నిన్న రాజగోపాల్ రెడ్డి.. నేడు వివేక్.. తెలంగాణలో ఒక్కటొక్కటిగా రాలుతున్న కమలం రేకులు!
posted on Nov 1, 2023 12:52PM
ఎన్నికలకు ముందు బీజేపీకి మరో షాక్ తగిలింది. ఆ పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, మేనిఫెస్టో కమిటీ సభ్యుడు, మాజీ ఎంపీ వివేక్ పార్టీకి గుడ్ బై చెప్పారు. బీజేపీకి రాజీనామా చేసి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు.
సరిగ్గా కర్నాటక ఎన్నికల ముందు బీజేపీ ఆ రాష్ట్రంలో ఎటువంటి పరిస్థితి అయితే ఎదుర్కొందో.. ఇప్పుడు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ముంగిట కూడా అదే పరిస్థితి ఎదుర్కొంటోంది. కమలం రేకులు ఒక్కటొక్కటిగా రాలిపోతున్నాయి. పార్టీ సీనియర్ నేతలు ఒక్కరొక్కరుగా బీజేపీకి రాంరాం చెప్పేసి కాంగ్రెస్ ‘హస్తం’ అందుకుంటున్నారు.
బీజేపీ అభ్యర్థుల ఖరారు కోసం పార్టీ ఎలక్షన్ కమిటీ హస్తినలో సమావేశం జరుగుతున్న సమయంలోనే వివేక్ తన రాజీనామా లేఖను పార్టీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డికి పంపారు. అలా పంపిన నిముషాల వ్యవధిలోనే ఆయన కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. విజయభేరి సభలో పాల్గొనేందుకు వచ్చిన పార్టీ కీలక నేత రాహుల్ గాంధీని కుటుంబ సమేతంగా కలిశారు. ఆయన సమక్షంలోనే తన కుమారుడితో పాటు కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. అయినా వివేక్ బీజేపీని వీడుతారని గత కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతూనే ఉంది. అయితే ఆయన పార్టీ వీడి బీఆర్ఎస్ వైపు వెడతారా? కాంగ్రెస్ చేయందుకుంటారా? అన్న విషయంలో మాత్రం ఇప్పటి వరకూ క్లారిటీ లేకపోయింది. అయితే ఆ సందిగ్ధతకు ఫుల్ స్టాప్ పెడుతూ వివేక్ కాంగ్రెస్ గూటికి చేరారు.
మూడు నాలుగు రోజుల కిందట తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వివేక్ తో భేటీ అవ్వడంతో అప్పటి నుంచీ ఆయన కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతున్నారనీ, ఆ పార్టీ తీర్థం పుచ్చుకోవడం తథ్యమని పరిశీలకులే కాదు, కాంగ్రెస్ శ్రేణులు కూడా భావిస్తూ వచ్చాయి. చివరికి అదే జరిగింది. వివేక తీవ్ర అసంతృప్తితో ఉన్నారని తెలిసినా బీజేపీ మాత్రం ఆయనను బుజ్జగించడానికి పెద్దగా ప్రయత్నించలేదని బీజేపీ శ్రేణులు అంటున్నాయి. బలమైన నేత ఎన్నికల ముందు పార్టీ వీడటం బీజేపీకి గట్టి ఎదురుదెబ్బగానే పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. టీవలే బీజేపీ నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ గూటికి చేరిన సంగతి తెలిసిందే. రానున్న రోజుల్లో మరింత మంది బీజేపీని వీడి కాంగ్రెస్ పంచన చేరే అవకాశాలున్నాయని కాంగ్రెస్ శ్రేణులు అంటున్నాయి.