి వైసీపీకి దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది.