మంత్రికీ తప్పని నిరసన సెగలు

 

తెరాస అభ్యర్థులకు పార్టీ అధినేత కేసీఆర్ ప్రచారానికి వెళ్లి చేసిన అభివృద్ధి పనులను తెలియజెప్పమంటుంటే అసలు ఎక్కడ అభివృద్ధి జరిగిందంటూ ప్రచారానికి వెళ్లిన అభ్యర్థులను గ్రామస్తులు నిలదీస్తున్నారు.తాజాగా ఓ ఎమ్మెల్యే, చివరికి మంత్రికి కూడా ప్రచారానికి వెళ్లగా నిరసనలతో చేదు అనుభవాలు మిగిలాయి.మంత్రి, తెరాస ములుగు అభ్యర్థి అజ్మీరా చందూలాల్‌ కత్తిగూడెం, బ్రాహ్మణపల్లి, దోమేడ, నిమ్మగూడెం, రామచంద్రునిపేట, తిమ్మాపురం, తక్కళ్ళగూడెం, చింతకుంట, సంగెంపల్లి గ్రామాల్లో పర్యటించారు.ఆయా గ్రామాల్లో జరిగిన రోడ్‌షోలలో ప్రజలనుద్దేశించి మాట్లాడారు.అయితే కత్తిగూడెం, దోమెడ గ్రామాల్లో జరిగిన రోడ్‌షోలలో మంత్రి చందూలాల్‌ ప్రసంగాన్ని స్థానికులు అడ్డుకున్నారు. 

కత్తిగూడెంలో అంతర్గత రోడ్లు అధ్వానంగా ఉన్నాయని, డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు కూడా మంజూరు చేయలేదన్నారు.రైతుల భూములకు పూర్తిస్థాయిలో పట్టాలు రాలేదని పేర్కొన్నారు. తమ సమస్యలు తీర్చకుండా ఓట్లెలా అడుతారని మంత్రి నిలదీశారు.ప్రతిగా మంత్రి స్పందిస్తూ అంతర్గతరోడ్ల నిర్మాణానికి నిధులు మంజూరయ్యాయని, ఎన్నికల కోడ్‌ వలన పనులు ప్రారంభంకాలేదని వివరణ ఇచ్చారు.భూములకు పట్టాల విషయంలో సంబంధిత అధికారులతో మాట్లాడుతానన్నారు.ఓ మహిళ శిథిలమైన ఇంట్లో ఉంటున్నా తనకు డబుల్‌ బెడ్‌రూం ఇల్లు మంజూరు చేయలేదని నిలదీయగా.. మళ్ళీ తెరాస నే అధికారంలోకి వస్తుందని,అప్పుడు తప్పకుండా ఇల్లు మంజూరు చేస్తానని మంత్రి హామీ ఇచ్చారు.

తాజా మాజీ ఎమ్మెల్యే బానోత్‌ శంకర్‌నాయక్‌ మహబూబాబాద్‌ శివారు బేతోలులో ప్రచారానికి వెళ్లగా స్థానిక ప్రజలు అడ్డుకున్నారు.శంకర్‌నాయక్‌ తెరాస శ్రేణులతో బేతోలు గ్రామానికి చేరుకున్నారు. గ్రామంలో ప్రచారం నిర్వహించేందుకు వాహనం దిగి కాలినడకన బయలుదేరాడు. విషయం తెలుసుకున్న గ్రామస్థులు పెద్ద ఎత్తున రోడ్డుపైకి వచ్చి చుక్క నీరు ఇవ్వని ఎమ్మెల్యే మా ఊరికి రావోద్దంటూ నినాదాలు చేస్తూ కాలినడకన వెళ్తున్నశంకర్‌నాయక్‌ ను అడ్డుకున్నారు.ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.దీంతో తెరాస పార్టీ శ్రేణులు, గ్రామస్థుల మధ్య వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలోనే ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది. విషయం తెలుసుకున్న మహబూబాబాద్‌ టౌన్‌, రూరల్‌ ఎస్సైలు అరుణ్‌కుమార్‌, జితేందర్‌లు సిబ్బందితో బేతోలు గ్రామానికి చేరుకున్నారు.ఇరువర్గాలకు నచ్చచెప్పటంతో వివాదం సర్దుమణిగింది.అనంతరం శంకర్‌నాయక్‌ ప్రచారం నిర్వహించారు.