వ్యాపంపై సీబీఐ విచారణకు సుప్రీం ఆదేశం, మరొకరు మృతి
posted on Jul 9, 2015 2:34PM
.jpg)
దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న వ్యాపం (మధ్యప్రదేశ్ వ్యవసాయిక్ పరీక్షా మండల్) కుంభకోణం, దానిలో వరుసగా జరుగుతున్న అనుమాన స్పద మరణాలపై దాఖలయిన అనేక పిటిషన్లను ఈరోజు విచారణకు స్వీకరించిన సుప్రీంకోర్టు, దానిపై సీబీఐ విచారణకు ఆదేశించింది. ఈకేసులో కేంద్ర ప్రభుత్వానికి, మధ్య ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి, రాష్ట్ర గవర్నర్ రామ్ నరేష్ యాదవ్ లకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసి నాలుగు వారాలలోగా సమాధానం ఇవ్వాలని కోరింది. పిటిషనర్ల తరపున వాదించిన ప్రముఖ న్యాయవాది (మాజీ కేంద్రమంత్రి) కపిల్ సిబాల్ గవర్నర్ రామ్ నరేష్ యాదవ్ ని తక్షణమే పదవిలో నుండి తొలగించవలసిందిగా కేంద్రాన్ని ఆదేశించామని కోరారు. కానీ ఆయనకి కూడా దీనిపై స్పందించేందుకు సుప్రీంకోర్టు నాలుగు వారాల గడువు ఇచ్చింది. ఇకపై ఈ కేసు పురోగతిని తామే స్వయంగా పర్యవేక్షిస్తామని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ హెచ్.యల్. దత్తు ప్రకటించారు.
ఒకవైపు సుప్రీంకోర్టులో ఈకేసుపై విచారణ జరుగుతుంటే, ఈ కేసులో సాక్షిగా పేర్కొనబడిన సంజయ్ యాదవ్ అనే పోలీస్ కానిస్టేబిల్ ఈరోజే అనుమానాస్పద పరిస్థితిలో మరణించాడు. ఇంతవరకు ఈ కేసుతో ప్రత్యక్షంగానో లేక పరోక్షంగానో సంబంధం ఉన్న48మంది వ్యక్తులు అనుమాన స్పద స్థిలో మరణించారు. ఈరోజు వారి సంఖ్యా 49కి చేరింది. ఈ కుంభకోణంలో కీలక పాత్రధారిగా భావిస్తున్న గవర్నర్ కుమారుడు శైలేష్ యాదవ్ కూడా కొన్ని నెలల క్రితం అనుమానాస్పద పరిస్థితుల్లో మరణించాడు.