అవును ..నిజం టీడీపీ విజయం వంద శాతం నిజం

అవును.. 2019 ఎన్నికల్లో తెలుగు దేశం పార్టీ ఓడిపోయింది. నిజానికి, ఆ ఎన్నికల్లో తెలుగు దేశం ఎందుకు ఓడిపోయిందో, ఇప్పటికీ ఎవరికీ అర్థం కాదు. రాష్ట్ర విభజన అరిష్టాలను ఎదుర్కుంటూ, నవ్యాంద్ర తొలి ముఖ్యమంత్రి చంద్రాబాబు నాయుడు, రాష్ట్రాన్ని ఒక గాడిలో పెట్టేందుకు, తన అనుభవం అంతా రంగరించి, ప్రణాళికా బద్దంగా ముందుకు సాగారు. రాజధాని అమరావతిని, ‘గ్రోత్ ఇంజిన్’ నగరంగా అభివృద్ధి చేసేందుకు, చరిత్రలో ఎరగని విధంగా  భూ సమీకరణ చేశారు. నిర్మాణాలు మొదలయ్యాయి.. మరొక్క ఐదేళ్ళు చంద్రబాబు రాష్ట్ర ముఖ్యమంత్రిగా కొనసాగితే, రాజధాని నగరం అమరావతి పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందడమే కాదు, రాష్ట్రం అన్ని రంగాలో అభివృద్ధి సాధించి  అగ్రగామి రాష్ట్రంగా నిలిచేది. అయితే దురదృష్టవశాత్తు, 2019 అసెంబ్లీ ఎన్నికలో తెలుగు దేశం పార్టీ ఒడి పోయింది. వైసీపీ అధ్యక్షడు జగన్మోహన్ రెడ్డి ఒక్క ఛాన్స్  అభ్యర్ధన సృష్టించిన సింపతీతో వైసీపీ గెలిచింది. జగన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. ఇక ఆతర్వాత ఏమి జరిగింది అన్నది కళ్ళ ముందు కదులుతున్న నడుస్తున్న చరిత్ర. 

రాష్ట్ర విభజన అనతరం రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఐదేళ్ళ పాలనలో రాష్ట్రం సగటున 10.8 శాతం వృద్ధి రేటు నమోదైతే, అది జగన్ రెడ్డి మూడేళ్ళ సుందర ముదనష్ట పాలనలో 3 శాతానికి పడిపోయింది. 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఓడిపోవడం వలన రాష్ట్రం ఏమి కోల్పోయిందో, ఈ ఒక్క లెక్క చూస్తేనే తెలుస్తోంది. నిజానికి, జగన్ రెడ్డి పాలనలో రాష్ట్రానికి జరిగిన అన్యాయాలు, అన్నీ ఇన్నీ కావు. అందుకే, ఇప్పడు రాష్ట్ర ప్రజలు మళ్ళీ చంద్రన్న రావాలి ... వెలుగు తేవాలి  అంటున్నారు. చంద్రబాబు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న  యాత్రలు చూస్తే  జనం జగన్ పాలనతో ఎంతగా విసిగిపోయారో  ఎంతగా  చంద్రబాబు మళ్ళీ ముఖ్యమంత్రి కావాలని  కోరుకుంటున్నారో అర్థమవుతుంది. 

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం .. చేసుకున్న అదృష్టం చద్రబాబు అయితే దురదృష్టం ..ఎవరో చెప్పనక్కరలేదని, సామాన్య ప్రజలు కూడా చెప్పుకుంటున్నారు. నిజానికి 2019 ఓటమి తర్వాత తెలుగు దేశం ‘అస్తిత్వం’ విషయంలో కొందరు అనుమానాలు వ్యక్తం చేశారు. వైసేపీ ఏకంగా 151 అసెంబ్లీ స్థానాలను గెలుచుకోవడం,టీడీపీ బలం 23 కు పడిపోవడంతో టీడీపీ తిరిగి పుంజుకోవడం అంత ఈజీ కాదని విశ్లేషణలు వినిపించిన వారు లేక పోలేదు. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు వయసు రిత్యా అంత చురుకైన పాత్రను పోషించలేక పోవచ్చని, అలాగే, పార్టీని ముందుకు నడిపించడంలో లోకేష్ అనుభవం సరిపోదని  చాలా మంది చాలా రకాల సందేహాలను వ్యక్త పరిచారు. అయితే ఇప్పుడు ఆ చాలా మందే, అటు చంద్రబాబు, ఇటు లోకేష్ విషయంలో తమ అంచానాలు తప్పాయని అంగీకరిస్తున్నారు. 

