కరోనా వ్యాక్సిన్ తీసుకున్న ఉపాసన
posted on Jan 28, 2021 3:43PM
భారత్ లో కరోనా వ్యాక్సినేషన్ ప్రారంభమైన సంగతి తెలిసిందే. అక్కడక్కడ కొందరు అస్వస్థకు గురైన ఘటనలు వెలుగులోకి వస్తున్నప్పటికీ.. దాదాపు అన్ని ప్రాంతాలలో వ్యాక్సినేషన్ ప్రక్రియ సాఫీగానే సాగుతుంది. అయితే కొందరు మాత్రం వ్యాక్సిన్ పై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. వ్యాక్సిన్ వల్ల సైడ్ ఎఫెక్టులు వచ్చే ప్రమాదముందన్న భయం కూడా ప్రజలలో నెలకొంది. ఈ నేపథ్యంలో కరోనా వ్యాక్సిన్లపై నెలకొన్న అపోహలను తొలగించేందుకు మెగా హీరో రామ్ చరణ్ సతీమణి ఉపాసన కొణిదెల ముందుకొచ్చారు. హైదరాబాద్ అపోలో ఆసుపత్రిలో గురువారం ఆమె కరోనా వ్యాక్సిన్ తీసుకున్నారు. తద్వారా, వ్యాక్సిన్ పై ఎలాంటి భయాందోళనలు చెందాల్సిన అవసరంలేదని చెప్పే ప్రయత్నం చేశారు. ఎలాంటి భయాలు అవసరంలేదని, అందరూ కరోనా వ్యాక్సిన్ వేయించుకోవాలని ఉపాసన సూచించారు.