నెల్లూరు విజయసాయికి అందని ద్రాక్షే.. దేశం కూటమిలో జోష్.. జగన్ శిబిరంలో నైరాశ్యం!

వైసీపీలో కొన్ని రోజుల నుంచీ ఒక విధమైన నైరాశ్యం కనిపిస్తోంది. ఆ పార్టీ అధినేత జగన్ నుంచి, కీలక నేతలైన విజయసాయిరెడ్డి వంటి వారి వరకూ అందరూ అన్యాపదేశంగా తమ పార్టీ ఓటమి తథ్యమన్న సంకేతాలే ఇస్తున్నారు.  ముందుగా జగన్ ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్లపై నమ్మకం పోయిందంటూ చేతులెత్తేశారు. ఎన్నికల కమిషన్ తమ పథకాలను నిలిపివేస్తోందనీ, తమకు మద్దతుగా ఉన్న అధికారులపై బదలీ వేటు వేసి.. అధికారులెవరూ అధికార పార్టీకి సహకరించకుండా చేస్తోందనీ వ్యాఖ్యానించి. అటువంటి అనుచిత సహకారం లేకపోతే గెలుపు సాధ్యం కాదన్న విషయాన్ని చెప్పకనే చెప్పేశారు.

ఇక తొలి సారిగా ప్రత్యక్ష ఎన్నికలలోకి అడుగుపెట్టిన విజయసాయిరెడ్డి పరిస్థితి అయితే మరీ దారుణంగా మారిపోయింది. ఆయన ప్రచారానికి జనం సంగతి పక్కన పెడితే సొంత పార్టీ క్యాడర్ కూడా పెద్దగా రావడం లేదు. సొమ్ములిచ్చి రప్పించుకున్న వారు కూడా ఇలా కనిపించి అలా మాయమై పోతున్నారు. ఈ నేపథ్యంలోనే విజయసాయిరెడ్డి తన ఓటమి తానే ఓప్పుకునేలా చేసిన వ్యాఖ్యలు పార్టీ శ్రేణులను సైతం నైరాశ్యంలో ముంచేశాయి. ఇంతకీ ఆయన సమాజిక మాధ్యమం వేదికగా ఏమన్నారంటే.. నిజాయితీగా పని చేస్తున్న అనంత రేంజ్ డీఐజీ అమ్మిరెడ్డిని, అనంతపురం డీజీపీని ఎన్నికల కమిషన్ బదిలీ చేసేసింది. ఇదేక్కడి న్యాయం. వాస్తవానికి తెలుగుదేశం కదిరి అభ్యర్థి కందికుంట ప్రసాద్ కారులో  రూ. 2 కోట్ల భారీ మొత్తంలో నగదును స్వాధీనం చేసుకున్నందుకు పోలీసులు వారిని అభినందించాలి అని పేర్కొన్నారు. అక్కడితో ఆగకుండా ఎన్నికల సంఘం అనంత పోలీసు అధికారులను బదిలీ చేయడం వెనుక చంద్రబాబు ఉన్నారని ఆరోపించారు. చంద్రబాబు వ్యవస్థలను మేనేజ్ చేయడంలో సిద్ధహస్తుడని పేర్కొన్నారు.  

సాధారణంగా ఇలాంటి బేల మాటలు.. ఓటమి బాటలో ఉన్నప్పుడే నేతల నోట వస్తాయని పరిశీలకులు అంటున్నారు. అదే సమయంలో గత ఎన్నికలలో ఎన్నికల సంఘం తీరును అప్పుడు అధికారంలో ఉన్న చంద్రబాబు విమర్శించిన సందర్భంలో చంద్రబాబు ఓటమి భయంతో  మాట్లాడుతున్నారంటూ ఇదే విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలను పరిశీలకులు గుర్తు చేస్తున్నారు.  

అదలా ఉంచితే విజయసాయి రెడ్డి జగన్ సర్కార్ లో, వైసీపీలో అత్యంత కీలకమైన నాయకుడు. వరుసగా రెండు సార్లు జగన్ ఏరి కోరి ఆయనను రాజ్యసభకు పంపారు. అయితే ఇప్పుడు తన సొంత జిల్లా అంటూ చెప్పుకుని తగదునమ్మా నెల్లూరు లోక్ సభ అభ్యర్థిగా బరిలోకి దిగిన విజయసాయి జిల్లాకు చేసింది మాత్రం శూన్యం.  కూటమి తరపున వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కీలక పోటీదారుగా ఉన్నారు. వైసీపీ అభ్యర్థి విజయసాయి తాను స్థానికుడిననని ఎంత గట్టిగా చెప్పుకుంటున్నా సొంత పార్టీలోని కీలక నేతలే ఆయనకు మద్దతుగా నిలవడం లేదు. నుంచి పోటీ చేస్తున్న విజయసాయిరెడ్డి స్థానిక అభ్యర్థి అయినప్పటికీ ఆయనకు కీలక నేతలు, ప్రజల నుంచి గట్టి మద్దతు లేదు. ఇటీవలే జగన్ తో విభేదించి వైసీపీ నుంచి బయటకు వచ్చి తెలుగుదేశం గూటికి చేరిన వేమిరెడ్డి ప్రభాకరరెడ్డికి మద్దతుగా   చాలా వరకూ వైసీపీ క్యాడర్ ఆయనతో పాటే తెలుగుదేశం వైపు వచ్చేసింది.