భద్రాచలం వద్ద మళ్లీ వరద ఉధృతి.. సాగర్ కూ వరద పోటు

తెలుగు రాష్ట్రాలలో వరద ముప్పు తొలగడం లేదు. గోదావరి మహోగ్ర రూపం దాల్చడంతో సర్వం కోల్పోయిన బాధితులు మరోసారి గోదావరి వరద ముంచుకు వస్తుండటంతో తీవ్ర భయాందోళనలకు గురౌతున్నారు. కేవలం 20 రోజుల కిందట వరద ఉధృతికి కకావికలమైన పోవవరం ముంపు గ్రామాల ప్రజలు మరోసారి భయం గుప్పిట్లో చిక్కుకున్నారు.

భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం 50.8 అడుగులకు చేరింది. గత నాలుగు రోజులుగా భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం 50 అడుగుల వద్ద కొనసాగుతోంది. ఆదివారం ఉదయం 50.4 అడుగులకు పెరిగిన గోదావరి నీటి మట్టం రాత్రి అయ్యే సరికి 50.8 అడుగులకు చేరింది.

ఎగువ నుంచి వస్తున్న ప్రవాహం అంతకంతకూ పెరుగుతుండటంతో వరద ఉధృతి మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం భద్రాచలం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. మరో వైపు నాగార్జున సాగర్ వద్ద కృష్ణ పరవళ్లు తొక్కుతోంది.

ఎగువ నుంచి వస్తున్న వర్షాలకు శ్రీశైలం రిజర్వాయర్ కు భారీ ఎత్తున వరద నీరు పోటెత్తుతోంది. శ్రీశైలం నుంచి భారీ ఎత్తున నాగార్జున సాగర్ కు నీటిని విడుదల చేస్తున్నారు. అలాగే సాగర్ నుంచి దిగువకు భారీ ఎత్తున నీటిని వివడుదల చేస్తున్నారు. పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా ప్రస్తుతం నీటి మట్టం 584 అడుగులకు చేరింది.