పార్టీ అధినేతను కలవడానికి వీఐపీ పాసులా?.. జగన్ ను ఓ రేంజ్ లో ట్రోల్ చేసిన లోకేష్
posted on Sep 2, 2025 3:30PM

పులివెందులలో జరిగే సమావేశాలకు పార్టీ సభ్యులకు వీఐపీ పాస్‌లు జారీ చేయాలనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిర్ణయంపై ఐటీ మంత్రి నారా లోకేష్ సామాజిక మాధ్యమ వేదిక ఎక్స్ ద్వారా ఓ రేంజ్ లో ట్రోల్ చేశారు "ఓరిని పాసులా. సినిమా ఫంక్షన్లకు వీఐపీ పాస్‌ల గురించి విన్నాం కానీ మీ సొంత నియోజకవర్గంలో మీ సొంత పార్టీ అధినేతను కలవడానికి వీఐపీ పాస్‌లు ఏంటంటూ ఎద్దేవా చేశారు. ఇలాంటిది ఇంతకు ముందు ఎప్పుడూ వినలేదు, కనలేదని పేర్కొన్నారు.
ఇటీవలి జెడ్‌పీటీసీ ఉప ఎన్నికలో కనీసం డిపాజిట్ కూడా దక్కకుండా వైసీపీ అభ్యర్థి ఘోర పరాజయం పాలైన సంగతి తెలిసిందే. జగన్ అడ్డాలో ఈ పరాజయ పరాభవం తరువాత ఆయన తొలి సారిగా పులివెందులకు సోమవారం (సెప్టెంబర్ 1) వచ్చారు.
ఆ సందర్భంగా తనను కలవాలనుకునే వారికి వీఐపీ పాస్‌లు జారీ చేశారు. జగన్ ఈ నిర్ణయం పులివెందుల పార్టీ నేతలు, కార్యకర్తలలో తీవ్ర అసంతృప్తి వ్యక్తం కావడానికి దారి తీసింది. ఎందుకంటే.. వీఐపీ పాస్‌లు ఉన్న అతి కొద్ది మంది నాయకులను మాత్రమే జగన్ కలిశారు. జగన్ భద్రతా బృందం వీఐపీ పాస్‌లు కలిగి ఉన్నవారికి మాత్రమే ప్రవేశం కల్పించింది.. వీఐపీ పాసులు లేకుండా ఆయన ఛాయలకు కూడా వెళ్ల నీయలేదు. దీంతో చాలా మంది పార్టీ నేతలూ, కార్యకర్తలు జగన్ భద్రతా సిబ్బందితో వాగ్వాదానికి దిగిన పరిస్థితి కనిపించింది. మొత్తం మీద జగన్ కు కలవడానికి వీఐపీ పాస్ ల జారీ వ్యవహారం ఓ ప్రహసనంలా మారింది.