వరంగల్ ‘నిట్’ ముందు విద్యార్థి న్యాయపోరాటం

 

వరంగల్ ‘నిట్’లో మెకానికల్ విభాగంలో పిహెచ్‌డీ స్కాలర్ ఎన్.విష్ణుమూర్తి ‘నిట్’ ప్రధాన ద్వారం ఎదుట నిరాహారదీక్ష చేపట్టి న్యాయపోరాటం చేస్తున్నారు. తనకు రెండు నెలలుగా స్కాలర్‌షిప్ మంజూరు చేయకుండా ‘నిట్’ డైరెక్టర్ ఇబ్బందులకు గురిచేస్తున్నారని విష్ణుమూర్తి ఆరోపిస్తున్నారు. ఈ వివాదం నేపథ్యాన్ని విష్ణుమూర్తి వివరిస్తూ, ‘‘క్యాంపస్‌లో జరుగుతున్న అక్రమాలను ప్రశ్నించినందుకు ‘నిట్’లోని కొంతమంది పరిపాలనా సిబ్బంది నామీద కక్షగట్టారు. నామీద క్రమశిక్షణా రాహిత్యం అనే నెపం పెట్టి డైరెక్టర్ నా స్టైఫండ్ నిలిపివేసేలా చేశారు. నేను చాలా పేదవాడిని. స్టైఫండ్ మీదే ఆధారపడి చదువుకుంటున్నవాడిని. నాకు స్టైఫండ్ వెంటనే మంజూరు చేయాలని ‘నిట్’ డైరెక్టర్ని ఎంతగా కోరినా ఆయన ఎంతమాత్రం స్పందించలేదు. అందుకే ‘నిట్’ ప్రధాన ద్వారం ముందు నిరాహారదీక్ష చేయాల్సి వచ్చింది’’ అని చెప్పారు. న్యాయమైన డిమాండ్‌తో నిరాహారదీక్ష చేస్తున్న విష్ణుమూర్తికి ‘నిట్’ విద్యార్థుల నుంచి సంపూర్ణ మద్దతు లభిస్తోంది. అయితే విష్ణుమూర్తి దీక్షకు స్పందించాల్సిన ‘నిట్’ అధికార గణం ఆయన మీద క్రమశిక్షణ చర్యల పేరుతో సస్పెన్షన్ వేటు వేసింది. దీనిని బాధితుడు విష్ణుమూర్తితోపాటు వరంగల్ ‘నిట్’లో చదువుతున్న విద్యార్థిలోకం మొత్తం ఖండిస్తోంది. విష్ణుమూర్తి మీద విధించిన సస్పెన్షన్‌ని ఎత్తివేయడంతోపాటు ఆయన స్కాలర్‌షిప్‌ను వెంటనే విడుదల చేయాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. అలా చేయని పక్షంలో విష్ణుమూర్తికి మద్దతుగా విద్యార్థులందరూ ఉద్యమించాల్సి వస్తుందని వారు ‘నిట్’ అధికారగణాన్ని హెచ్చరిస్తున్నారు.