ఎవరీ రామచంద్ర యాదవ్? కొత్త పార్టీ ఉద్దేశం ఏంటి? ప్రయోజనం ఎవరికి?

బోడె రామచంద్ర యాదవ్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు కొత్తగా వినిపిస్తున్న పేరు.  నిజానికి ఆయన చాలా కాలంగా రాజకీయాలలో ఉన్నా ఈ మధ్య కాలంలోనే ఆయన  వార్తల్లో  ఎక్కువగా  కనిపిస్తున్నారు. వినిపిస్తున్నారు. గత కొంత కాలంగా అన్ని జిల్లాలను చుట్టేసిన రామచంద్ర యాదవ్. ఇప్పుడు ఏకంగా ఓ కొత్త పార్టీ పెట్టారు. భారత చైతన్య యువజన పార్టీ అని దానికి నామకరణం చేశారు. గుంటూరు నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా ఇప్పటికే భారీ బహిరంగ సభ కూడా నిర్వహించారు. దీంతో సహజంగానే ఈ రామచంద్ర యాదవ్ ఎవరు? ఈయన పార్టీ ఉద్దేశం ఏంటి? ఈయన రాజకీయ పార్టీ వెనక  ఉన్న శక్తులు ఏమిటి? వ్యక్తులు ఎవరు? ఆయన కొత్త పార్టీ బీసీవైపీ రాష్ట్రంలో ఎవరితో కలిసి ప్రయాణం చేస్తుంది?  ఆ పార్టీ వల్ల ప్రయోజనం చేకూరు పార్టీ ఏది? అంటూ పలు ప్రశ్నలు రాజకీయవర్గాలలో వెల్లువెత్తుతున్నాయి.

అసలు ఈ రామచంద్ర యాదవ్  విషయానికి వస్తే.. ఈయన పుంగనూరుకు చెందిన నేత, ప్రముఖ పారిశ్రామికవేత్త. రామచంద్ర యాదవ్ గత ఎన్నికల్లో జనసేన నుంచి పుంగనూరులో పోటీ చేసి కేవలం 16 వేల ఓట్లు మాత్రమే తెచ్చుకుని డిపాజిట్  కోల్పోయారు. అయితే, అదే సమయంలో స్థానికంగా వైసీపీకి రామచంద్ర యాదవ్ అడుగుగడుగునా అడ్డు పడ్డారు. దీంతో ఆయన ఇంటిపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వర్గం నేతలు దాడులు చేశారు. అప్పట్లో ఈ దాడులు  సంచలనంగా మారాయి. ఈ దాడులని టీడీపీ, జనసేన, బీజేపీ సహ అన్నీ విపక్ష పార్టీలు ఖండించాయి. ఈ దాడుల అనంతరం ఆయన జనసేన నుండి బయటకొచ్చేసి సొంతంగా రాజకీయ కార్యకలాపాలు మొదలు పెట్టారు. ఆర్ధికంగా బలమైన నేత కావడంతో అనతి కాలంలోనే రాష్ట్రవ్యాప్తంగా పర్యటనలు సాగించి బీసీ సామజిక వర్గాలలో కాస్త  పరిచయం పెంచుకున్నారు.

రామచంద్ర యాదవ్ ఎప్పుడైతే సొంతంగా రాజకీయంగా ఎదగాలని కంకణం కట్టుకున్నారో తనకున్న పలుకుబడితో బీజేపీ నేతలతో సాన్నిహిత్యం ఏర్పరచుకున్నారు. అందుకే అడగ్గానే ఈయనకు హోమ్ మంత్రి అమిత్ షా అపాయింట్‌మెంట్ దొరికింది. అలాగే వై కేటగిరీ సెక్యూరిటీ కూడా లభించింది. ముందుగా ఈయన బీజేపీలోకి వెడతారని అంతా భావించారు. కానీ ఆయన అనూహ్యంగా కొత్త పార్టీ ఏర్పాటు చేశారు. ఆ పార్టీకి సంబంధించి కోట్లాది రూపాయలతో పత్రికలలో ప్రకటనలు కూడా ఇచ్చారు.   

అయితే  రామచంద్ర యాదవ్ వెనక ఉంది బీజేపీ నేతలేనని రాజకీయ వర్గాలలో  చర్చ సాగుతున్నది. బీసీ సామజిక వర్గాలనే టార్గెట్ గా పెట్టుకున్న రామచంద్ర.. అది కలిసి వచ్చేలానే బీసీ (భారత చైతన్య) యువజన పార్టీ   పేరు కూడా పెట్టారని.. బీసీ సామాజికవర్గాలు అండగా ఉండే టీడీపీ, వైసీపీలను దెబ్బకొట్టి రామచంద్ర యాదవ్ ఎదగి..   బీజేపీకి ఉపయోగపడటమే ఆయన పార్టీ ఉద్దేశంగా కనిపిస్తున్నదని   పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. కాగా  ఏపీలో ఇప్పటికే జగన్ వర్సెస్ చంద్రబాబు-పవన్ అన్నట్లు వార్ నడుస్తుంది. బీజేపీ ఎటు వైపు ఉంటుందో ఇంకా తేలాల్సి ఉంది. ఈ క్రమంలో రామచంద్ర యాదవ్ కొత్త పార్టీతో ఎంట్రీ ఇచ్చారు. ఆయన  కూడా రాయలసీమ నేతే కావడంతో   రాజకీయ సమీకరణాలు ఎలా మారనున్నయన్నది ఆసక్తికరంగా మారింది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu