దాడులు చేశారు.. గుడిసెలు కాల్చారు.. 

అది న‌ర్సంపేట. కాక‌తీయ న‌గ‌ర్. సుమారు 300 కుటుంబాలు.  ప్రభుత్వ అసైన్డ్ భూముల్లో నిరుపేదలు గత నెల రోజుల నుంచి గుడిసెల‌ు వేసుకుని  జీవిస్తున్నాయి. వాళ్ళు అక్కడ ఉండడం కొందరు బడాబాబులకు నచ్చలేదు. ఆ  భూమిపై వారి కన్ను పడింది.  అంత బాడా బాబులు పధకం వేశారు. వారి అనుచరులతో పేదల గుడిసెలపై దాడి చేయించారు. దాడిచేయడం అంటే కర్రలతో కొట్టడం కాదు ఆ ఆ నిరుపేదల గుడిసెలకు నిప్పు అంటించారు. ఒక్కసారిగా ఆ గుడిసెలు అన్ని  కాలి బుగ్గి అయిపోయాయి. దీంతో ఇదంతా చూస్తున్న వారు కన్నీరుమున్నీరుగా విలపించారు. గుడిసెలకు నిప్పు పెడుతుండగా కొంతమంది స్థానిక మహిళలు అడ్డుకోగా వారిపై విచక్షణారహితంగా దాడి చేసి గాయపర్చారు. మహిళలతో పాటు చిన్నారులకు కూడా దారుణంగా చితకబాదారు. సుమారు 40 మంది దుండగులు మారణాయుధాలతో వచ్చి బీభత్సం సృష్టించారు. పడుకున్నవారిపై విచక్షణారహితంగా దాడి చేయడంతోపాటు వాడి గుడిసెలు దగ్ధం చేశారు. మహిళలు, వృద్ధులు, చిన్నారులు అన్న తేడా లేకుండా అందరిపై పాశవికంగా దాడి చేశారు. దీంతో అక్కడే ఉన్న వ్యక్తులు, మహిళలు వారిలో కొంతమందిని పట్టుకున్నారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వివరాలను సేకరించి మహిళలు పట్టుకున్న వారిని అదుపులోకి తీసుకున్నారు.

ఈ దారుణానికి పాల్పడటం వెనుక ఎవరున్నారో తేల్చి వారిని కఠినంగా శిక్షించాలని మహిళలు పోలీసులను కన్నీటితో వేడుకున్నారు. తమ జీవితాలను నివసించడానికి నిలువనీడ లేకుండా చేసిన వారిని కఠినంగా శిక్షించాలని పోలీసులను వారు డిమాండ్ చేశారు. ఘ‌ట‌నాస్థ‌లాన్ని పరిశీలించిన పోలీసులు అక్క‌డ ఉద్రిక్త ప‌రిస్థితులు త‌లెత్త‌కుండా చూస్తున్నారు. కేసు న‌మోదు చేసుకుని విచార‌ణ ప్రారంభించారు. వరంగల్ రూరల్ జిల్లాలోని కాకతీయ నగర్ లోని 601 సర్వే నంబర్ లోని అసైన్డ్ భూముల్లో నిరుపేదలు నెల రోజుల కిందట గుడిసెలు వేసుకున్నారు. అక్కడ మొత్తం 300 గుడిసెలు వేసుకొని పేదలు నివస్థున్నారు. ఇంకేముంది.. బడాబాబుల కళ్లు వారిపై పడింది. అంతే పేదలను గుడిసెలను ఖాళీ చేయాలని బెదిరింపులకు దిగారు. ఎప్పటికప్పుడు సంఘటనా స్థలానికి వెళ్లి మర్యాదగా ఖాళీ చేసి వెళ్లి పోవాలని.. లేకపోతే మీరే నష్టపోతారని బెదిరింపులకు దిగినట్లు బాధితులు తెలిపారు.

కానీ పేదలు ఇవి ఎవరి సొంత భూములు కాదనీ.. మేమెందుకు ఖాళీ చేయాలని ప్రశ్నించారు. దీంతో అదే రోజు రాత్రి అందరు పడుకున్న సమయంలో గుడిసెలకు నిప్పు పెట్టారని తెలుస్తోంది. అడ్డు వచ్చిన మహిళలను, చిన్నారులను, వృద్ధులను అని కూడా చూడకుండా దారుణంగా చితక బాదారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ ప్రధానంగా రెండు పార్టీలకు చెందిన భూ కబ్జాదారులే ఈ దారుణానికి పాల్పడి ఉండవచ్చని.. తమకు న్యాయం చేయాలని అక్కడకు వచ్చిన పోలీసులను బాధితులు వేడుకున్నారు.ఇంకా మనం ఇలాంటి సమాజం లో బతుకుతున్నామా అని ఇలాంటి ఘటనలు చూసినప్పుడు అనిపిస్తుంది. అప్పుడప్పుడు పేదలు బతకడానికి అవకాశం లేదా అనిపిస్తుంది.