కరోనాకు జీవించే హక్కుంది.. బీజేపీ నేత తిక్క మాట 

దేశంలో కొవిడ్ కల్లోలం రేపుతుంటే కొందరు నేతలు మాత్రం వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ జనాలను మరింత గందరగోళంలో పడేస్తున్నారు. ఇలాంటి కామెంట్లు చేయడంతో బీజేపీ నేతలు ముందున్నారు. కొందరు గోమూత్రంతో కరోనా పోతుందని చెబుతుండగా.. మరికొందరు యజ్ఞం చేస్తే వైరస్ మాయమవుతుందని ప్రకటనలు చేస్తున్నారు. తాజాగా ఉత్తరాఖండ్ మాజీ ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్ రావత్ కరోనా వైరస్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కరోనా వైరస్ కూడా మనుషుల్లాంటి జీవేనని అన్నారు. మనలాగే కరోనా కూడా బ్రతకడానికి ప్రయత్నిస్తోందని తెలిపారు. తన మనుగడ కోసమే వైరస్ రూపాన్ని మార్చుతోందని వివరించారు. మనందరిలాగే కరోనా వైరస్ కు జీవించే హక్కు ఉందని త్రివేంద్ర సింగ్ అభిప్రాయపడ్డారు. 

త్రివేంద్ర సింగ్ రావత్ గత మార్చిలో ఉత్తరాఖం్ సీఎం పదవికి రాజీనామా చేశారు. ఎప్పుడు వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం, వరదల సమయంలో సరిగా స్పందించలేదనే కారణంతోనే ఆయన తొలగించారనే వార్తులు వచ్చాయి. సొంత పార్టీ బీజేపీ నుంచి వచ్చిన వ్యతిరేకతతో ఆయన సీఎం పదవి నుంచి తప్పుకున్నారు. ఆయన స్థానంలో ఉత్తరాఖండ్ సీఎంగా తీర్థ్ సింగ్ రావత్ బాధ్యతలు చేపట్టారు.సీఎం పదవి పోయినా త్రివేంద్ర సింగ్ రావత్ తీరు మాత్రం మారలేదు. తరుచూ కాంట్రవర్శీ కామెంట్లు చేస్తూనే ఉన్నారు. కరోనా వైరస్ కు జీవించే హక్కు ఉందంటూ రావత్ చేసిన వ్యాఖ్యలపై తీవ్ర వ్యతిరేకత వస్తోంది. రావత్ ఏం చెప్పదలుచుకున్నారో అంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.