వందకోట్లమందిలో కంటి సమస్యలు

'సర్వేంద్రియానాం నయనం ప్రధానం' అన్నారు పెద్దలు. రెప్పపాటు కాలం కళ్లు మూసుకుంటే ప్రపంచమే చీకటైపోతుంది. అందుకే కళ్ల విషయంలో ప్రతి ఒక్కరూ ఎంతో జాగ్రత్తలు తీసుకోవాలని మన పెద్దవారు చెప్తారు. స్మార్ట్ యుగంలో కంటికి రక్షణ లేకుండా పోయిందని, ఎక్కువ సేపు ఫోన్, లాప్ టాప్, కంప్యూటర్, టీవీ వంటి స్క్రీన్లను చూడటం కంటికి హాని కలిగిస్తాయని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు.

 

ప్రపంచ జనాభా 780కోట్లు అయితే అందులో వందకోట్ల మందిలో కంటిసమస్యలు ఉన్నాయి. వారు దూర, దగ్గరి దృష్టిలోపం కారణంగా ఇబ్బందిపడుతున్నారు. సాధారణంగా 50ఏళ్లు పై బడిన వారిలో కంటిసమస్యలు వస్తాయి. అయితే ప్రస్తుత కాలంలో చిన్నపిల్లల్లో కూడా కంటిచూపు సమస్యలు వస్తున్నాయి.

 

కంటి సమస్యలతో బాధపడుతున్న వారిలో జనాభాలో  రెప్రాక్టీవ్ ఎరర్(refractive error) కారణంగా  దాదాపు 123.7 మిలియన్ మంది,  కంటిశుక్లం( cataract )కారణంగా 65.2 మిలియన్ మంది, గ్లాకోమా ( glaucoma ) తో 6.9 మిలియన్ మంది, కార్నియల్ అస్పష్టత ( corneal opacities )తో 4.2 మిలియన్ మంది,  డయాబెటిక్ రెటినోపతి(  diabetic retinopathy ) కారణంగా 3 మిలియన్ మంది, ట్రాకోమా ( trachoma ) తో 2 మిలియన్ మంది ఇతర సమస్యతో 826 మిలియన్ మంది ఉన్నారు. అభివృద్ధి చెందిన దేశాల్లో డయాబెటిక్ రెటినోపతి, గ్లాకోమా, మాక్యులార్ డీజెనరేషన్ వంటి వ్యాధుల కారణంగా కంటిచూపు సమస్యలు ఎక్కువగా వస్తున్నాయి. పేదదేశాల్లో పుట్టుకతోనే కంటిశుక్లాలు రావడం దృష్టిలోపానికి ప్రధాన కారణం అవుతుంది.

 

కంటి సమస్యలను నివారించాలంటే అవసరమైన పోషకాలను, విటమిన్-ఎ, సి ఎక్కువగా ఉండే ఆహారపదార్థాలు తీసుకోవాలి. ఫోన్, టీవీ, కంప్యూటర్ స్క్రీన్ లను ఎక్కువ సేపు చూడవద్దు. ప్రతి అరగంటకు ఒకసారైన ఒక నిమిషం కంటికి విశ్రాంతి ఇవ్వాలి. కళ్లు చాలా సున్నితమైన భాగాలు అన్న విషయం గుర్తుంచుకోవాలి. నేత్రదానం చేయడం వల్ల ఇతరులకు కంటిచూపు ఇవ్వవచ్చన్న అంశంపై అవగాహన కల్పించాలి.