దూసుకెళ్తున్న బాలశౌరి ... ఎన్నికల ప్రచారంలో బందరు పోర్టు  కీలకాంశం 

రాజ‌కీయంగా సీనియ‌ర్ కూడా అయిన మ‌చిలీప‌ట్నం ఎంపీ వ‌ల్లభ‌నేని బాల‌శౌరి త‌న మార్కు రాజ‌కీయాలు చేస్తున్నారు. బాలశౌరికి రాజ‌కీయంగా ఎంతో అనుభ‌వం ఉంది. ముఖ్యంగా ప్రజ‌ల‌ను త‌న‌వైపు తిప్పుకోవ‌డంలోనూ ఆయ‌న నేర్పుగా ముందుకు సాగుతార‌నే పేరు తెచ్చుకున్నారు.గత  ఎన్నిక‌ల్లో మ‌చిలీప‌ట్నం నుంచి  ఎంపీగా పోటీ చేసి గెలిచిన వ‌ల్లభ‌నేని బాల‌శౌరి ఇక్కడి నుంచి  వ‌రుసగా రెండోసారి విజయం సాధిస్తారని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. గత ఎన్నికల్లో  టీడీపీ నాయ‌కుడు కొన‌క‌ళ్ల నారాయ‌ణ‌ను ఓడించి విజ‌యం ద‌క్కించుకున్న బాలశౌరి త్రి కూటమి అభ్యర్థిగా మచిలీ పట్నం పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు.  ఆ వెంట‌నే ఆయ‌న కార్యరంగంలోకి దిగిపోయారు.బందరు పోర్టు విషయంలో బాలశౌరి  రాజీ లేని పోరాటం కొనసాగిస్తున్నారు. స‌మ‌స్యలున్న చోట తాను ఉన్నానంటూ నిరూపించుకుంటున్నారు. కీల‌క బందరు ప్రాజెక్టు విషయంలో బాలశౌరికి  మంచి పేరు తెస్తోంది. కృష్ణా జిల్లా వాసుల చిరకాల కల అయిన బందరు పోర్టు విషయంలో ఆయన హాయంలోనే  కదలిక వచ్చింది. గత  ఏడాది ఆగస్టులో పోర్టు నిర్మాణ బాధ్యతల నుంచి నవయుగ సంస్థను తప్పిస్తూ వైకాపా  ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంతో పోర్టు నిర్మాణంపై జిల్లావాసుల్లో ఆశలు సన్నగిల్లాయి. పోర్టు నిర్మాణాన్ని రాష్ట్ర ప్రభుత్వం చేపడుతుందని మంత్రులు ప్రకటిస్తూ వచ్చినా దానిపై స్పష్టత లేకుండాపోయింది.
 తాజాగా మచిలీపట్నం ఎంపీ బాలశౌరి చొరవ తీసుకోవడంతో కెనరా బ్యాంకు పోర్టు నిర్మాణానికి రుణ సాయం చేసేందుకు ముందుకు వచ్చింది. కెనరా బ్యాంకు ఎండీ ఆర్‌ఏ శంకర్‌నారాయణను బాల‌శౌరి స్వయంగా తీసుకువ‌చ్చి.. సీఎం జగన్‌ను సచివాలయంలో కలిసేలా ఏర్పాటు చేశారు. వీరి నడుమ సుమారు అరగంటకుపైగా భేటీ జరిగింది. ఈ భేటీలో బాలశౌరి కీల‌కంగా వ్యవ‌హ‌రించారు. బందరు పోర్టు నిర్మాణానికి సుమారు రూ.4వేల కోట్ల రుణసాయం చేసేందుకు కెనరా బ్యాంకు సంసిద్ధత వ్యక్తం చేసింది.   పోర్టు నిర్మాణం త్వరలో మొదలవుతుందని వ‌ల్లభ‌నేని బాల‌శౌరి స్పష్టం చేస్తున్నారు.  దీంతో బందరు పోర్టు నిర్మాణంపై మళ్లీ ఆశలు చిగురించినట్లయింది. దీని వెనుక బాల‌శౌరి క‌ష్టం ఉండ‌డంతో ఆయ‌న అనుచ‌రులు హ‌ర్షం వ్యక్తం చేస్తుండ‌డం గ‌మ‌నార్హం.త్రి కూటమి కి చెందిన నేతలు, కార్యకర్తలతో బాటు వైకాపాలో ఆయన అనుచరులు ఎక్కువగానే ఉన్నారు. వీళ్లంతా సైలెంట్ గా బాలశౌరికి మద్దత్తు వహిస్తున్నారు.  అయితే, రెండు నెల‌ల కింద‌ట కూడా రాష్ట్ర స‌మ‌స్యల‌ను కేంద్రానికి వివ‌రించ‌డంలోను, లేఖలు రాయ‌డంలోనూ వల్లభనేని బాల‌శౌరి దూకుడు ప్రద‌ర్శించి అంద‌రినీ ఆక‌ట్టుకున్నారు.

