ఢిల్లీలో ఆప్.. ఘన విజయం అంబరం తాకే సంబరాలు

 

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఘన విజయం సాధించింది. ముచ్చటగా మూడోసారి ఓ సామాన్యుడు ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయబోతున్నారు. జాతీయ పార్టీలను కాదని.. ఢిల్లీలో పరిశుభ్రంగా చీపురు కట్ట ఊడ్చేసింది. దీంతో ఆప్ సంపూర్ణ ఆధిక్యతను సాధించినట్లైంది. దేశాన్ని ఏలుతున్న బీజేపీని చిత్తు చిత్తుగా ఓడించింది. కాంగ్రెస్ పార్టీని నామా రూపాలు లేకుండా చేసింది. ఏకంగా ఆప్ 63 స్థానాల్లో స్పష్టమైన ఆధిక్యత సాధించింది. దీంతో అభివృద్ధి ఎక్కడ జరుగుతుందో అక్కడ ప్రజల ఆదరణ తప్పక ఉంటుందని మరోసారి రుజువుచేశారు.శతాబ్దాల నుంచి ఉన్న జాతీయ పార్టీకి.. కేంద్రంలో అధికారంలో ఉన్న మతతత్త్వ పార్టీకి ఢిల్లీ ప్రజలు బలంగా బుద్ధి చెప్పారని ఆప్ ఆనందంలో మునిగితేలుతుంది. అభివృద్ధికే ఓటేశారని ఆ పార్టీ హర్షం వ్యక్తం చేసింది. ఇదే సమయంలో మూడోసారి సీఎంగా పగ్గాలు చేపట్టబోతున్న అరవింద్ కేజ్రీవాల్ కు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. అయితే కేవలం ఏడు స్థానాల్లోనే ఆధిక్యతను కనబరుస్తున్న బీజేపీకి ఇది గట్టి దెబ్బగానే భావించాలి. కాంగ్రెస్ అసలు కోలుకోలేని దెబ్బగా పరిగణించాలి. న్యూఢిల్లీ అసెంబ్లీ స్థానం నుంచి హాట్రిక్ విజయం సాధించారు కేజ్రీవాల్. 13,508 ఓట్ల మెజార్టీతో కేజ్రివాల్ ఘన విజయాన్ని అందుకొని చరిత్ర సృష్టించారు. అలాగే.. డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా మాత్రం బీజేపీ అభ్యర్థి నుంచి గట్టి పోటీని ఎదుర్కొని చివరి రౌండ్ లో  సిసోడియా 3,508 ఓట్ల తేడాతో గెలుపొందడం విశేషం. అంతేకాకుండా ఢిల్లీలో ఈసారి అసెంబ్లీ ఎన్నికలను అన్ని పార్టీలు చాలా ప్రతిష్టాత్మకంగా భావించాయి. కేజ్రివాల్ కు ఈ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్ కు వ్యూహకర్తగా ఉన్న ప్రశాంత్ కిశోర్ కేజ్రివాల్ కి కూడా వ్యూహకర్తగా వ్యవహరించడంతో ఇప్పుడు పీకే క్రేజ్ అమాంతం పెరిగింది. ఢిల్లీలో ఆప్ విజయానికి పీకే వ్యూహం కూడా పనిచేసింది. ఈ విజయోత్సవం సందర్భంగా ఢిల్లీలోని ఆప్ కార్యాలయంలో కేజ్రీవాల్ ను కలిసిన ప్రశాంత్ కిశోర్ శుభాకాంక్షలు తెలిపారు. పోలింగ్ సరళిని పరిశీలిస్తూ.. ఆప్ నేతలతో కీలకంగా భేటీ అయ్యారు. ఇక ఆప్ పార్టీ ఘన విజయం అందుకోవడంతో పార్టీ కార్యాలయం ఎదుట సంబరాలు అంబరాన్ని తాకాయి. ఏకంగా ఆప్ కార్యకర్తలు.. అమిత్ షాకు కరెంట్ షాక్ కొట్టిందంటూ నినాదాలు చేస్తుండటం విశేషం.