స్కిల్ స్కాంలో ఉండవల్లి పిటిషన్ పై విచారణ ఎప్పుడంటే?
posted on Oct 3, 2023 11:31AM
స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ లో స్కాం జరిగిందంటూ ఏపీలోని జగన్ ప్రభుత్వం ఆరోపణలు గుప్పిస్తూ.. ఆ కేసులో మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం అధినేత నారా చంవద్రబాబునాయుడిని అరెస్టు చేసిన సంగతి తెలిసిందే.
అయితే ఇదే స్కిల్ స్కాంపై సీబీఐ విచారణ కోరుతూ మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆయన పిటిషన్ విచారణకు ఇంకా నోచుకోలేదు. ఈ పిటిషన్ విచారణ ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి బెంచ్ మీదకు వచ్చింది. అయితే ఆ బెంచ్ లో ఒకరైన జస్టిస్ రఘునందన్ రావు రఘునందనరావు నాట్ బిఫోర్ మీ అంటూ వైదొలిగారు.
దీంతో ఈ కేసును మరో బెంచ్ కు బదిలీ చేయాల్సి ఉంది. ఇక జస్టిస్ రఘునందనరావు ఈ కేసులో ప్రతివాదులుగా ఉన్న వారిలో కొందరి తరఫున తాను గతంలో వాదించి ఉన్నాననీ, అందుకు ఈ కేసు విచారణ నుంచి తనను తప్పించాలని పేర్కొన్నారు.
కాగా ఉండవల్లి తన పిటిషన్ లో ప్రతివాదులుగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, చంద్రబాబునాయుడు, ఈడీ, డిజైన్ టెక్, సీమెన్స్, స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లను చేర్చారు. ఉండవల్లి చేర్చిన ప్రతివాదులలో కొందరి తరపున గతంలో జస్టిస్ రఘునందన్ రావు వాదించారు. ఆ విషయాన్నే ప్రస్తావిస్తూ ఆయన ఉండవల్లి కేసు విచారణ నుంచి వైదొలిగారు. దీంతో కేసును మరో బెంచ్‌కు బదిలీ చేసిన తరువాత విచారణ తేదీ నిర్ణయమౌతుంది.