వైసేపీ అరాచక పాలనను తట్టుకుని  టీడీపీ అస్థిత్వాన్ని నిలుపుకోవడమే కాదు, పడిలేచిన కెరటంలా చంద్రబాబు దూసుకొస్తున్నారు. మళ్లీ జనంలోకి వచ్చారు. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు. నిజానికి చంద్రబాబు నాయుడికి, ఇది కొత్త కాదు. చంద్రబాబు నాలుగు పదుల రాజకీయ జీవితంలో ఎన్నో ఎత్తు పల్లాలు చూశారు. ప్రతీ ఓటమి నుంచి గుణపాఠాలు నేరుస్తూ.. గెలుపు తలుపులు తెరిచారు. ఇప్పడు మళ్ళీ అదే జరుగుతోంది. వయసుతో  పని లేకుండా 70 ఏళ్ల యువకుడిలా చంద్రబాబు సాగిస్తున్న రోడ్ షో లు కార్యకర్తల్లో కొత్త ఉత్సాహాన్ని నిపుతున్నాయి. చంద్రబాబు వేసే ప్రతి అడుగులో కొత్త ఉత్సాహం తోణికిసలాడుతోందని, టీడీపీ కార్యకర్తలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.  

ఆలాగే లోకేష్, లోకేష్ కూడా ప్రత్యక్ష రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. ఇప్పుడే కాదు. 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చినప్పటినుంచే  నారా లోకేష్ మంత్రిగా పనిచేశారు. అయితే.. 2019లో మంగళగిరి నుంచి పోటీ చేసి ఓడిపోయినా.. వెనకడుగు వేయలేదు. వివిధ కార్యక్రమాలతో నిత్యం ప్రజల్లోనే ఉండే ప్రయత్నం చేస్తున్నారు. అంతే కాకుండా తాజాగా పాదయాత్రకు కూడా లోకేష్ ప్లాన్ చేసుకున్నారు. సంక్రాంతి తర్వాత అది మొదలు కానుంది. దాదాపు 4 వేల కిలో మీటర్లు లోకేష్ నడవనున్నారు. లోకేశ్ పాదయాత్రతో పార్టీకి ఎంతో మేలు జరుగుతుందని తెలుగుదేశం నేతలు భావిస్తున్నారు. అటు లోకేశ్ ప్రజల్లో ఉంటే.. ఇటు చంద్రబాబు పార్టీకి సంబంధించిన వ్యవహారాలు చూసుకునే వీలు ఉంటుందని నేతలు భావిస్తున్నారు. 

మరో వంక జగన్ రెడ్డి ఒంటరి పోరాటం చేస్తున్నారు. 2019 ఎన్నికలలో అన్ని విధాల అండగా ఉన్న  తల్లి విజయమ్మ, చెల్లి షర్మిలను జగన్ రెడ్డి దూరం చేసుకున్నారో, వారే తమ దారి తాము చూసుకున్నారో ఏమో కానీ  ఇప్పుడు వైఎస్ కుటుంబంలో జగన్ రెడ్డి ఒంటరై పోయారని అంటున్నారు. వైఎస్ షర్మిలను తెలంగాణ ప్రభుత్వం అరెస్ట్ చేసినా జగన్ రెడ్డి స్పందించలేదు. చివరకు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కూడా ఇదే విషయాన్ని ప్రస్తావించారు. నిజానికి వైఎస్ సొంత కుటుంబమే కాదు బంధు వర్గం కూడా జగన్ రెడ్డికి దూరమయ్యారు. ఇక పార్టీలో ఆయన నమ్మే వారు, ఆయన్ని నమ్మే వారు ఒకరిద్దరు మినహా మరెవరు లేరు. చివరకు మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా దూరమవుతున్నారు. అందుకే, 2024 ఎన్నికల్లో ఒక్క ఛాన్స్ జగన్ ఓటమి తధ్యమని అంటున్నారు. అలాగే చంద్రబాబు స్పష్టం చేసిన విధంగా  టీడీపీ విజయం వందశాతం నిజం.