బోడిగుండుకీ మోకాలికీ ముడేసిన విజయసాయి!

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ ఘోర పరాజయం పాలై నాలుగు నెలలు గడిచింది. ఇప్పటికీ ఆ పార్టీ ఓటమికి కారణాలను విశ్లేషించుకోవడం లేదు. అసలు ఓటమిని అంగీకరించడానికి ఇష్టపడటం లేదు.  ఇప్పటికీ వైసీపీ అధినేత జగన్ సహా ఆ పార్టీ నేతలు తమ పార్టీ ఓటమికి ఈవీఎంల ట్యాంపరింగే కారణమని చెబుతున్నారు. ఘోర పరాజయం పాలైన నాలుగు నెలల తరువాత కూడా ఈవీఎంలనే నిందిస్తూ కూర్చున్న పార్టీ దేశంలో వైసీపీ తప్ప మరొకటి ఉండదు.

తాజాగా ఆ పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు విజయసాయి ఆంధ్రప్రదేశ్ లో ఈవీఎంలు ట్యాంపర్ అయ్యాయని ఎక్స్ వేదికగా ఆరోపించారు. అక్కడితో ఆగకుండా హర్యానా ఎన్నికలలో బీజేపీ విజయానికి కూడా ఈవీఎంల ట్యాంపరింగే కారణమన్నారు. బోడిగుండుకీ మోకాలికీ ముడేసిన చందంగా విజయసాయి అసందర్భంగా  హర్యానా ఎన్నికల ఫలితాలకు, ఏపీలో ఈవీఎం ట్యాంపరింగ్ కు ముడి పెట్టి చేసిన ఈ వ్యాఖ్యలు సంచలనం సృష్టిస్తున్నాయి. ఈ ఆరోపణల ద్వారా జగన్ ను చిక్కుల్లోకి నెట్టేసి తాను వైసీపీ పగ్గాలు అందుకోవాలన్నదే విజయసాయి వ్యూహంగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.

హర్యానాలో బీజేపీ వరుసగా మూడో సారి విజయం సాధించడం వెనుక ఉన్నది ఈవీఎం ట్యాంప రింగేనని విజయసాయి ఆరోపణలు కచ్చితంగా బీజేపీ అగ్రనాయకత్వం, మరీ ముఖ్యంగా మోడీ, అమిత్ షాలకు ఆగ్రహం కలిగిస్తాయి. అసలు అలా వారికి ఆగ్రహానికి గురి కావాలన్న ఉద్దేశంతోనే విజయసాయి ఈ ఆరోపణలు చేసి ఉంటారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఉద్దేశపూర్వకంగా మోడీ, షాలకు జగన్ పై ఆగ్రహం కలిగేలా చేయడమే విజయసాయి వ్యూహంగా కనిపిస్తోందని అంటున్నారు. అలా చేస్తే జగన్ అక్రమాస్తుల కేసుల విచారణ వేగం పుంజుకుని జగన్ జైలుకు వెళ్లే పరిస్థితి వస్తుందని, అదే జరిగితే.. వైసీపీని తన గుప్పెట్లో పెట్టుకోవచ్చునన్నది విజయ సాయి వ్యూహంగా కనిపిస్తోందంటున్నారు.

అయితే విజయసాయి ఇక్కడో విషయాన్ని మరచిపోతున్నారంటున్నారు.  జగన్ అక్రమాస్తుల కేసు విచారణ వేగం పుంజుకుంటే.. జగన్ తో పాటు ఆ కేసులో ఏ2గా ఉన్న ఆయన కూడా చిక్కుల్లో పడతారనీ, జగన్ జైలుకు వెళ్లే పరిస్థితి వస్తే విజయసాయి కూడా కటకటాలు లెక్కించడానికి రెడీ అవ్వాల్సిందేననీ గుర్తు చేస్తున్నారు. 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu