తెలంగాణ అక్రమ ప్రాజెక్టుల్ని అడ్డుకోరా? ఏపీ చేస్తున్న ఫిర్యాదుల‌న్నీ బుట్ట‌దాఖ‌లేనా?

న్యాయ‌ప‌రంగా త‌మ‌కు రావాల్సిన నీటి వాటాపై తెలంగాణాతో తేల్చుకోవ‌డానికే ఆంధ్ర‌ప్ర‌దేశ్ సిద్ధ‌మౌతోంది. గోదావరి, కృష్ణా నదులపై తెలంగాణ ప్రభుత్వం నిర్మిస్తున్న సాగునీటి ప్రాజెక్టులపై గోదావరి నదీ యాజమాన్య సంస్థ (జీఆర్‌ఎంబీ), కృష్ణా నదీ యాజమాన్య సంస్థ (కేఆర్‌ఎంబీ)లను ప్రశ్నించేందుకు ఆంధ్రప్రదేశ్‌ సన్నద్ధమైంది. ఈ మేరకు ఈ రెండు బోర్డులకూ విడివిడిగా రాసిన లేఖలకు ముఖ్యమంత్రి కార్యాలయం ఆమోదం తెలిపింది. గోదావరి, కృష్ణా బోర్డులకు నేడు విడివిడిగా ఆంధ్ర లేఖలు కేంద్ర జలసంఘానికీ ప్రతులు పంప‌నున్నారు.

పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌ నుంచి సంగమేశ్వరం నుంచి శ్రీశైలం కుడి ప్రధాన కాలువ వరకూ నాలుగు కిలోమీటర్ల మేర రోజుకు మూడు టీఎంసీలు తరలించేలా ఎత్తిపోతల పథకానికి రాష్ట్రప్రభుత్వం సిద్ధమైంది.

శ్రీశైలం నుంచి కృష్ణా జలాలను రాయలసీమ దుర్భిక్ష ప్రాంతాలకు పంపే పథకానికి రూ.6,829.15 కోట్లతో పరిపాలనా ఆమోదంతో పాటు పనులు చేపట్టేందుకు ఈ నెల 5న జీవో 203ని విడుదల చేసింది. దీనిపై తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసింది. అయితే తమ పథకాలన్నీ కృష్ణా ట్రైబ్యునల్‌ ఆదేశాల మేరకు ఆంధ్రప్రదేశ్‌ వాటా 512 టీఎంసీలకు లోబడే ఉన్నాయని ఆంధ్రప్రదేశ్‌ స్పష్టం చేస్తోంది. ఇవన్నీ వరద జలాలపై ఆధారపడి నిర్మిస్తున్నామని.. తెలంగాణకు అభ్యంతరం ఏమిటని కృష్ణా బోర్డును ప్రశ్నించనున్నారు. అదే విధంగా కృష్ణా ట్రైబ్యునల్‌ కేటాయింపులకు అదనంగా తెలంగాణ అక్రమంగా ప్రాజెక్టులను నిర్మిస్తోందని గుర్తుచేయనున్నారు.

పాలమూరు-రంగారెడ్డి నుంచి 90 టీఎంసీలు, డిండి రిజర్వాయరు నుంచి 10 టీఎంసీలు, మిషన్‌ భగీరథ నుంచి 19.59 టీఎంసీలు, తుమ్మిళ్ల ఎత్తిపోతల నుంచి 5.44 టీఎంసీలు, భక్తరామదాసు ఎత్తిపోతల నుంచి 5.50 టీఎంసీలు, కల్వకుర్తి సామర్థ్యం పెంచడం ద్వారా 10 టీఎంసీలు, జూరాల ఫోర్‌షోర్‌ నుంచి నెట్టెంపాడు సామర్థ్యాన్ని పెంచడం ద్వారా 3.40 టీఎంసీలు.. మొత్తం 178.93 టీఎంసీల ప్రాజెక్టులను అనధికారికంగా తెలంగాణ నిర్మిస్తోందని ఆంధ్రప్రదేశ్‌ చెబుతోంది. ఈ మేరకు ఇప్పటికే ఐదు సార్లు కృష్ణా బోర్డుకు లేఖలు రాసింది. వీటిపై ఏం చర్యలు తీసుకున్నారో చెప్పాలని ఆరో లేఖలో నిలదీయనుంది.

గోదావరి నదిపై కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణాన్ని ఆంధ్రప్రదేశ్‌ మొదటి నుంచీ వ్యతిరేకిస్తోంది. ముఖ్యమంత్రిగా వైఎస్‌ రాజశేఖరరెడ్డి ప్రతిపాదించిన ప్రాణహిత-చేవెళ్లకు ప్రతిరూపమే ఈ ప్రాజెక్టు అని తెలంగాణ ప్రభుత్వం వాదిస్తోంది. సీతారామ ప్రాజెక్టుపైనా ఆంధ్ర అభ్యంతరం చెబుతోంది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu