హనుమంతుడు దళితుడన్న సీఎం కు నోటీసులు

 

ఓట్ల కోసం దేవుళ్ళని కూడా కులాల పేరుతో విభజిస్తారు కొందరు నేతలు. అలాంటి వారిలో యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్ ఒకరు. రాజస్థాన్‌లో ఎన్నిక‌ల ప్ర‌చారంలో పాల్గొన్న యోగి హనుంతుడికి కులం ఆపాదించారు. రాజస్థాన్‌లోని ఆల్వార్‌ జిల్లా మాలాఖేడాలో జరిగిన ఎన్నికల ర్యాలీలో సీఎం యోగి మాట్లాడుతూ.. 'హనుమంతుడు అడవిలో జీవించేవాడు. ఆయన నిరుపేద దళితుడు. రాముని ఆకాంక్ష మేరకు ఆయన భారత సమాజాన్ని ఏకం చేయటానికి కృషి చేశాడు. ఆయన మాదిరిగానే మనం కూడా రాముని ఆకాంక్షను నెరవేర్చేదాకా విశ్రమించకూడదు. రామ‌భ‌క్తులు కేవ‌లం బీజేపీకి మాత్ర‌మే ఓటు వేస్తారు, కానీ రావ‌ణ భ‌క్తులు మాత్రం కాంగ్రెస్‌కు ఓటేస్తారని' అన్నారు. యోగి వ్యాఖ్యలను పలు హిందూ సంస్థలు తప్పుపట్టాయి. ఓ హిందూ సంస్థ లీగల్‌ నోటీసులు కూడా ఇచ్చింది. మూడు రోజుల్లోగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేస్తూ రాజస్థాన్ సర్వ్‌ బ్రాహ్మిణ్‌ మహాసభ అధ్యక్షుడు సురేష్‌ మిశ్రా నోటీసులు పంపారు. మరి యోగి వ్యాఖ్యల దుమారం ఇంకెంత దూరం వెళ్తుందో చూడాలి.