విజయసాయికి షాక్.. ఆర్ఆర్ఆర్ ఎఫెక్టేనా?

వైకాపా రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డికి కేంద్రం  షాకిచ్చింది. రాజ్యసభ వైస్ ఛైర్మన్ ప్యానెల్ పేర్ల జాబితా నుంచి ఆయన పేరును తొలగించింది. ముందుగా ప్యానల్ లో ఆయన పేరును ప్రకటించి, రెండు రోజుల వ్యవధిలోనే తొలగించింది. తొలుత  ప్రకటించిన రాజ్యసభ వైస్ చైర్మన్ ప్యానల్ జాబితాలో విజయసాయి రెడ్డి  పేరు ఉంది.

దీనిపై విమర్శలు వెల్లువెత్తాయి. పలు ఆర్థిక నేరాల కేసుల్లో విజయసాయి రెడ్డి ఏ2గా ఉన్నారు, ఆయనను రాజ్యసభ వైస్ చైర్మన్ ప్యానల్ జాబితాలో ఎలా చేరుస్తారంటూ ప్రశ్నలు గుప్పించారు. ఈ నేపథ్యంలోనే ఆయన పేరును తొలగించారు. తొలుత ఎనిమిది మంది పేర్లతో విడుదల చేసిన జాబితాలో విజయసాయికి స్థానం దక్కింది. అయితే ఆ తరువాత రాజ్యసభ వైస్ చైర్మన్ ప్యానల్ సభ్యులను వెల్లడించే సమయంలో రాజ్యసభ చైర్మన్, ఉప రాష్ట్రపతి జగదీష్ ధన్కఢ్ కేవలం ఏడుగురి పేర్లు మాత్రమే చదివారు. ఆయన చదివిన పేర్లలో వైసీపీ ఎంపీ విజయసాయి పేరు లేదు. ఆయనను రాజ్యసభ వైస్ చైర్మన్ ప్యానల్ జాబితా నుంచి తొలగించారు.

అయితే విజయసాయి రెడ్డిని రాజ్యసభ వైస్ చైర్మన్ ప్యానెల్ జాబితా నుంచి తొలగించడానికి కారణాలేమిటన్నది మాత్రం రాజ్యసభ చైర్మన్, ఉప రాష్ట్రపతి జగదీష్ ధన్కఢ్  వెల్లడించలేదు. ఈ ప్యానెల్ జాబితాలో తన పేరు ఉన్నట్లు తెలియగానే విజయసాయి స్పందించారు. ఉపరాష్ట్రపతికి కృతజ్ణతలు తెలిపారు.  సభ నిర్వహణలో పూర్తి సహకారం అందిస్తానని హామీ ఇస్తున్నట్లు ట్వీట్ చేశారు. అయితే హఠాత్తుగా ప్యానల్ జాబితా నుంచి ఆయనను తొలగించడంపై మాత్రం ఇంత వరకూ ఆయన స్పందించలేదు.

అయితే ఈ జాబితా నుంచి విజయసాయిరెడ్డి పేరు తొలగించడంపై రాజకీయంగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణం రాజు (ఆర్ఆర్ఆర్) ఫిర్యాదు కారణంగానే విజయసాయి పేరును తొలగిస్తూ రాజ్యసభ చైర్మన్ నిర్ణయం తీసుకున్నారన్న చర్చ అయితే జోరుగా సాగుతోంది. విజయసాయి సామాజిక మాధ్యమంలో అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారంటూ రఘురామకృష్ణంరాజు ఇటీవల రాజ్యసభ చైర్మన్ కు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.

ఆ ఫిర్యాదులో ప్యానల్ జాబితా నుంచి విజయసాయిరెడ్డిని తొలగించాలని రఘురామ కోరారు. దీంతో విజయసాయి తొలగింపు వెనుక రఘురామకృష్ణం రాజు ఫిర్యాదు ఉందని అంటున్నారు. అయితే రాజ్యసభ వైస్ చైర్మన్ ప్యానల్ జాబితా నుంచి తన పేరు తొలగింపుపై విజయసాయి రెడ్డి స్పందన ఏమిటనేది తెలియాల్సి ఉంది.