పోర్టుకు సుదీర్ఘ చరిత్ర
ప్ర‌స్తుతం కృష్ణా జిల్లా కేంద్రమైన మ‌చిలీప‌ట్నం ఒక‌ప్పుడు బ్రిటిష్ హ‌యంలో పెద్ద తీర ప్రాంత ప‌ట్ట‌ణం. ఇక్కడనుంచి ఎన్నో ఎగుమ‌తులు, దిగుమ‌తులు జరిగేవి. అంతకు ముందే రెండు వేల సంవత్సరాల పూర్వం నుంచే ఇక్కడ నుంచి విదేశాలకు ఎగుమతులు, దిగుమతులు జరిగేవి.
మచిపలీట్నం లోక్‌సభ నియోజకవర్గం ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఉంది. ఈ నియోజకవర్గం నుంచి పలవురు సీనియర్ రాజకీయ నేతలు ఎంపీగా గెలిచారు. ఈసారి ఎన్నికల్లో ఎలాగైన సత్తా చాటాలని ప్రధాన పార్టీలు పట్టుదలతో ఉన్నాయి.
ఆంధ్రప్రదేశ్‌‌లోని 25 లోక్‌సభ స్థానాల్లో మచిలీపట్నం ఒకటి. అవనిగడ్డ, గన్నవరం, గుడివాడ, పామర్రు (ఎస్ సి), పెడన, పెనుమలూరు, మచీలీపట్నం అసెంబ్లీ నియోజకవర్గాలు మచిలీపట్నం లోక్‌సభ స్థానం పరిధిలోకి వస్తాయి. మచిలీపట్నం లోక్‌సభ స్థానానికి రాజకీయంగా చాలా ప్రాముఖ్యత ఉందని చెప్పాలి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సీనియర్లుగా ఉన్న పలువురు నేతలు ఇక్కడి నుంచి ఎంపీగా ప్రాతినిధ్యం వహించడం విశేషం. ఇక్కడ కాంగ్రెస్, టీడీపీల హవా ఎక్కువగా కనిపిస్తోంది. ఈ నియోజకవర్గంలో మొత్తం 1,518,826మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో పురుషులు 737,936కాగా.. మహిళలు 780,825మంది ఉన్నారు.
మచిలీపట్నం లోక్ సభ నియోజకవర్గం చరిత్రను గమనిస్తే.. 1952లో తొలిసారి ఎన్నికలు జరగ్గా.. సీపీఐ నుంచి పోటీచేసిన సనక బుచ్చికోటయ్య గెలిచారు. 1957లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మండలి వెంకట కృష్ణారావు విజయం సాధించారు. 1962లో మండలి వెంకటస్వామి ఇండిపెండెంట్‌గా పోటీచేసి గెలుపొందడం విశేషం. 1967లో కాంగ్రెస్ నుంచి వై.అంకినీడు ప్రసాద్ విజయాన్ని అందుకున్నారు. 1971లో కాంగ్రెస్ నుంచి మేడూరి నాగేశ్వరరావు గెలిచారు. 1977లో కాంగ్రెస్ అభ్యర్థి మాగంటి అంకినీడు విజయం సాధించారు.. 1980లో తిరిగి ఆయనే గెలిచారు. 1984, 1989, 1991లో కాంగ్రెస్ నుంచి కావూరి సాంబశివరావు విజయం సాధించారు. 1996లో కైకాల సత్యనారాయణ (నటుగు) తెలుగు దేశం పార్టీ నుంచి పోటీచేసి గెలుపొందారు.

