చర్చల దిశగా గన్నవరం రాజకీయం :- వల్లభనేని వంశీ అలక వీడేనా ?

 

గన్నవరం రాజకీయం సరికొత్త మలుపులు తిరుగుతోంది. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఆదేశల మేరకు కేశినేని నాని మరియు బందరు మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణ రావు..వల్లభనేని వంశీతో భేటీ అయ్యారు. బుధవారం రాత్రి ఎంపీ కేశినేని నాని ఇంటికి వల్లభనేని వంశీ వెళ్లగా.. అక్కడికి కొనకళ్ల నారాయణ కూడా వచ్చారు. దదాపు మూడు గంటల పాటు చర్చలు జరిపారు. వంశీ తన అభిప్రాయాలను వివరించినప్పటికీ.. మరొసారి ఆలొచించి నిర్ణయం తీసుకోవాల్సిందిగా కేశినేని నాని కొరారు. వంశీ సన్నిహితులు, పార్టీ కార్యకర్తలు తెలుగు దేశం పార్టీ లోనే కొనసాగాలని కొరుతున్నప్పటికి.. ప్రస్తుత ప్రభుత్వం అనేక మంది కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయించారని అందువల్ల వారంతా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పెర్కొన్నారు. తనను ఆర్ధికంగా.. రాజకీయంగా.. దెబ్బ తీసేందుకు ప్రయత్నిస్తున్నారని కూడా ఆవేదన వ్యక్తం చేసినట్టు తెలిసింది.వల్లభనేని వంశీ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ లో చేరేందుకు పూర్తిగా రంగం సిద్ధమైనట్లుగా గన్నవరంలో జోరుగా ప్రచారం జరుగుతోంది.

నవంబర్ మూడు లేదా నాలుగో తేదీల్లో ఆయన వైసీపీ లో చేరే అవకాశముందని ఆయన అనుచరులు చెబుతున్నారు. ఇంకా వంశీ తన శాసన సభ సభ్యత్వానికి రాజీనామా చేయలేదు.. రాజీనామా చేయకుండా వైసిపి లో చేరితే అది పార్టీ ఫిరాయింపుల చట్టం కిందకు వస్తుంది కనుక వైసిపి అధిష్టానం ఆదేశాల మేరకు వంశీ నడుచుకునే అవకాశముందని చెబుతున్నారు. తెలుగుదేశం పార్టీ లోని కొంత మంది నేతలు తన పట్ల వ్యవహరించిన తీరుపై కూడా వంశీ అభ్యంతరం వ్యక్తం చేశారు. వంశీని బుజ్జగించేందుకు నాని , కొనకళ్ల నారాయణ ప్రయత్నించారు. చిన్న చిన్న కేసులకు భయపడి పార్టీ ని వీడటం మంచిది కాదని రాజకీయంగానే సమస్యను ఎదుర్కోవాలని అందుకు చంద్రబాబు కూడా నీకు అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. వంశీకి చెప్పాల్సిందంతా చెప్పామని బంతి ఇప్పుడు వంశీ కోర్టు లోనే ఉందని కేశినేని నాని చెబుతున్నారు.వంశీ పై గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన యార్లగడ్డ వెంకట్రావు కు సీఎం జగన్ అపాయింట్ మెంట్ దొరకకపొవటంతో తాను జగన్ ని కలిసిన తర్వాత తన నిర్ణయాన్ని వెల్లడిస్తానని వెంకట్రావు ఇప్పటికే ప్రకటించారు.