మాల్యా కేసుపై జాయింట్ ఇన్వెస్టిగేషన్..

 

వేలకోట్ల రూపాయలు బ్యాంకులకు టోకరా వేసి విదేశాల్లో ఉన్న విజయ్ మాల్యాకు దెబ్బ మీద దెబ్బ తగులుతుంది. ఇప్పటికే ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) వల్ల పాస్ పోర్ట్ రద్దయింది. అంతేకాదు మాల్యాకు నాన్ బెయిలబుల్ వారెంట్లు జారీ చేయమని కోర్టులో పిటిషన్ దాఖలు చేయగా దానిని విచారించిన కోర్టు ఈడీ వాదనలతో ఏకీభవించి నాన్ బెయిలబుల్ వారెంట్లు జారీ చేసింది. ఇప్పుడు ఏకంగా మాల్యా కేసులపై అటు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ తోపాటు ఆదాయపు పన్ను, సీబీఐలు జాయింట్ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాయి. మాల్యా కంపెనీల వివరాలను అధికారులు సేకరిస్తున్నారు. పరోక్షంగా 20 కంపెనీల్లో మాల్యాకు వాటాలు ఉన్నట్లు గుర్తించారు. అమెరికా, యూకే, సౌతాఫ్రికాలోని లిక్కర్ కంపెనీల్లో మాల్యాకు బినామీ ఆస్తులున్నట్లు గుర్తించారు. మొత్తానికి మాల్యాకు రోజు రోజుకు ఉచ్చు బిగుస్తున్నట్టు కనిపిస్తోంది.