కాంగ్రెస్ జోరు తగ్గిందా?.. రేవంత్ దూకుడు ఆగిందా?.. మునుగోడులో కాంగ్రెస్ పరిస్థితి ఏంటి?

ఉన్న అవకాశాలను కూడా చేజార్చుకోవడం కాంగ్రెస్ కు అలవాటే. ఎట్టి పరిస్థితుల్లోనూ వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో తెలంగాణలో అధికారం చేపట్టాలని భావిస్తున్న కాంగ్రెస్ కు నిజంగా మునుగోడు ఉన ఎన్నిక కలిసి వచ్చిన అవకాశమనే చెప్పాలి. అయితే అంతర్గత విభేదాలతో ఆ అవకాశాన్ని చేజార్చుకునే దిశగా కాంగ్రెస్ అడుగులు వేస్తోందా అంటే ఔననే చెప్పాలి.

మునుగోడు ఉప ఎన్నిక వాస్తవంగా చెప్పాలంటే టీఆర్ఎస్, బీజేపీల కంటే కాంగ్రెస్ కే కీలకం. ఇక్కడ విజయం సాధిస్తే.. పార్టీలో అంతర్గత విభేదాలకూ చెక్ పడుతుంది. టీపీసీసీ చీఫ్ రేవంత్ నాయకత్వంలో కాంగ్రెస్ బలోపేతమైందన్న వాదనకూ బలం చేకూరుతుంది. రేవంత్ పీసీసీ చీఫ్ అయిన నాటి నుంచీ కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి పార్టీ వ్యవహారాలతో అంటీముట్టనట్టుగానే ఉంటున్నారు. ఆయన బీజేపీకి దగ్గరౌతున్నారన్న సంకేతాలూ ఉన్నాయి. అయినా కూడా కాంగ్రెస్ ఆయనపై చర్య తీసుకునే సాహసం చేయలేదు. పైపెచ్చు చివరి నిముషం వరకూ బుజ్జగింపుల పర్వం కొనసాగించి.. అనవసరమైన ప్రాధాన్యత పెంచింది.

దానిని అలుసుగా తీసుకునే ఆయన, ఆయన సోదరుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి రేవంత్ పై విమర్శలతో చెలరేగిపోయారు. రాజగోపాలరెడ్డి, వెంకటరెడ్డి ద్వయం విమర్శలను దీటుగా ఎదుర్కొనే విషయంలో కాంగ్రెస్ సీనియర్లు ఏ మాత్రం చొరవ తీసుకోలేదు. అదేదో పార్టీకి సంబంధించి విషయం కాదన్నట్లుగా, రేవంత్ రెడ్డి వ్యక్తిగత వ్యవహారమన్నట్లుగా మౌనం వహించారు.  పైపెచ్చు రేవంత్ దూకుడు వల్లనే కోమటిరెడ్డి వెంకటరెడ్డి పార్టీకి దూరమయ్యారంటూ   నల్లగొండ జిల్లాకు చెందిన కాంగ్రెస్ సీనియర్లు హై కమాండ్ కు ఫిర్యాదు చేశారని అంటున్నారు. ఆ ఫిర్యాదు మేరకే హై కమాండ్ రేవంత్ దూకుడుకు కళ్లెం వేసే చర్యలకు శ్రీకారం చుట్టినట్లు కనిపిస్తోందని పరిశీలకులు అంటున్నారు.

అందుకే రేవంత్ రెడ్డి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి బేషరతు క్షమాపణ చెప్పారని అంటున్నారు. అంతే కాకుండా కరోనా అంటూ మునుగోడులో కీలక సమయంలో ప్రచారానికీ దూరం అయ్యారని అంటున్నారు. పాదయాత్రలో పాల్గొనకపోవడం, తన సహజశైలిలో బీజేపీ, తెరాసలపై విమర్శల దాడి చేయడంలోనూ కూడా వాడి తగ్గించారని పరిశీలకులు   విశ్లేషణలు చేస్తున్నారు. మొత్తంగా మునుగోడు ప్రచారం విషయంలో వెనక్కు తగ్గమని హైకమాండ్ నుంచి రేవంత్ కు  ఆదేశాలు వచ్చాయని అంటున్నారు.  ఇందుకు ఉదాహరణగా రాజగోపాల్ రెడ్డి ని  బుజ్జగించే బాధ్యతను .. అదే జిల్లాకు చెందిన మాజీ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఇవ్వడాన్నిప్రస్తావిస్తున్నారు.

అలాగే ఉపఎన్నిక బాధ్యతలను నల్గొండ జిల్లా కు చెందిన సీనియర్లకే అప్పగించే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని అంటున్నారు. జల్లా కాంగ్రెస్ నుంచి మరిన్ని వలసలు ఉంటాయన్న బూచిన చూపి మునుగోడు విషయంలో రేవంత్ ను దూరం పెట్టే వ్యూహానికి కాంగ్రెస్ సీనియర్లు తెరలేపినట్లు చెబుతున్నారు.  మునుగోడు ఉపఎన్నికకోసం   మధుయాష్కీ నేతృత్వంలో కమిటీ వేయడం వెనుక కారణం ఇదేనని చెబుతున్నారు.