సోషల్ మీడియా వికృత చేష్టలపై కేసీఆర్ హామీని నిలబెట్టుకోవాలి: విజయశాంతి

అరచేతిలో వైకుంఠం చూసేందుకు నేటి జనాలు స్మార్ట్ ఫోన్లను ఉపయోగిస్తున్న విషయం తెలిసిందే. ప్రపంచంలో ప్రతినిత్యం ఎక్కడ ఎలాంటి ఘటన జరిగినా క్షణాల్లో తెలిసుకొనే అవకాశం ప్రజలకు సోషల్ మీడియా కల్పించింది. అలాంటి సోషల్ మీడియా ఎంత అద్భుతమో.. ఉపయోగించే విధానాన్ని బట్టి అంతే.. ప్రమాదం అని కూడా తెలుస్తోంది. ముఖ్యంగా సోషల్ మీడియా ప్రమాదాలు రోజు రోజుకూ వికృతంగా మారుతున్నాయి. ఇందుకు నెటిజన్లు కొందరు సోషల్ మీడియా స్వేచ్ఛను విశృంఖలత్వంగా వాడుకోవడమే కారణంగా భావించవచ్చు. అయితే సోషల్ మీడియాలోని విశృంకలత్వాన్ని కట్టడి చేసేందుకు తీవ్రమైన చర్యలు తీసుకుంటామని తెలంగాణ సీఎం కేసీఆర్ గతంలో ప్రకటించారని సీనియర్ నటి, రాజకీయ నాయకురాలు విజయశాంతి గుర్తు చేశారు. సీఎం కేసీఆర్ చేసిన ప్రకటన ఆచరణలోకి వచ్చి సోషల్ మీడియా వికృత పోకడలను నియంత్రిస్తేనే మహిళలపై జరిగే దారుణాలను అదుపు చేయవచ్చని ఆమె తెలిపారు. అదే విషయాన్ని తెలంగాణలోని మహిళాలోకం కోరుకుంటుందని కూడా ఆమె వివరించారు. అలాగే.. ఈ సోషల్ మీడియాలో వికృత చేష్టలపై వెంటనే కఠిన నిర్ణయం తీసుకోవాలని తాజాగా విజయశాంతి టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కోరారు.

అయితే ఉన్నట్లుండి ఇప్పుడు విజయశాంతి ఇలా కేసీఆర్ గతంలో ఇచ్చిన హామీని గుర్తు చేయటం వెనుక ఓ ఘటన దాగి ఉంది. దిశ ఉదంతం మర్చిపోకముందే కరీంనగర్ లో ఓ బాలికపై ప్రేమోన్మాది దాడి చేసి అతి కిరాతకంగా హతమార్చాడు. ఆ ఘటన తెలంగాణ సమాజాన్ని కుదిపేసింది. ఇంట్లో ఉన్న బాలికపై కత్తితో దాడి చేసిన ఆ ప్రేమోన్మాది విచక్షణా రహితంగా హత్య చేశాడని విజయశాంతి ఆవేదన చెందారు. ఈ ఘటనను బట్టి మహిళలు బయట స్వేచ్ఛగా తిరగటం కాదు.. అసలు ఇక్కడ ఇంట్లో ఉన్నకానీ.. మహిళలకు రక్షణ లేకుండా పోయిందన్న సంకేతాలు సమాజాన్ని భయపెడుతోందని విజయశాంతి హెచ్చరించారు. 

అంతేకాకుండా ఎన్ కౌంటర్ లు చేసిన ఉన్మాదులు మారటం లేదని.. అలాగే.. ఉరితీసినప్పటికీ.. ఏమాత్రం భయపడటం లేదని విజయశాంతి ఆందోళన వ్యక్తం చేశారు. అసలు మహిళలపై జరుగుతున్న ఇటువంటి అఘాయిత్యాలకు సోషల్ మీడియానే ప్రధాన కారణమని కూడా ఆమె అభిప్రాయపడ్డారు. అందుకే సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు సోషల్ మీడియాలో విశృంఖలత్వాన్ని కట్టడి చేసేలా చర్యలు తీసుకోవాలని ఆమె విజ్ఞప్తి చేశారు. అంతటితో ఆగకుండా ఇదే పరిస్థితి కొనసాగితే అరబ్ దేశాలలో మాదిరిగా మహిళల పట్ల దారుణంగా ప్రవర్తించే వ్యక్తులను బహిరంగంగా శిక్షించే విషయాన్ని పరిశీలించాలని కూడా సీఎం కేసీఆర్ ను విజయశాంతి కోరారు.