అందమైన జీవితం కోసం- మినిమలిజం!

 

మనిషి బతకడానికి ఎన్ని వస్తువులు కావాలి? ఈ ప్రశ్నకు బదులుగా ఒక జాబితాను రూపొందించడం మొదలుపెడితే ఒక వంద వస్తువులు మించి కనిపించవేమో! కానీ మన చుట్టూ ఎన్ని వేల, లక్షల వస్తువులను పోగేసుకుంటున్నామో కదా! రెండు ఫోన్లు, నాలుగు వాచీలు, ఇరవై జతల బట్టలు, వేల బొమ్మలు... ఇలా మన చుట్టూ ఉన్న వస్తువులను ఒక్కసారి లెక్కపెట్టుకుంటే ఆశ్చర్యం వేయక మానదు. ఆ తరువాత ఇవన్నీ మన జీవితానికి అవసరమా అన్న ఆలోచనా కలగక మానదు. ఆ ఆలోచన నుంచి పుట్టిన ఒక జీవన విధానమే ‘మినిమలిజం’!

 

 

మినిమలిజం అనే ఆలోచనాధోరణి జెన్‌ తరహా జీవన విధానం నుంచి మొదలైంది. బుద్ధుని బోధనల్లో ముఖ్యమైనది ‘కోరికలను త్యజించాలి’ అన్న సూత్రమే కదా! ఎందుకంటే మనసులో కోరిక అనేది ఉంటే... దాన్ని పొందాలనుకునే తపనలో దుఃఖం ఉంటుంది; ఆ కోరికను సాధించలేకపోయినా దుఃఖం ఉంటుంది; ఇక కోరికను సాధించిన తరువాత, అది అనుకున్నంత సుఖంగా లేదనో... అంతకంటే ఉన్నతమైనది సాధించలేకపోయామనో దుఃఖం సిద్ధంగా ఉంటుంది. మనలోని కోరికలను నిరంతరం రెచ్చగొట్టే ఈ ప్రపంచీకరణలో బుద్ధుడు చెప్పిన ఈ సూత్రం మరింత ప్రభావవంతంగా పనిచేస్తోంది. ఒక ఫోన్‌ కొన్నవెంటనే మరో కొత్త మోడల్‌ సిద్ధం! ఒక టీవీ కొనాలని వెళ్తే లక్షరూపాయలు విలువ చేసే టీవీలు కూడా ఊరించడం ఖాయం! అందుకే రోజురోజుకీ మినిమలిజం ప్రాముఖ్యత పెరుగుతోంది.

 

 

వస్తువులను వెంటాడి, వాటిని పోగేసుకుని తృప్తిపడిపోయే ధోరణికి ఈ మినిమలిజం అడ్డుకట్ట వేస్తుంది. ఎందుకంటే మన జీవితం భౌతికమైన వస్తువులకంటే విలువైనదనీ మినిమలిస్టులు నమ్ముతారు. వస్తువులలో మన వ్యక్తిత్వాన్నీ, వస్తుసంపదలోనే విజయాలనీ చూసుకోవద్దని హెచ్చరిస్తుంటారు. ఈ మినిమలిజం ధోరణ ఈనాటిది కాదు. హిందూ, బౌద్ధ సూత్రాలలో ఇది అంతర్గతంగానే దాగి ఉంది. గాంధీ మొదలుకొని స్టీవ్‌జాబ్స్ వరకూ చాలామంది ప్రముఖులు ఇలాంటి జీవనవిధానాన్ని అనుసరిస్తూనే వచ్చారు. కానీ మన జీవితాలను శరవేగంగా ముంచెత్తుతున్న ఉత్పత్తుల నేపథ్యంలో... మినిమలిజంను ఒక భావజాలంగా, ఒక జీవన విధానంగా ఎంచుకునేవారి సంఖ్య పెరిగిపోతోంది. జపాన్లో ఇప్పటికే మొదలైన ఈ విప్లవం ఇప్పుడు ఐరోపావాసులలోనూ ఆసక్తిని రేపుతోంది.

 

మినిమలిజం వల్ల వస్తువులే జీవితం అనే భ్రమ ఎలాగూ దూరమవుతుంది. దానికి తోడుగా జీవితంలో నిజంగా అమూల్యమైన విషయాలు ఏవి? మన ప్రాధాన్యతలు ఏవి? వేటి కోసం మన జీవితాన్ని వెచ్చించాలి? మన కాలాన్ని, శ్రమని వేటికి అంకితం చేయాలి? వంటి ప్రశ్నలకు జవాబులు దొరికే అవకాశం ఉంటుంది. కృత్రిమమైన, మోహపూరితమైన వస్తువుల బదులు వ్యక్తులకూ, బంధాలకూ, ఆరోగ్యానికీ ప్రాధాన్యత ఇవ్వడం మొదలవుతుంది.

 

- నిర్జర.