గవర్నర్ పై కేంద్రం అసంతృప్తి... ఇప్పటి వరకూ ఆగడమే సరైంది కాదు

ఓటుకు నోటు వ్యవహారంలో సెక్షన్ 8 పై పెరుగుతున్న వివాదాల నేపథ్యంలో ఉమ్మడి రాష్ట్రల గవర్నర్ నరసింహన్ కేంద్ర హోంశాఖ అధికారులతో విస్తృత చర్చలు జరిపిన సంగతి తెలిసిందే. అయితే ఈ వివాదల మధ్య గవర్నర్ నరసింహన్ మాత్రం నగిలిపోతున్నారన్నది మాత్రం వాస్తవం.. ఇప్పటికే అటు తెలంగాణ ప్రభుత్వం.. ఇటు ఆంధ్రా ప్రభుత్వం.. ఈ రెండు ప్రభుత్వాల మధ్య నరసింహన్ ఎటూ తేల్చుకోలేని పరిస్థితిలో ఉండగా మరో వైపు కేంద్రం కూడా గవర్నర్ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేసినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. సమస్యను పరిష్కరించి.. పరిస్థితులు చక్కదిద్ది ఇరువురు ముఖ్యమంత్రులు రాష్ట్రాభివృద్ధికి పాటుపడేలా చేయమని.. సమస్యను మాదాకా తీసుకురావద్దు మీరే సర్దుబాటు చేయండి అని గవర్నర్ కు ముందే సూచించినా ఇంతవరకూ నాన్చడంవల్లే కొత్త సమస్యలు వస్తున్నాయని కేంద్రం అసంతృప్తి వ్యక్తం చేసిందని రాజకీయ వర్గాలు అనుకుంటున్నాయి. కేసు మొదలైనప్పుడు వ్యవహారం ఎలా ఉందో ఇప్పుడు కూడా అలాగే ఉందని కేంద్రం పెదవి విరిచినట్లు సమాచారం.

 

అయితే మరోవైపు గవర్నర్ కూడా సెక్షన్ 8 అమలుపై వస్తున్న హెచ్చరికలు కేంద్రానికి వివరించినట్టు తెలుస్తోంది. సెక్షన్ 8 ఎప్పటినుండో అమలులోనే ఉన్నా దానికి సంబంధించిన విశేషాధికారాలు ఉన్న నేపథ్యంలో అటార్నీ జనరల్ చెప్పేంత వరకూ ఆగానని కేంద్రానికి తెలిపారు. మరోవైపు సెక్షన్ 8 అమలు చేస్తే తెలంగాణ సీఎం కేసీఆర్ అసెంబ్లీని రద్దు చేస్తానని హెచ్చరిస్తున్నారని అందుకే హోంశాఖ మార్గదర్శకాలకోసం వచ్చానని చెప్పడంతో.. రాజకీయ నేతల హెచ్చరికలకు అనుగుణంగా వ్యవహరించరాదని కేంద్రం అభిప్రాయపడినట్టు విశ్వసనీయవర్గాల వెల్లడి. కాగా ఆంధ్రా నేతల ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం గురించి ప్రస్తావిస్తుండగా అవన్నీ మాకు తెలుసు.. మీరు ఇప్పటి వరకూ ఆగడమే సరైంది కాదని హోంశాఖ గవర్నర్ ను సూచించింది.

 

మొత్తానికి ఓటుకు నోటు కేసు వ్యవహారంలో మాత్రం గవర్నర్ పరిస్థితే అయోమయ స్థితిలో ఉంది. ఏ చర్య తీసుకుంటే ఏం జరుగుతుందో తెలియని నేపథ్యంలో అటు కేంద్రం సలహా తీసుకుందామనుకున్న కేంద్రం కూడా గవర్నర్ పై అసంతృప్తి వ్యక్తం చేసింది. ఏది ఏమైనా ఇంకో రెండు మూడు రోజులైతే కానీ ఏం చర్యలు తీసుకుంటారో తెలుస్తుంది.