శ‌నివారం హుజురాబాద్‌లో ఏం జ‌ర‌గ‌నుంది? ఈటల గెలుపును అడ్డుకొనే వ్యూహ‌మేంటి?

మీడియా అటెన్ష‌న్ వేరే టాపిక్స్ వైపు షిఫ్ట్ అవ‌డంతో హుజురాబాద్ బై ఎల‌క్ష‌న్స్‌పై పెద్ద‌గా న్యూస్‌ క‌వ‌రేజ్ రావ‌డం లేదు కానీ.. గ్రౌండ్ లెవ‌ల్‌లో పొలిటిక‌ల్ హీట్ తారాస్థాయిలో ఉంది. ఈట‌ల రాజేంద‌ర్ వ‌ర్సెస్ హ‌రీష్‌రావు ఎపిసోడ్ పోటాపోటీగా న‌డుస్తోంది. కాంగ్రెస్ ఉండీ లేన‌ట్టు.. అలా అలా చేతులు ఊపుతోంది. హుజురాబాద్ నియోజ‌క‌వ‌ర్గంలో జోరు టీఆర్ఎస్‌దే అనిపిస్తున్నా.. జోష్ మాత్రం బీజేపీదే అంటున్నారు. ఈట‌ల రాజేంద‌ర్ త‌న‌దైన ప్ర‌సంగాల‌తో, కేసీఆర్‌-హ‌రీష్‌రావుల‌పై ప‌దునైన విమ‌ర్శ‌ల‌తో దూసుకుపోతున్నారు. తాను ఎందుకు కారు దిగాల్సి వ‌చ్చింది.. త‌న‌కు జ‌రిగిన అన్యాయం ఏంటి.. త‌న పోరాటం ఎందుకోసం, ఎవ‌రి కోసం.. ఇలా పాయింట్ టూ పాయింట్ ప్ర‌జ‌ల‌కు వివ‌రించి చెబుతున్నారు. అండ‌ర్ క‌రెంట్‌గా ఈట‌ల ప్ర‌చారంలో అంద‌రికంటే ముందున్నారు. అధికార‌పార్టీది పై పై హ‌డావుడే కానీ.. లోలోన మేట‌ర్ మొత్తం ఈట‌ల చుట్టూనే తిరుగుతోందని అంటున్నారు. స‌ర్వేల‌పై నిషేధం ఉన్నా.. ఇప్ప‌టి వ‌ర‌కూ చేసిన స‌ర్వేలన్నీ ఈట‌లదే విజ‌య‌మ‌ని చెబుతున్నాయి.

హుజురాబాద్‌లో గెలుపెవ‌రిది? అనే టాపిక్ ఇప్పుడు లేదు. హుజురాబాద్‌లో ఈట‌ల రాజేంద‌ర్ మెజార్టీ ఎంత? అనే దానిపైనే చ‌ర్చ న‌డుస్తోంది. ఈట‌ల గెలుపు ప‌క్కా అని తేలిపోయింది. ఆయ‌న‌కు ఎంత మెజార్టీ వ‌స్తుంద‌నే దానిపైనే లెక్క‌లేస్తున్నారు. కేటీఆర్ చెప్పిన‌ట్టు కాంగ్రెస్ సైతం లోపాయికారిగా బీజేపీకే స‌హ‌క‌రిస్తోంద‌ని తెలుస్తోంది. అందుకే, అధికార పార్టీలో అంత వ‌ణుకు.. అంత‌కుమించి బెదురు. ఎక్క‌డ ఓడిపోతామ‌నే భ‌యంతోనే యావ‌త్ ప్ర‌భుత్వ యంత్రాంగ‌మంతా హుజురాబాద్‌లో మోహ‌రించి దింపుడు క‌ళ్లెం ప్ర‌య‌త్నాలు చేస్తోంది. ఇక త‌మ‌ను ఆదుకుంటుంద‌నుకున్న ద‌ళిత బంధు ప‌థ‌కానికి ఈసీ బ్రేకులు వేయ‌డంతో టీఆర్ఎస్ శ్రేణుల్లో క‌ల‌వ‌రం పీక్స్‌కు చేరింది. 

ల‌బ్దిదారుల ఎంపిక పేరుతో ఇన్నాళ్లూ కాల‌యాప‌న చేసి.. కొంద‌రి అకౌంట్లో డ‌బ్బులేసినా ఆ సొమ్ము తీసుకోనీయ‌కుండా ఫ్రీజ్ చేసి.. ఎల‌క్షన్‌కు రెండు మూడు రోజుల‌ ముందు మాయ చేద్దామ‌నుకున్న టీఆర్ఎస్ ప్లాన్ ఈసీ నిర్ణ‌యంతో బెడిసికొట్టింది. ద‌ళిత బంధు ఇచ్చే ఉద్దేశ్యం లేక‌నే టీఆర్ఎస్ ఇలా ఆల‌స్యం చేసి.. ఈసీ చెక్ పెట్టేలా చేసింద‌నే ప్ర‌చారం హుజురాబాద్‌లో బాగా జ‌రుగుతోంది. ఇది అధికార పార్టీపై ఆ వ‌ర్గంలో వ్య‌తిరేక‌త‌కు కార‌ణ‌మ‌వుతోంది. ఏ ద‌ళిత ఓట్ల‌తోనైనే గ‌ట్టెక్కుదామ‌ని స్కెచ్ వేసిందో.. ఇప్పుడు ద‌ళిత బంధు ఆగిపోవ‌డంతో ఆ ద‌ళితులంతా టీఆర్ఎస్‌పై కోపంతో ర‌గిలిపోతున్నారు. వారంతా ఈట‌ల ప‌క్షాన నిలుస్తున్నారు. దీంతో.. ఎప్ప‌టిలానే చివ‌రాఖ‌రి కుట్ర‌కు సిద్ధ‌మ‌వుతోంద‌ట టీఆర్ఎస్‌. అందుకోసం ఈ శ‌నివారం ముహూర్తం ఫిక్స్ చేశార‌ని అంటున్నారు. 

ఏ ఎల‌క్ష‌న్లు వ‌చ్చినా ఓట‌ర్ల‌కు నోట్లు గుమ్మ‌రించి టీఆర్ఎస్ గెలుస్తూ వ‌స్తోంద‌నేది ప్ర‌తిప‌క్షాలు చేసే ప్ర‌ధాన ఆరోప‌ణ‌. అందుకు త‌గ్గ‌ట్టే.. హుజురాబాద్‌లోనూ కారు పార్టీ ఆ డ‌బ్బు సంచులనే న‌మ్ముకుంద‌ని అంటున్నారు. ద‌ళిత‌బంధు బెడిసికొట్ట‌డంతో.. ఇక నేరుగా ఓటుకు నోటు య‌వ్వారానికి తెర తీస్తోంద‌ని తెలుస్తోంది. ఈ శ‌నివారం టీఆర్ఎస్ పార్టీ ఓట‌ర్ల‌కు డ‌బ్బులు పంచ‌బోతోందంటూ నియోజ‌క‌వ‌ర్గంలో పెద్ద ఎత్తున‌ ప్ర‌చారం జ‌రుగుతోంది. అదే నిజ‌మైతే.. అధికార పార్టీ డ‌బ్బుల పందేరం.. ఈట‌ల గెలుపును అడ్డుకోగ‌ల‌దా? అనే ప్ర‌శ్న త‌లెత్తుతోంది.  

లోక‌ల్ టాక్ ప్ర‌కారం.. ప్ర‌స్తుతం ఈట‌ల రాజేంద‌ర్ 40 వేల మెజార్టీతో గెల‌వ‌బోతున్నారంటూ ప్ర‌చారం జ‌రుగుతోంది. అందుకే గులాబీ పార్టీలో గుబులు రేగుతోంది. దీంతో.. ఓటుకు నోటు పంప‌కాల‌ను ఈసారి ముందే మొద‌లుపెట్టాల‌ని చూస్తున్నార‌ట‌. ఈ శ‌నివారం నుంచే స్టార్ట్ చేస్తున్నారంటూ స్థానికుల్లో గుసగుస న‌డుస్తోంది. అయితే, అధికార పార్టీ ఎన్ని డ‌బ్బు సంచులు కుమ్మ‌రించినా.. ఓటుకు రెండు వేలు నుంచి 5-10 వేలు ఇచ్చినా.. ఈట‌ల గెలుపును మాత్రం ఆప‌లేర‌ని అంటున్నారు. మ‌హా అయితే ఈట‌ల మెజార్టీని 40 వేల నుంచి 20 వేల‌కు త‌గ్గించగ‌ల‌రేమో కానీ.. రాజేంద‌ర్ గెలుపు మాత్రం ప‌క్కా అని చెబుతున్నారు. హుజురాబాద్‌లో ఈసారి బీజేపీ జెండా ఎగ‌ర‌డం ఖాయ‌మ‌ని తేల్చి చెబుతున్నారు. మ‌రి చూడాలి.. ఈ శ‌నివారం హుజురాబాద్‌లో ఏం జ‌ర‌గ‌నుందో..?