అదానీ.. మోడీ ఏమిటీ మిస్టరీ?

ప్రధాని నరేంద్ర మోడీకి పార్లమెంటైనా, బహిరంగ సభ అయినా, మన్ కీబాత్ అయినా, పరీక్షా పే చర్చా అయినా ఒకటే.. తనపై విమర్శకులను దేశ ద్రోహులు, అభివృద్ధినిరోధకులూ అంటూ ఎదురు దాడి చేయడం.. గత పాలకుల తప్పిదాలను పదే పదే ఎత్తి చూపడం.. ఔను ఆయన పిడుక్కీ, బియ్యానికీ ఒకే మంత్రం వాడతారు. అదే విషయాన్ని లోక్ సభ సాక్షిగా రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యావాదాలు తెలిపే తీర్మానంపై జరిగిన చర్చకు ఇచ్చిన సమాధానంలో మరోసారి తేటతెల్లమైంది.

రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యావాదాలు తెలిపే తీర్మానంపై జరిగిన చర్చలో కాంగ్రెస్ పార్టీ కీలక నేత రాహుల్ గాంధీ లోక్ సభ వేదికగా నేరుగా ప్రధానికి పలు ప్రశ్నలు సంధించారు. వ్యాపారవేత్త అదానీతో ఆయనకు ఉన్న పరిచయాలు సంబంధాలపై సూటి ప్రశ్నలు సంధించారు.  ఇటీవలే దేశం అంతటా పాదయాత్ర చేసి వచ్చిన రాహుల్ గాంధీ.. ఆ సందర్భంగా ప్రజలు తనతో మొరపెట్టుకున్న సమస్యలనూ ప్రస్తావించారు. ఆయన ప్రసంగం ఆద్యంతమూ అలరించింది. సభ్యులు శ్రద్ధగా విన్నారు. అదానీ, మోడీ సంబంధాలపై ఇంత కాలం కేవలం ఆరోపణలుగానే ఉన్న అంశాలను రాహుల్  పార్లమెంట్‌లో  మంగళవారం చేసిన ప్రసంగంలో సాక్ష్యాలతో అవి వాస్తవాలే అని నిర్ధారించారు.

  రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానానికి ప్రధాని  ఇచ్చే సమాధానంలో తన ప్రశ్నలన్నిటికీ సమాధానాలు చెబుతారని రాహుల్ గాంధీయే కాదు అందరూ ఆశించారు.  అయితే మోడీ సమాధానం ఇచ్చారు. కానీ రాహుల్ గాంధీ ప్రస్తావించిన ఏ అంశాన్నీ ఆయన స్పృశించలేదు.  అదానీతో తన సంబంధాల గురించి రాహుల్ చేసిన వ్యాఖ్యలను అసలు పట్టించుకోనే లేదు. పోనీ జనంలో అదానీ, మోడీ సంబంధాలపై ఉన్న అపోహలను తొలగించేందుకు ఇసుమంతైనా ప్రయత్నించలేదు. సందేహాలను నివృత్తి చేసేలా ఆయన ప్రసంగంలో ఒక్కటంటే ఒక్క మాట కూడా లేదు.  విపక్షాలు.. దేశం అభివృద్ధి చెందుతూంటే.. అసూయ పడుతున్నారని ఎదురు దాడి చేశారు. తనకు వస్తున్న అశేష ప్రజాదరణను విపక్షాలు ఓర్వలేకపోతున్నాయన్నారు.

అభివృద్ధికి ఆటంకాలు సృష్టించేందుకు విపక్షాలు ప్రయత్నిస్తున్నాయన్నారు. వాటికి దేశ అభివృద్ధి, దేశ రక్షణపై చిత్తశుద్ధి లేదన్నారు. కశ్మీర్ లో ఇప్పుడున్న స్వేచ్ఛ తన పుణ్యమేనని చెప్పుకున్నారు. తన ఎనిమిదేళ్ల పాలనలో  దేశం ఎన్నో విజయాలు సాధించిందని చెప్పుకున్నారు. విపక్షాలను ఎద్దేవా చేశారు. ఎగతాళి చేశారు. ఇంకా లోక్ సభలో తన ప్రసంగంలో మోడీ ఎన్నో ఎన్నెన్నో గొప్పలు చెప్పుకున్నారు. విపక్షాలను ఏకి పారేశారు. ఇన్ని చేసిన, ఇంత చెప్పిన మోడీ అదానీ తో తనకున్న సంబంధాలపై వస్తున్న ఆరోపణల గురించి కానీ, విమర్శల గురించి కానీ నోరు మెదపలేదు. అసలవి తన చెవికి చేరలేదన్నట్లుగా మోడీ ప్రసంగం ఉంది.

రాహుల్ గాంధీ అంత స్పష్టంగా, అంత నేరుగా మోడీని ఉద్దేశించి అదానీతో మీ అనుబంధం ఏమిటి? అని నిలదీసినా మోడీ పట్టించుకోలేదు. ఈ విషయంలో మోడీ ప్రదర్శిస్తున్న మౌనం ఆయనపై ఆరోపణల సీరియస్ నెస్ ను తగ్గించజాలవు సరికదా మరింత పెరిగేందుకు కారణమౌతాయి. ఆ లాజిక్ ను కూడా మోడీ పట్టించుకోలేదు.  అదానీ వ్యాపార అక్రమాలే ఇప్పుడు దేశం.. దేశం అనేమిటి అంతర్జాతీయంగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. మోడీ సిఫారసుతో ఆయనకు అనుక దేశాలలో వ్యాపార విస్తరణకు అవకాశం అభించిందన్న ఆరోపణలు ఉన్నాయి.  

అన్నిటికీ మించి అదానీ సంస్థల్లో లక్షల కోట్ల ప్రజాధనం ఉంది. ఆ సంస్థ వద్ద ప్రజాధనం లక్ష కోట్లకుపైగానే ఉంది. ఆ కంపెనీల్లో షేర్లు కొన్న లక్షల మంది తీవ్రాతి తీవ్రంగా నష్టపోయారు.  మోడీ, కేంద్ర సర్కార్ మద్దతు కారణంగానే అదానీ అక్రమాలకు అడ్డూ అదుపూ లేకుండా పోయిందన్న ఆరోపణలకు వెల్లువెత్తుతున్నాయి. వీటికి సమాధానం ఇవ్వాల్సిన బాధ్యత మోడీపై ఉంది. ఔను ఒక్క మోడీపైనే ఉంది. అయినా అదానీ మోడీ మౌనం వహించడం ఒక అంతుపట్టని మిస్టరీగా మారింది.