ఆంధ్రప్రదేశ్‌కు సుదీర్ఘమైన సముద్రతీరం ఉండడంతో దానిని ఆసరాగా చేసుకుని అభివృద్ధి చేయాలని వరుసగా ప్రభుత్వాలు ఆలోచనలు చేస్తున్నాయి. కానీ, ఆచరణ మాత్రం అందుకు తగ్గట్టుగా లేదు.
సుదీర్ఘ చరిత్ర కలిగిన మచిలీపట్నంలోని పోర్టు నిర్మాణం రెండడుగులు ముందుకు, మూడడుగులు వెనక్కి అన్న చందంగా కనిపిస్తోంది. పోర్టు నిర్మాణానికి నవయుగ కంపెనీతో వై.ఎస్. రాజశేఖర రెడ్డి ప్రభుత్వం 2007లో చేసుకున్న ఒప్పందాన్ని వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చాక రద్దు చేశారు. 
ఏపీలో ఇప్పటికే పోర్టుల ఆధారంగా ఎగుమతులు ఊపందుకున్నాయి. కరోనావైరస్ మహమ్మారి తర్వాత విశాఖ, కృష్ణపట్నం, కాకినాడ, గంగవరం పోర్టుల ద్వారా ఎగుమతులు పెరిగాయి. ఉదాహరకు కాకినాడ పోర్ట్ నుంచి 2020-21తో పోలిస్తే 2021-22 లో బియ్యం ఎగుమతులు 25 శాతం పెరిగినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి.
2019లో వల్లభనేని బాలశౌరి విజయం
2019లో జరిగిన లోక్ సభ ఎన్నికల్లో మచిలీపట్నం లోక్‌సభ నియోజకవర్గం నుంచి వైఎస్సార్‌సీపీకి చెందిన వల్లభనేని బాలశౌరి గెలిచారు. ఆయన 60వేలకుపైగా మెజార్టీతో టీడీపీ అభ్యర్థి కొనకళ్ల నారాయణరావుపై విజయం సాధించారు. వల్లభనేని బాలశౌరి వైఎస్సార్‌సీపీ నుంచి గెలిచినా.. రెండు నెలల క్రితం పార్టీకి దూరమయ్యారు. ఆయన వైఎస్సార్‌సీపీకి రాజీనామా చేసి జనసేన పార్టీలో చేరారు.. అయితే టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తులో ఉండటంతో మచిలీపట్నం టికెట్ జనసేన పార్టీకి దక్కింది. . సిట్టింగ్ ఎంపీ బాలశౌరి మరోసారి జనసేన పార్టీ నుంచి మచిలీపట్నం గెలుస్తారని ప్రచారం జరుగుతోంది.ఇటు వైఎస్సార్‌సీపీ డాక్టర్ సింహాద్రి చంద్రశేఖర్‌రావును మచిలీపట్నం లోక్‌సభ అభ్యర్థిగా నియమించింది. వైకాపా కార్యకర్తలు ఇటీవల జనసేన నేత కర్రి మహేశ్ ఇంటిపై దాడి చేసినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం కిమ్మనకుండా వ్యవహరిస్తోంది. వైకాపా అరాచకాల పట్ల ప్రజల్లో వ్యతిరేకత ఎక్కువైందని జనసేన నేత వాడ వీర ప్రతాప్ అన్నారు. వచ్చే ఎన్నికల్లో బాలశౌరి విజయం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు.