విజయసాయిరెడ్డి నోట మళ్లీ సొంత చానల్ మాట!
posted on Jul 16, 2024 9:41AM
వైసీపీ కీలక నేత, ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి నోట మరో సారి సొంత చానల్ మాట వచ్చింది. గతంలో కూడా ఒక సారి ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేసి సొంతంగా చానల్, పత్రిక ప్రారంభించబోతున్నట్లు ప్రకటన చేసి సంచలనం సృష్టించారు. అప్పట్లో అంటే ఆయన సొంత చానల్, పత్రిక ప్రకటన చేసిన సమయంలో ఆయనకు పార్టీలో ప్రాధాన్యత లేకుండా పోయింది. పార్టీలో ఆయన నంబర్ 2 స్థానాన్ని అప్పటి ప్రభుత్వ ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఆక్రమించేసుకున్నారు. దీంతో ఆయనకు పార్టీలో ఇసుమంతైనా గుర్తింపు లేని పరిస్థితి ఏర్పడింది. ఆ సమయంలో ఆయన సొంత చానల్, సొంత పత్రికా అంటూ మీడియా సమావేశం ఏర్పాటు చేసి మరీ ప్రకటన చేశారు.
ఇప్పుడు మళ్లీ ఆయన తీవ్రమైన ఇబ్బందుల్లో కూరుకుపోయారు. ఒక మహాళా అధికారితో అక్రమ సంబంధం ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. స్వయంగా ఆ మహిళా అధికారి భర్తే ఈ ఆరోపణ చేశారు. ఫిర్యాదు సైతం చేశారు. వైసీపీ తరఫున ఈ వార్తలను ఖండించడానికి ఎవరూ ముందుకు రాలేదు. ఒక్కరంటే ఒక్కరు కూడా విజయసాయిపై ఆరోపణలను ఖండించలేదు. దీంతో ఆయన ఇక పార్టీ అండ కోసం అర్రులు చాస్తూ కూర్చుంటే లాభం లేదన్న నిర్ణయానికి వచ్చేశారు. అదే సమయంలో ఒకే దెబ్బకు రెండు పిట్టలన్న చందంగా.. తాను ఏ పార్టీలో ఉన్నా తన చానల్ మాత్రం నిఖార్సైన వార్తలే ప్రసారం చేస్తుందని చెప్పండం ద్వారా పార్టీ మారే అవకాశాలున్నాయన్న విషయాన్ని సూచన ప్రాయంగా వెల్లడించి, ఒక విధంగా వైసీపీ అధినేత జగన్ ను బ్లాక్ మెయిల్ చేశారని కూడా చెప్పవచ్చు.
వాస్తవానికి విజయసాయి రెడ్డి పార్టీలో తనకు ఇబ్బందికర పరిస్థితులు ఉన్న సమయంలో మాత్రమే జగన్ పై ఒకింత ధిక్కార స్వరాన్ని వినిపిస్తారు. గతంలోనూ ఇదే జరిగింది. ఇప్పుడు కూడా అదే జరుగుతోంది.
విజయసారిరెడ్డికి పార్టీలో ఉక్కపోత మొదలైనా.. సమాధానం చెప్పుకోలేని ప్రశ్నలు ఎదురైనా ఆయన సొంత మీడియా అంటూ ముందుకు వస్తున్నారు. గతంలో వైసీపెలో నెంబర్ 2 గా ఓ వెలుగు వెలిగిన విజయ సాయి రెడ్డికి ఆ పార్టీలో ప్రాధాన్యత పూర్తిగా తగ్గిపోయింది. నెల్లూరు లోక్ సభ స్థానం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఘోర పరాజయం పాలైన తరువాత పార్టీలో ఆయనను పట్టించుకునే నాథుడే కరవయ్యారు. ఇప్పుడు అక్రమ సంబంధం ఆరోపణలతో ఉక్కిరిబిక్కిరౌతున్న విజయసాయి.. సెల్ఫ్ డిఫెన్స్ కోసం సొంత టీవీ చానల్ అంటూ హడావుడి చేస్తున్నారు.
అయితే గతంలో విజయసాయి సొంత చానల్ అని ప్రకటించిన సమయంలో ఆయనకు ఢిల్లీ పెద్దలతో పాటుగా పొరుగు రాష్ట్రానికి చెందిన ముఖ్యనేత అండదండలున్నాయన్న వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడా పరిస్థితి లేదు. ఢిల్లీలో చక్రం తెలుగుదేశం అధినేత చంద్రబాబు చేతుల్లో ఉంది. ఆయనకు నచ్చని పని చేయడానికి ఢీల్లీ పెద్దలు సాహసించే అవకాశం లేదు. ఇక పొరుగు రాష్ట్రం నుంచి కూడా విజయసాయికి సహకారం అందే అవకాశం లేదు. ఏపీలో వైసీపీ పరిస్థితిలాగే, పొరుగు రాష్ట్రంలో గతంలో విజయసాయికి అండదండగా నిలవడానికి ముందుకు వచ్చిన నేత ఉన్న పార్టీ పరిస్థితి కూడా దయనీయంగా ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో విజయసాయికి ఎటు నుంచీ సహకారం అందే అవకాశాలు లేవు.
ఇప్పుడేమిటి చాలా కాలంగా వైసీపీలో విజయసాయి రెడ్డి ఉక్కపోతకు గురవుతున్నారు. జగన్ రెడ్డి ఒకటొకటిగా విజయ సాయి పదవులు కత్తిరిస్తూ వస్తున్నారు. మరో వంక, విశాఖ భూదందాల బాగోతంలో విజయసాయి పీకలోతు కూరుకుపోయారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. జగన్ రెడ్డి కాదుకదా, వైసేపీ నాయకులు ఎవరూ ఆయనకు అండగా విజయసాయిపై ఆరోపణలు ఖండించడానికి ముందుకు రావడం లేదు. ఎవరూ ముందుకు రాని కారణంగానే జూపూడిని పక్కన పెట్టుకుని విజయసాయి సోమవారం (జులై 15) మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ పరిస్థితుల్లో విజయసాయి సొంత చానెల్ ప్రకటనను ఎవరూ పెద్ద సీరియస్ గా తీసుకున్నట్లు కనిపించడం లేదు.