సకాలంలో ఫీజు రీఎంబర్స్‌మెంట్‌

 

శంషాబాద్‌లోని క్లాసిక్ కన్వెన్షన్ సెంటర్‌లో ప్రైవేటు విద్యాసంస్థల ప్రతినిధులతో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ భేటీ అయ్యారు. ఆ సభలో రాహుల్‌తో పాటు ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి, కోదండరాం తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. ప్రైవేట్‌ విద్యాసంస్థలపై కేసీఆర్‌ నిరంకుశంగా వ్యవహరించారని విమర్శించారు. కేసీఆర్‌ ప్రభుత్వం సకాలంలో ఫీజు రీఎంబర్స్‌మెంట్ చేయలేదన్నారు. తాము అధికారంలోకి వచ్చాక ప్రైవేట్‌ విద్యాసంస్థలకు జరిగిన నష్టాన్ని భర్తీ చేస్తామని.. సకాలంలో ఫీజు రీఎంబర్స్‌మెంట్‌ విడుదల చేస్తామని హామీ ఇచ్చారు. అదేవిధంగా హెల్త్‌ ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పిస్తామని, విద్యుత్ చార్జీలు తగ్గిస్తామని రాహుల్‌ గాంధీ తెలిపారు.

ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ.. పౌల్ట్రీఫాంలో కాలేజీలు నడిపిస్తున్నారంటూ కేసీఆర్‌ ప్రైవేట్‌ విద్యాసంస్థలను అవమానించారని మండిపడ్డారు. విద్యాసంస్థల్లో పోలీసులతో దాడులు చేయించారన్నారు. కేసీఆర్‌ కార్పొరేట్‌ విద్యాసంస్థలకు కొమ్ముకాశారని ఆరోపించారు. అధికారంలోకి వస్తే ప్రైవేట్ విద్యాసంస్థలకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. రెండు విడతల్లో ఫీజు రీఎంబర్స్‌మెంట్‌ విడుదల చేస్తామన్నారు.