ఏపీ అవినీతిలో నూతన అధ్యాయం !


ఏపీలో ప్రభుత్వం మారాక అవినీతిని సహించనని ఏపీ సీఎం చెబుతున్నా ప్రభుత్వ అధికారులు కక్కుర్తి పడి దొరికిపోతున్నారు. అలా ఈరోజున విశాఖ జిల్లాలో ఏసీబీకి భారీ అవినీతి తిమింగలం చిక్కింది. రూ.2కోట్ల లంచం తీసుకుంటూ సహకార శాఖ రిజిస్ట్రార్‌ మల్లికార్జునరావు అవినీతి నిరోధక శాఖ అధికారుల వలకు చిక్కాడు. లబ్ధిదారుడి వద్ద రూ.2కోట్ల లంచం డిమాండ్‌ చేసి ఆయన అడ్డంగా దొరికిపోయాడు. సహకార శాఖ రిజిస్ట్రార్ మల్లిఖార్జున రావు త‌న ద‌గ్గ‌రికి పని కోసం వ‌చ్చిన ఓ వ్య‌క్తి నుంచి రూ.2కోట్లు లంచం డిమాండ్ చేశాడు. 

అదీ న‌గ‌దు రూపంలో కాకుండా భూమి రిజిస్ట్రేష‌న్ కి ఒప్పందం చేసుకున్నారు. బాధితుడి స‌మాచారంతో ఏసీబీ అధికారులు విశాఖ టర్నర్ ఛౌల్ట్రీ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఈ భూ రిజిస్ట్రేషన్ సమయంలో వలపన్ని పట్టుకున్నారు. లంచాల చరిత్రలోనే ఇదొక నూతన అధ్యాయం అని చెప్పాలి. అయితే, మల్లికార్జునరావు ఏ పనికోసం అంత భారీగా లంచం డిమాండ్‌ చేశాడు? ఏసీబీ అధికారులు దాన్ని ఎలా గుర్తించి పట్టుకున్నారనే విషయాలు ఇంకా తెలియాల్సి ఉంది. 

అయితే ఇదే కార్యాలయంలో వారం రోజుల క్రితమే ఇదే పొజీషన్ లో ఉన్న మోషే కూడా ఏసీబీ అధికారులకి ఇలాగే చిక్కాడు. వివరాలిలా ఉన్నాయి. ప్రభుత్వం ఇచ్చే సొసైటీ స్థలాన్ని పొందాలంటే ముందు ఆ సొసైటీని డివిజనల్‌ కో ఆపరేటివ్‌ అధికారి సందర్శించి పరిశీలించాల్సి ఉంది. అయితే తమ సొసైటీని పరిశీలించి తగిన ధ్రువీకరణ పత్రం ఇవ్వాలని సింహాద్రప్ప అనే వ్యక్తి సహకారశాఖ రిజిస్ట్రార్‌ మోషేకు దరఖాస్తు చేసుకున్నాడు. అయితే సొసైటీలో ఎలాంటి అవకతవకలూ లేవని ధ్రువీకరించాలంటే తనకు 200 గజాల స్థలాన్ని ఇవ్వాలని డిమాండ్‌ చేశాడు. దీంతో బాధితుడు ఎసిబి అధికారులను ఆశ్రయించాడు. ఎసిబి అధికారులు వలపన్ని మోషేను పట్టుకున్నారు. అయితే వారం రోజుల్లోనే ఓకే కార్యాలాయంలో ఇద్దరు ఉద్యోగస్తులు ఏసీబీకి దొరకడం అంటే మామూలు విషయం కాదు.